ఇదిగో ఇవే ఆ సంబరాలు!
- BAGADI NARAYANARAO

- 3 days ago
- 2 min read
ప్రారంభమైన హెలికాఫ్టర్ రైడ్
24న ఎసఎస్ తమన్ మ్యూజికల్ నైట్
ప్రతీరోజు సురభి నాటకాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఈ ఏడాది ఆదిత్యుని రథసప్తమి వేడుÅ£లను సోమవారం నుంచి ఆదివారం వరకు ఏడు రోజుల పాటు నిర్వహించడానికి ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా వేడుకలు నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతుండగా అదే ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు గుండ అప్పల సూర్యనారాయణ మరణంతో విషాదం నెలకొంది. దీంతో వేడుకల నిర్వహణపై కొంత సందిగ్థం నెలకొంది. అప్పల సూర్యనారాయణది అరసవల్లి కావడంతో గతసారి మాదిరిగానే కేవలం మూడు రోజులకు వేడుక కుదించాలని మొదట భావించారు. కాకపోతే ప్రభుత్వం అంతకు ముందే దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి ఏడు రోజుల పాటు నిర్వహణకు జీవో జారీ చేసింది.
శ్రీకాకుళం నగరం కళా, సాంస్కతిక వేదికగా మార్చేందుకు సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజుల పాటు రథసప్తమి వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజు నగరంలో డచ్ బిల్డింగ్, ఎన్టీఆర్ మున్సిపల్ మైదానం, కోడి రామూర్తి స్టేడియం వేదికగా వివిధ కళా, సాంస్కతిక ప్రదర్శనలు, క్రీడలు నిర్వహిస్తున్నారు.
ఈ నెల 19 నుంచి 24 వరకు డచ్ బిల్డింగ్ వద్ద ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెలికాప్టర్ రైడ్‌ను నిర్వహిస్తున్నారు. గత ఏడాది నిర్వహించిన హెలికాప్టర్ రైడ్‌కు జిల్లా ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో మూడు రోజులు నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు నిర్వహించారు. ఈ ఏడాది ఆరు రోజుల పాటు నిర్వహించడానికి జిల్లా ఉన్నతాధికారులు నిర్వహించారు. గత ఏడాది ఒక్కో వ్యక్తికి 7 నిమిషాలు పాటు రైడ్ నిర్వహించడానికి డ్వామా అధికారుల పర్యవేక్షణలో రూ.2 వేలు వసూలు చేశారు. ఈ ఏడాది అదనంగా రూ.200 పెంచి ఒక్కొక్కరి నుంచి రూ. 2,200 వసూలు చేయాలని పౌర సరఫరాల సంస్థ అధికారులకు అప్పగించారు. వినోదాలు, ఫుడ్ కోర్టును వారం రోజుల పాటు నిర్వహించడానికి కోడి రామ్మూర్తి స్టేడియంలో ఏర్పాటు చేశారు. ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు. కిడ్స్‌ప్లే ఏరియా, అమ్యూజ్‌మెంట్ పార్క్‌ను అందుబాటులో ఉంచారు. ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు గ్రామీణ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు.
జనవరి 22 నుంచి కళా, సాంస్కతిక సందడికి చర్యలు తీసుకున్నారు. 22న ఉదయం 7 గంటలకు 80 అడుగుల రోడ్డులో మెగా సూర్య నమస్కారాలు నిర్వహించనున్నారు. కోడి రామ్మూర్తి స్టేడియంలో భారతి రమేష్ ఆర్కెస్ట్రా, శ్రీ సాయి శివ నృత్య కళానికేతన్ ప్రదర్శనలు, దుంపల ఈశ్వరరావు శాస్త్రీయ, జానపద సంగీతం, మావుడూరి బ్రదర్స్ మ్యూజికల్ షో జరగనున్నాయి. రాత్రి ఏడు గంటల నుంచి పవన్ బ్యాండ్, మిమిక్రీ షోతో పాటు ప్రముఖ గాయకుడు గోరేటి వెంకన్న గళం వినిపించనున్నారు. జబర్దస్త్ టీమ్ (ఇమ్మాన్యుయేల్, నూకరాజు, రియాజ్, ఆసియా) కామెడీ షో, తర్వాత బాణాసంచా ప్రదర్శన నిర్వహించనున్నారు.
23న మధ్యాహ్నం రెండు గంటల నుంచి డే అండ్ నైట్ జంక్షన్ నుంచి అరసవల్లి వరకు కన్నుల పండువగా శోభాయాత్ర నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాజు బ్రదర్స్ శాక్సాఫోన్, నీరజ సుబ్రమణ్యం శాస్త్రీయ నృత్యం, ఆరోహి మ్యూజికల్ అకాడమీ షో జరగనున్నాయి. రాత్రి ఏడు గంటల నుంచి జబర్దస్త్ రామ్‌ప్రసాద్ టీమ్ కామెడీ, యాంకర్ సౌమ్యారావు నిర్వహణలో ఖన్నా మాస్టర్ ‘డి-డాన్సర్ల బృందం నృత్యాలు, పల్సర్ బైక్ రమణ బృందం జానపద గీతాల సందడితో పాటు అద్భుతమైన లేజర్ షో చేయడానికి ఏర్పాట్లు చేయనున్నారు.
24న సంగీత దర్శకుడు థమన్ లైవ్ కాన్సర్ట్ జరగనుంది. వేడుకల చివరి రోజు సాయంత్రం సెలబ్రిటీలు అక్షఖాన్, మణికంఠ, తేజస్వినిల ప్రదర్శన ఇవ్వనున్నారు. తన్మయి శాస్త్రీయ నృత్యం, గణపతి శర్మ యామిని కర్రిల మ్యూజికల్ షో జరగనుంది. రాత్రి ఏడు గంటల నుంచి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లైవ్ కాన్సర్ట్ ఇవ్వనున్నారు. కార్యక్రమానికి సినీ నటుడు ఆది ముఖ్య అతిథిగా హాజరు కానుండగా, యాంకర్లు సాయికుమార్, చంద్రిక సందడి చేయనున్నారు. అనంతరం వేడుకల ముగింపులో భాగంగా డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అదే రోజు అర్ధరాత్రి నుంచి అరసవల్లి ఆలయంలో ఆదిత్యుని నిజరూప దర్శనం కానుంది.
సురభి నాటకోత్సవాలు
అంబేద్కర్ ఆడిటోరియంలో సోమవారం నుంచి సురభి నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారు. 19న భక్తప్రహ్లాద, 20న భూకైలాస్, 21న లవకుశ, 22న శ్రీనివాస కళ్యాణం, 23న మాయాబజార్ నాటకాల ప్రదర్శన ఇవ్వనున్నారు. అయితే రథసప్తమి వేడుకల్లో భాగంగా నిర్వహించే అన్ని కార్యక్రమాలను జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వ శాఖలకు అప్పగించారు. వీటి నిర్వహణ వ్యయం సమకూర్చే బాధ్యతను వారికి అప్పగించినట్టు తెలిసింది. ప్రభుత్వం వేడుకలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది తప్పా నిధులు వెచ్చించలేదని తెలిసింది. కలెక్టర్ నిధుల నుంచి కొంత, నగరపాలక సంస్థ జనరల్ ఫండ్ నుంచి కొంత, నగరంలో కొందరు ప్రముఖుల నుంచి విరాళాలు సేకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు, స్థానిక ఎమ్మెల్యే కషి చేస్తున్నారు.










Comments