ఇదేందయ్యా.. ఇది నేనెప్పుడూ సూడ్లా!
- NVS PRASAD

- Sep 2
- 2 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అసలు తమ శత్రువెవరో సామాన్యులకు తెలియదు. మన కంటికి కనిపించని వేర్వేరు పార్టీల ముసుగులు ధరించిన పాలకవర్గం మన ముందుంటుంది. విడివిడిగా ఉన్నట్లు, కలహిస్తున్నట్లు నటిస్తునే కలిసేవుంటుంది. జనంలో మాత్రం విధ్వేషం నింపి విడగొడుతుంది. మనమేమో రకరకాల సమస్యల గాయాలతో రోధిస్తుంటే.. మరేదో అస్తిత్వ సందిగ్ధంలో అలమటిస్తుంటే.. ఇంకేవో బృందాలను క్రూరప్రత్యర్థులుగా భ్రమించి మనలాంటి మరో గుంపుతో కొట్టుకు చస్తునే ఉంటాం. ఈ గాయాలు పెంచే గలాటాల్లో మన జీవితాలు గడిచిపోతాయి.
పోయినోళ్లంతా మంచోళ్లు.. ఉన్నోళ్లు పోయినోళ్ల తీపిగురుతులు అన్నాడు ఆత్రేయ మూగమనసుల్లో. నిజమే.. పోయిన తర్వాత ఎవరికైనా దండేసి దండం పెట్టడమే మన సంస్కృతి, సంప్రదాయం. అందులోనూ ‘ఉన్నోడు’ అందరికీ కావాల్సినోడు కాబట్టి ఆ గురుతులు ఎప్పటికీ చెరిగిపోనివి, చెరపలేనివి. కాకపోతే దీనికి రాజకీయ రంగు పులిమినప్పుడే చిక్కొచ్చిపడుతుంది. మాజీ మున్సిపల్ చైర్మన్ వరం కుటుంబం గడిచిన ఎన్నికలకు ముందు వైకాపాను వీడి తెలుగుదేశం గూటికి చేరిందనగానే ఆ ప్రాంతంలో ధర్మాన, వైఎస్ అభిమానులు ఈ కుటుంబాన్ని రాజకీయంగా ధీటుగా ఎదుర్కోవడం కోసం గ్యాప్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అంతెందుకు.. పోలింగ్ రోజున గుజరాతిపేట బూత్‌లో ధర్మాన తనయుడు చిన్నీతో స్థానిక టీడీపీ నేతలు గొడవకు దిగారు. స్వయంగా ధర్మాన ప్రసాదరావు కూడా ఈ పోలింగ్ బూత్‌ను ఆ రోజు మధ్యాహ్నం పరిశీలించారు. ఒక ప్రాంతంలో తమకు వ్యతిరేకంగా వెళ్లిపోయినవారిని పరాయివారిగానే చూస్తారు కార్యకర్తలు. పార్టీలకు ఎలాగూ సిద్ధాంతాలు ఉండవు కాబట్టి కనీసం తాము నమ్ముకున్నందుకైనా సొంత సిద్ధాంతాలు పాటించాలనేది సగటు కార్యకర్త మనోగతం. గుజరాతిపేట ఏరియాలో వరం తనయులు టీడీపీలో చేరిన తర్వాత వైకాపా నేతలు ఆ కుటుంబానికి దూరంగా ఉన్నారు. వాస్తవానికి ఆ ప్రాంతానికి, శ్రీకాకుళం పట్టణానికి వరం అనేక సేవలందించారు. కానీ పార్టీ పార్టీయే అనే సిద్ధాంతంతో వరం తనయులకు వైకాపా దూరంగా నడుస్తోంది. కట్ చేస్తే.. మంగళవారం ఏడురోడ్ల జంక్షన్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా పూలమాలలు వేయడానికి వైకాపా జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్‌తో పాటు కేడర్ చాలామంది పాల్గొన్నారు. అదే ఏడురోడ్ల జంక్షన్‌లో స్వర్గీయ వరం విగ్రహం కూడా ఉంది. మంగళవారం ఆయన ఐదో వర్ధంతిని ఆయన కుటుంబం నిర్వహించింది. ఈ సందర్భంగా పూలమాలలు వేయడానికి వచ్చారు. వైఎస్సార్ ప్రొగ్రామ్‌కు వచ్చిన కృష్ణదాస్, ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు వైఎస్సార్ జయంతిని త్వరత్వరగా ముగించేసి వరం విగ్రహం దగ్గరకు వెళ్లి దండలేసి దండం పెట్టొచ్చారు. అప్పటి వరకు తమ ఎదురుగానే వరం వర్ధంతి కార్యక్రమం జరుగుతున్నా గుజరాతిపేట వైపు నుంచి వచ్చిన కార్యకర్తలు అటువైపు వెళ్లడానికి సంకోచించారు. కానీ పక్క పార్టీ అధ్యక్షుడే వరం విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించడంతో ఔరా.. రాజకీయం అంటూ వారంతా ముక్కున వేలేసుకున్నారు. నగరంలో వరంది కూడా రాజశేఖరరెడ్డి లాంటి పరిస్థితే. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ చనిపోయాడు కాబట్టి రాజశేఖరరెడ్డి తమవాడని కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంటుంటే.. రాజశేఖరరెడ్డి బిడ్డగా తాను ఆయన పేరుతో పార్టీని స్థాపించాను కాబట్టి ఆయన వారసత్వంతో పాటు హక్కులు కూడా తనవేనంటూ జగన్మోహన్‌రెడ్డి చెప్పుకుంటారు. వరం చనిపోయే సమయానికి వైకాపాలో ధర్మానతోనే ఉన్నారు. కానీ వారి కుమారులు, కుమార్తె మాత్రం ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. చిన్నీ, కృష్ణదాస్‌లు నివాళులర్పించడానికి రాజశేఖరరెడ్డి కథ ఒక కారణమైవుండొచ్చు. కానీ దిగువస్థాయి కార్యకర్త మాత్రం తమ పార్టీలో లేనివాడ్ని ప్రత్యర్థిగా కాకుండా శత్రువుగా చూస్తాడు. కృష్ణదాసే వెళ్లి దండలేసి దండం పెట్టేసరికి గుజరాతిపేట ప్రాంత వైకాపా నాయకులు పాలిపోయిన మొహాలతో వరం సంతానం వద్దకు వెళ్లి పలకరించాల్సి వచ్చింది. ఇక్కడ వైకాపా నుంచి వరానికి నివాళులర్పించినవారిలో సూరిబాబు, పిల్లల నీలాద్రి వంటివారికి మినహాయింపులు ఉండొచ్చుగాక, కానీ ధర్మాన కృష్ణదాస్, ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడులు వరంకు నివాళులర్పించాలంటే.. వరం కుటుంబం చేస్తున్న కార్యక్రమంలో దూరిపోకుండా పార్టీ కార్యాలయంలోనో, ధర్మాన బంగ్లాలోనో ఆయన ఫొటోను ముందు పెట్టుకొని నాలుగు మంచిమాటలు చెప్పుంటే బాగుండేది.










Comments