ఇచ్చుకో వంద.. ఇదీ అక్కడి దందా!
- BAGADI NARAYANARAO
- Aug 13
- 2 min read
వసూళ్లు మరిగిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది
నిర్దేశిత ఫీజులతోపాటు కొసరు ఇవ్వాల్సిందే
ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు ఎల్‌పీఎం కావాలని కొర్రీలు
జీపీ ఆధారిత లావాదేవీల్లోనూ అవకతవకలు

(సత్యంన్యూస్,శ్రీకాకుళం)
ఆ కార్యాలయంలో అందించే సేవలకు నిర్దేశిత ఫీజులతోపాటు కొసరుగా కొంత సమర్పించుకుంటేనే పనులు జరుగుతాయి. అవసరమైన పత్రాలు చేతికందుతాయి. సేవల్లోనూ విపరీత జాప్యం జరుగుతోంది. సబ్ రిజిస్ట్రార్లు అనవసర కొర్రీలతో రిజిస్ట్రేషన్లలో జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే జీపీ రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరుగుతున్నట్లు తెలిసింది. శ్రీకాకుళంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే కాకుండా జిల్లాలోని అన్ని కార్యాలయాల్లోనూ ఇదే దుస్థితి ఉన్నట్లు ఆరోపణలు వినిపిసు ్తన్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అందించే పౌరసేవలకు చెల్లించాల్సిన ఫీజులు, ఆ సేవలు, పత్రాలు ఇచ్చేందుకు పట్టే గరిష్ట సమయాన్ని నిర్దేశించే సిటిజన్ చార్టర్ అమల్లో ఉంది. ఆ మేరకు కార్యాలయాల ఆవరణల్లో వాటి వివరాలతో కూడిన బోర్డులు ఉంటాయి. కానీ అవన్నీ నామమాత్రమే.. అలంకారప్రాయమే. ఇక్కడ జరిగే తంతు అంతా వాటికీ అతీతంగానే ఉంటుందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పౌరసేవలు మరింత భారంగా మారుతున్నాయి. ఈసీ, మార్కెట్ వాల్యూ పత్రాల జారీకి నిర్దేశించిన రుసుము కంటే అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 30 ఏళ్లు పైబడిన ఆస్తులకు సంబంధించి ఈసీ, సీసీ, మిగతా సేవలకు రూ.500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 30 ఏళ్ల లోపు ఆస్తులకైతే ఇవే సేవలకు రూ.200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీటికి అదనంగా రెండు సందర్భాల్లోనూ రూ.100 యూజర్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుములు అధికారికం. అయితే ఇవి చెల్లించినంతమాత్రాన మనం కోరుకున్న పత్రాలు ఇచ్చేయరు. వాటిని ఇచ్చే ఉద్యోగులను, అధికారులను సంతృప్తిపరచాలి. ఇందుకోసం ప్రతి సేవకు నిర్దేశిత ఫీజులతోపాటు అదనంగా రూ.100 చేతిలో పెడితేనే కావలసిన ధ్రువపత్రాలు ఇస్తున్నారు. అంటే రూ.600 చెల్లించాల్సినచోట రూ.700, రూ.300 చెల్లించాల్సిన చోట రూ.400 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది గుంజుతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్‌కు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. కానీ వినియోగదారుల నుంచి రూ.100 వసూలు చేస్తున్నారు. అదనంగా డబ్బులు తీసుకుంటున్నందున సకాలంలో సర్టిఫికెట్లు ఇస్తున్నారా అంటే అదీ లేదు. ఈసీ, మార్కెట్ వాల్యూ ధ్రువపత్రాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ధేశించిన సమయం పది నిమిషాలు. కానీ స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది వాటికి 12 గంటల సమయం తీసుకుంటున్నారు. జిల్లాలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇదే తంతు సాగుతుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసీ, మార్కెట్ వాల్యూ పత్రాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే ఇవ్వాల్సిన సమాచారంతో పాటు వినియోగదారుడికి అవసరంలేని బోల్డంత సమాచారం ఆ పత్రాల్లో చొప్పిస్తున్నారు. దీనివల్ల తమకు అవసరమైన సమాచారం కోసం 30 కంటే ఎక్కువ ఎంట్రీల నుంచి వెతుక్కోవలసి వస్తుందని వినియోగదారులు వాపోతున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే అదనపు డబ్బు అందదన్న దుగ్ధతోనే ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా వినియోగదారులను ప్రేరేపించడానికే ఇలాంటి ఎత్తుగడలు అమలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
అనవసర కొర్రీలతో ఇబ్బందులు
ప్రత్యేకంగా అభివృద్ధి చేసే లే అవుట్లలో ఫ్లాట్ల క్రయవిక్రయాల విషయంలో సబ్ రిజిస్ట్రార్లు కొత్త కొర్రీలు పెడుతున్నారని తెలిసింది. లేఅవుట్లకు ప్రభుత్వం ఎల్‌పీ నెంబర్లను మాత్రమే కేటాయిస్తుంది. కానీ ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్లు ఎల్‌పీఎం నెంబర్లు కావాలని వినియోగదారులను డిమాండ్ చేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. భూముల రీసర్వే తర్వాత మాత్రమే సర్వే నెంబర్ల స్థానంలో ఎల్‌పీఎం నెంబర్లను ప్రభుత్వం కేటాయించింది. కానీ ఈ రీసర్వే నుంచి లే అవుట్లను మినహాయించారు. అయినా సబ్ రిజిస్ట్రార్లు ఎల్పీ నెంబరుకు బదులు ఎల్‌పీఎం నెంబర్ నమోదు చేయాలని కోరడం కొత్త సమస్యలకు దారి తీస్తోంది. ఇదే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా జీపీతో రిజిస్ట్రేషన్ చేయాలనుకునేవారికి చుక్కెదురువుతోంది. జీపీ హోల్డర్‌తో పాటు జీపీ ఇచ్చిన ఆసామికి ఆధార్‌తో లింక్ అయిన ఫోన్‌కు ఓటీపీ పంపిస్తున్నారు. ఇద్దరికీ వేర్వేరుగా పంపించే ఓటీపీలు ఎంట్రీ చేస్తే తప్ప రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగదు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా జీపీ రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. అయితే సబ్ రిజిస్ట్రార్లు అతి తెలివి ప్రదర్శించి జీపీల రిజిస్ట్రేషన్‌ను దొడ్డిదారిలో చేసేస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. జీపీ హోల్డర్‌నే జీపీ ఇచ్చిన యజమానిగా ఎంట్రీ చేసి సబ్‌రిజిస్ట్రార్ సూచించిన ఫోన్ నెంబర్లకు ఆధార్‌ను అనుసంధానం చేయించి వాటికి ఓటీపీలు పంపించి రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. దీనివల్ల అప్పటికప్పుడు వ్యవహారం చక్కబెట్టవచ్చేమో గానీ జీపీతో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న కొనుగోలుదారులు భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కొక తప్పదని డాక్యుమెంట్ రైటర్స్ చెబుతున్నారు. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేయడం ప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకమని చెబుతున్నారు. జీపీ ఇచ్చిన వ్యక్తి దీన్ని వ్యతిరేకిస్తే కొనుగోలుదారులకు సమస్య తప్పదని హెచ్చరిస్తున్నారు.
Commentaires