ఇద్దరి రాజకీయ దురద.. నాగబాబు పాలిట బురద!
- Prasad Satyam
- Oct 17, 2025
- 3 min read
జనసేన జిల్లా అధ్యక్షుడికి తెలియకుండానే పర్యటన
స్థానిక ఎమ్మెల్యే పరోక్షంలో కాంప్లెక్స్ సమస్యపై హామీలు
కొందరి రాజకీయ వ్యూహాల్లో ఇరుక్కున పవన్ సోదరుడు
ఒక సాధారణ ఎమ్మెల్సీకి ప్రోటోకాల్ మర్యాదలు ఎందుకో?

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
‘అంతా నా ఇష్టం.. ఎడాపెడా చెలరేగినా.. అడిగేదెవడ్రా నా ఇష్టం’.. అంటూ అదేదో తన సినిమాలోనే పాడుకున్న కొణిదెల నాగబాబు ప్రజాప్రతినిధిగా కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. పవన్‌కల్యాణ్ సోదరుడిగా జనసేన కోటాలో ఎమ్మెల్సీ అయిన ఆయన శ్రీకాకుళం జిల్లాలో జరిపిన పర్యటన ఇక్కడి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమాల్లో పాడుకున్నట్లు రాజకీయాల్లో చేస్తామంటే కుదరదన్న విషయం ఆయనకు ఇంకా తెలిసిరాలేదు. శ్రీకాకుళం వస్తున్నట్లు అధికార కూటమి భాగస్వామ్య పార్టీలకు సమాచారం ఇవ్వలేదు సరికదా.. కనీసం జనసేన జిల్లా అధ్యక్షుడికైనా సమాచారం లేదు. కాకపోతే పత్రికల్లో ప్రకటన వచ్చింది కాబట్టి చాలామంది హాజరయ్యారు. ఎవరో ఒకరిద్దరు తమ ప్రాపకం కోసం జనసేన అగ్రనేత తమ చేతిలో ఉన్నట్లు చూపించే ఎత్తుగడలో భాగంగా నాగబాబును ఆగమేఘాల మీద శ్రీకాకుళం రప్పించి ఆర్టీసీ కాంప్లెక్స్ బురదలో అడుగు పెట్టించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రధానమంత్రి సభలో పాల్గొనేందుకు కర్నూలు వెళ్లిన సమయంలో ఆయన నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ మెరుగు కోసం నాగబాబు పర్యటించారని చెప్పడం మరో విడ్డూరం. కాంప్లెక్స్ ప్రతిసారీ వర్షాలకు మునిగిపోవడానికి కారణాలు ఏమిటో చెప్పడానికి పక్కన అధికారులు లేకుండా, అవగాహన ఉన్న రాజకీయ నాయకులు లేకుండానే నాగబాబుతో స్టేట్‌మెంట్ ఇప్పించడం రాజకీయ ఎత్తుగడ మాత్రమే. పవన్‌కల్యాణ్ లాగే నాగబాబుకు రాజకీయ చతురత లేదు. పవన్‌కల్యాణ్‌కు కనీసం సమస్యల మీద అవగాహన అయినా ఉంది. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లేదా మడ్డువలస కాలువ గురించి నాగబాబుకు వివరించే నాయకుడు ఈ జిల్లాలో ఎవరు? అటువంటి నేత ఒక్కరు కూడా ఆయన రెండు రోజుల పర్యటనలో ఎక్కడా కనిపించలేదు. రెండు నెలల క్రితం శ్రీకాకుళంలో నాగబాబు జనసేన కార్యకర్తలతో సమావేశమైనప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్ సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చామని, ఇప్పుడు దాన్ని పరిశీలించడానికి వచ్చారని చెబుతున్నారు. నాగబాబు కోణంలో అది వాస్తవం కావచ్చు. కాకపోతే శ్రీకాకుళానికి తనను ఆహ్వానించినవారి స్థాయి తెలుసుకోకపోవడం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం. జనసేన ఆవిర్భావం నుంచి ఎచ్చెర్ల టిక్కెట్ తనదేనని ప్రచారం చేసుకుంటున్న