ఇద్దరూ ఇద్దరే.. అక్రమాల్లో ఆరితేరినవారే!
- NVS PRASAD

- Jul 4, 2025
- 2 min read
సాంఘిక సంక్షేమ శాఖను భ్రష్టు పట్టించారు
ఒకరు శ్రీకాకుళంలో పని చేసి వెళితే..
ఇంకొకరు ఆయన స్థానంలో వచ్చినవారు
ఇరువురి పాపం పండినట్లే..
ఏసీబీ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం సాంఘిక సంక్షేమ శాఖ ఏం పుణ్యం చేసుకుందో గానీ.. ఈమధ్య కాలంలో తరచూ పత్రికల్లో పతాకశీర్షికై కూర్చుంటోంది. పేరుకు సోషల్ వెల్ఫేర్ అయినా.. ఇక్కడ సంక్షేమమంతా ఉద్యోగులు, అధికారులదేనన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి అక్కడక్కడ కొన్ని మినహాయింపులు ఉంటే ఉండొచ్చు గానీ.. ఈసారి మాత్రం శ్రీకాకుళం సోషల్ వెల్ఫేర్ రాష్ట్రస్థాయి శీర్షికైంది. ప్రస్తుతం ఈ జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీగా పని చేస్తున్న దాసరి మధుసూదనరావు, మొన్నటి వరకు ఇక్కడ డీడీగా పని చేసి బదిలీపై వెళ్లిపోయిన వై.విశ్వమోహన్‌రెడ్డిలపై ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఈమేరకు గురువారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. నెల్లూరు ఏసీబీ డీఎస్పీ ఎస్.శిరీషను విచారణ అధికారిగా నియమించినట్లు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
మధుసూదన్‌పై గతంలోనూ ఏసీబీ కేసు
సుమారు ఆరేళ్ల క్రితం నెల్లూరు సాంఘిక సంక్షేమ శాఖ డీడీగా పని చేస్తున్న రోజుల్లో ఆదాయానికి మించిన ఆస్తులున్నాయంటూ ఏసీబీ నమోదు చేసిన కేసులో మధుసూదనరావు సస్పెండయ్యారు. నెల్లూరు టౌన్‌లో మూడుచోట్ల, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ వంటి ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించినప్పుడు నెల్లూరులోని ఆయన నివాసంలో కేజీ బంగారం, కేజిన్నర వెండి నగలు లభ్యమయ్యాయి. అలాగే గుంటూరులో రెండు భవంతులు, ఆరు ఇళ్ల స్థలాలు, రెండు కార్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ మేరకు ఆదాయానికి మించి కోట్లలో ఆస్తి కలిగి ఉన్నారంటూ ఆయనపై కేసు నమోదైంది. ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయం ఇక్కడెవరికీ తెలియదు గానీ.. గత వైకాపా ప్రభుత్వంలో తన శాఖకే చెందిన మంత్రి వద్ద ఓఎస్‌డీగా పని చేశారని, ఈ కాలంలో జరిగిన అవకతవకలపైనే ప్రస్తుతం ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని తెలుస్తోంది. ఇక విశ్వమోహన్‌రెడ్డి ఇటీవల బదిలీల వరకు ఇక్కడే పని చేశారు.
పనిచేసిన చోటల్లా ఫిర్యాదులే..
ఇక విశ్వమోహన్‌రెడ్డి శ్రీకాకుళంలో పనిచేసిన కాలంలో ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. స్వయంగా ఆ శాఖ పరిధిలో పని చేస్తున్న వార్డెన్లే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతితో విచారణ కూడా జరిపించారు. తన శాఖలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో కొన్ని పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఒక దళితుడి నుంచి రూ.2.30 లక్షలు లంచం తీసుకున్నట్టు విశ్వమోహన్‌రెడ్డిపై ఫిర్యాదు అందింది. అయితే లంచం ఇస్తుండగా చూసినవారెవరూ లేరన్న ఒక్క కారణంతో ఈ కేసును నీరుగార్చేశారు. తాజాగా జిల్లా ఎస్పీ గ్రీవెన్స్‌లో కూడా ఇదే విషయం మీద ఫిర్యాదు చేశారు. రూ.2.50 లక్షలకు ఒప్పందం కుదరగా.. ఉద్యోగం వచ్చిన తర్వాత మిగిలిన రూ.20వేలు ఇస్తానంటే కుదరదని డీడీ విశ్వమోహన్‌రెడ్డి తేల్చేయడంతో బాధితుడు ఫిర్యాదు చేయాల్సివచ్చింది. ఇక శాఖలో బదిలీలు, పదోన్నతులు, మంత్లీల కోసం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. విశ్వమోహన్‌రెడ్డి రాయలసీమ రీజియన్‌లో ఒక జిల్లాకు సోషల్ వెల్ఫేర్ డీడీగా పని చేశారు. అక్కడ కూడా ఇటువంటి ఆరోపణలే ఉండటంతో ఆయన్ను ఆ శాఖ డైరెక్టరేట్‌కు సరెండర్ చేశారు. లైంగిక వేధింపుల కేసు కూడా ఈయనపై నమోదైంది. ఎక్కడా పోస్టింగ్ లేకపోవడంతో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పేషీలో కార్యదర్శిగా పని చేసిన రాయలసీమకే చెందిన ధనుంజయరెడ్డిని పట్టుకొని శ్రీకాకుళానికి పోస్టింగ్ తెచ్చుకున్నారని చెబుతుంటారు. ఆయన గతం, మొన్నటి వరకు శ్రీకాకుళంలో వచ్చిన ఆరోపణలపై కూడా నెల్లూరు ఏసీబీ డీఎస్పీ విచారణ చేపట్టనున్నారు.










Comments