విశ్వక్‌సేన్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎవరున్నా.. సుడా చైర్మన్ లాంటి పదవి జనసేనకు ఉన్నా.. ఇక్కడ తానే పెద్ద నాయకుడినని చెప్పుకోడానికి నాగబాబును పక్కదారి పట్టించారని స్వయంగా జనసేన వర్గాలే చెబుతున్నాయి. ఇటీవలే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డైరెక్టర్‌గా నియమితుడైన విశాఖకు చెందిన పంచకర్ల సందీప్‌కు, నాగబాబుకు ఉన్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని సందీప్ ద్వారా విశ్వక్‌సేన్ నాగబాబును శ్రీకాకుళం రప్పించారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్‌కల్యాణ్‌కు సోదరుడు, ఎమ్మెల్సీ కమ్ సినీ నటుడు అయిన నాగబాబు రోడ్డు మీద అడుగు పెట్టినప్పుడు జనసైనికులు ఎంతమంది వస్తారో ఊహించొచ్చు. కానీ నిన్న ఆయన వెనుక ఎంతమంది ఉన్నారో మీడియాలో వచ్చిన ఫొటోలు చూస్తే తెలుస్తుంది. నాగబాబు పర్యటనలో సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ ఉన్నప్పటికీ ఆయన ప్రభావం ఎక్కడా కనపడలేదు. రానున్న ఎన్నికల్లో పాతపట్నం నుంచి కొరికాన పోటీ చేయాలంటే గతంలో అక్కడ పోటీ చేసిన గేదెల చైతన్య అడ్డు ఉండకూడదన్న ఉద్దేశంతోనే కొరికాన రవికుమార్ ఆయనతో కలిసి రాజకీయాలు చేస్తున్నారు. 2029 ఎన్నికల్లో చెరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న విశ్వక్‌సేన్, చైతన్యలు ఆ వ్యూహంతోనే ఒకేతాటి మీద పయనిస్తున్నారు. ఇప్పుడు చైతన్య చెప్పారు కాబట్టి కొరికాన రవికుమార్‌కు తెలిసింది. లేదంటే.. ఆయన్ను కూడా పక్కన పెట్టి ఉండేవారు.
షాడో ఎమ్మెల్యే అవుదామని..!
శాసనమండలి, రాజ్యసభలకు ఎన్నికైన వారు నిబంధనల ప్రకారం ఏదో ఒక నియోజకవర్గాన్ని తమ నోడల్ నియోజకవర్గంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రకారం ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు తన నోడల్ నియోజకవర్గంగా ఎచ్చెర్లను ఎంపిక చేసుకుంటారని తెలిసింది. పనిలో పనిగా ఎచ్చెర్ల కాపు నియోజకవర్గం అయినందున 2029 ఎన్నికల్లో నాగబాబును అక్కడే పోటీలో నిలబెట్టాలని విశ్వక్‌సేన్ భావిస్తున్నట్లు భోగట్టా. ఇప్పటి వరకు అక్కడ జనసేన కోటాలో ఆయన టిక్కెట్ ఆశించారు. కానీ అది కమ్మ సామాజికవర్గానికి చెందిన ఎన్‌ఈఆర్‌కు బీజేపీ కోటాలో దక్కింది. 2029 ఎన్నికల్లో కూడా చంద్రబాబునాయుడు ఎన్‌ఈఆర్‌ను కాదనలేని పరిస్థితి ఉండటంతో ఇక తనకు ఎచ్చెర్లలో టిక్కెట్ రాదని విశ్వక్‌సేన్‌కు అర్థమైపోయింది. అందుకే నాగబాబును జనసేన కోటాలో ఇక్కడ పోటీ చేయిస్తే.. గెలిచిన తర్వాత ఎలాగూ హైదరాబాద్ వెళ్లిపోతారు కాబట్టి నియోజకవర్గ పూర్తిస్థాయి బాధ్యత తనదే అవుతుందనే భావనతోనే విశ్వక్‌సేన్ నాగబాబును జిల్లా పార్టీ అధ్యక్షుడికి సైతం తెలియకుండా అటు ఎచ్చెర్ల నియోజకవర్గంలోను, ఇటు శ్రీకాకుళం హెడ్‌క్వార్టర్‌లోను తిప్పుతున్నారని జనసైనికులు గుసగుసలాడుకుంటున్నారు.
కాంప్లెక్స్ ఉద్ధరణా.. రాజకీయ ప్రాపకమా!
ఇక శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పర్యటన విషయంలో పాతపట్నానికి చెందిన గేదెల చైతన్య హస్తం ఉందని ఒక టాక్. తన పాతపట్నం నియోజకవర్గాన్ని కొరికాన రవికుమార్‌కు వదిలిపెట్టాల్సిరావడం వల్ల శ్రీకాకుళంపై చైతన్య ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజనంటూ జరిగితే.. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం రెండుగా మారుతుంది. ఇందులో ఒకటి కాపులకు అనుకూలమనే ప్రచారం చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. బహుశా ఆ కోణంలోనే చైతన్య ఆర్టీసీ కాంప్లెక్స్‌లో నాగబాబును తిప్పివుంటారు. శ్రీకాకుళంలో హడ్కో కాలనీ నిర్మించిన దగ్గర్నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మునిగిపోవడం ఆనవాయితీగా మారింది. ఇది మునిగిపోకూడదనే 1995`2000 మధ్యకాలంలో దూడ భవానీశంకర్ మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు రూ.7 కోట్లు మంజూరు చేస్తే అతి పెద్ద కాలువను నిర్మించారు. ఇది కూడా కాంప్లెక్స్‌ను ముంపు నుంచి కాపాడలేకపోయింది. ఆ తర్వాత ధర్మాన ప్రసాదరావు 2004 నుంచి మంత్రి అవుతూ వచ్చారు. ఎన్నో పరిష్కారాలు చూశారు.. కుదరలేదు. 2014లో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రి అయిన వెంటనే కాంప్లెక్స్‌లో అడుగుపెట్టారు. ముంపు నివారణకు మహత్తర ప్రణాళిక అన్నారు.. కుదరలేదు. మళ్లీ 2019లో కొత్త బస్సుల ప్రారంభోత్సవానికి తమ్మినేని సీతారాం, కృష్ణదాస్‌లు కాంప్లెక్స్‌లో అడుగుపెట్టారు. బయట ఉన్న ప్లాట్‌ఫారాలు ఎత్తు చేశారు తప్ప.. కాంప్లెక్స్ లోకి నీరు రాకుండా ఆపలేకపోయారు. 2024లో గొండు శంకర్ ఎమ్మెల్యే అయిన తర్వాత చినుకు పడితే కాంప్లెక్స్‌కు వెళ్లకుండాలేరు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇప్పుడు నాగబాబు వచ్చి దీని కోసం కౌన్సిల్‌లో మాట్లాడుతానంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత దీనికి పరిష్కారం దొరక్కపోతే జనంలో పల్చనయ్యేది జనసేనే. నాగబాబు పర్యటన గురించి జిల్లాలో అనేక నియోజకవర్గాల సమన్వయకర్తలకు, జనసైనికులకు తెలియకపోయినా ఎస్పీ, కలెక్టర్ మాత్రం ప్రత్యేకంగా ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛాలిచ్చారు. జిల్లాలో ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇక్కడి నుంచి పక్క జిల్లాకు వెళ్లిన ఎమ్మెల్సీ ఉన్నారు. ఎక్కడి నుంచో ఇక్కడికి అరసవల్లి దర్శనానికి వస్తున్న ఎమ్మెల్సీలు కోకొల్లలు. ఎవరికీ లేని పుష్పగుచ్ఛం మర్యాద నాగబాబుకు మాత్రమే అందడానికి కారణం డిప్యూటీ సీఎం సోదరుడనా? లేక దీని వెనుక ఇంకేదైనా మంత్రాంగం ఉందా? అనే చర్చ ఇప్పుడు జిల్లాలో నడుస్తోంది.










Comments