ఇదేం ‘సంప్రదాయం’?
- Prasad Satyam
- 17 hours ago
- 2 min read
అర్ధనారీశ్వరం అంటే కామసూత్ర భంగిమేనా?
కల్చరల్ ట్రస్ట్ ఆహ్వాన పత్రికపై సర్వత్రా చర్చ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం రూరల్ మండలం కళ్లేపల్లికి వెళ్లే మార్గంలో సంప్రదాయ గురుకులం శనివారం నిర్వహించే కార్యక్రమ ఆహ్వాన పత్రం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. అర్థనారీశ్వరం పేరుతో శనివారం నిర్వహిస్తున్న కూచిపూడి డ్యాన్స్ డ్రామా కోసం ముద్రించిన ఆహ్వాన పత్రికలో కామసూత్రకు చెందిన స్త్రీ పురుష శృంగార భంగిమను ముద్రించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి ఈ డ్యాన్స్ డ్రామాను నిర్వహిస్తున్న స్వాతిసోమనాథ్ కామసూత్ర బాలేని ప్రదర్శించడం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆమె నిర్వహిస్తున్న సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్ ద్వారా శనివారం ప్రదర్శించనున్న అర్థనారీశ్వరం కూచిపూడి డ్యాన్స్ డ్రామాకు ట్యాగ్‌లైన్‌గా ‘శృంగార టు మోక్ష’ టైటిల్‌ను నిర్దేశించారు. వాస్తవానికి శృంగారం నుంచి మోక్షం వరకు ఉండే వివిధ దశలను కూచిపూడి డ్యాన్స్ డ్రామా ద్వారా చెప్పడం స్వాతి సోమనాథ్ బృందం లక్ష్యం కావచ్చు. కామి గాక మోక్షగామి కాడు అన్న సూత్రం మేరకు ఈ డ్యాన్స్ డ్రామాను రూపొందించివుండొచ్చు. ఎందుకంటే.. కామసూత్ర అంటే బూతు కాదని స్వయంగా ఆమె శిష్యుల బృందం రూపొందించిన ఓ ప్రమోషనల్ వీడియోలో చెప్పుకొచ్చారు. గత కొన్నేళ్లుగా వాత్సాయనుడు రచించిన కామసూత్ర బూతుగానే మిగిలిపోయిందని వేరేగా చెప్పనక్కర్లేదు. అయితే బూతుకు, శృంగారానికి మధ్య సున్నితమైన గీతను చెరిపే ప్రయత్నం స్వాతి సోమనాథ్ ఎప్పట్నుంచో చేసుకొస్తున్నారు. కానీ అర్థనారీశ్వరం పేరుతో కామసూత్ర శృంగార భంగిమ బొమ్మను ఇన్విటేషన్ మీద ప్రచురించడం తప్పుదోవ పట్టించినట్లే. అర్ధనారీశ్వరం అంటే తెలియని ఈ తరంవారికి ఇప్పుడు ఈ ఇన్వినేషన్‌లో కనిపించేదే అర్ధనారీశ్వరమని అనుకోవడంలో తప్పులేదు. శాంతా బయోటెక్ చైర్మన్ పద్మభూషణ్, డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, యూఎస్‌ఏ నుంచి డాక్టర్ తోటకూర ప్రసాద్, చెన్నై నుంచి కాలసుధా శ్రీనివాస్ వంటి ప్రముఖులు వస్తున్న ఈ కార్యక్రమానికి నిర్ద్వందంగా జిల్లాలో ప్రముఖులందరూ వస్తారనడంలో సందేహం లేదు. ఇటువంటి చోట అర్ధనారీశ్వరం పేరుతో కామసూత్ర భంగిమను ప్రచురించడం ఇప్పుడు వివాదానికి దారితీస్తుంది. అసలు అర్ధనారీశ్వర తత్వాన్ని ఎలా చూపించబోతున్నారనే దానికంటే ఇన్నాళ్లూ మనం దాన్నెలా అర్థం చేసున్నామనేదే గమనించాలి. పరమశివుడు తన శరీరంలో సగభాగాన్ని పార్వతీదేవికి కేటాయించడాన్నే మనం అర్ధనారీశ్వర తత్వంగా తెలుసుకున్నాం. శివుడు సగభాగాన్ని భార్యకు కేటాయించడాన్ని ఏకంగా ఒక పురాణంగానే మనం చూస్తున్నాం. అటువంటిచోట బూతుపురాణంగా చెప్పుకునే బొమ్మ ఎందుకనేదే ఇప్పుడు ప్రశ్న. అర్ధనారీశ్వర తత్వం ఏం చెబుతుందనేది తెలుసుకోవాల్సిన నేటితరం కామసూత్రలో కామాన్ని మాత్రమే పట్టుకొని సూత్రాన్ని వదిలేశారని చెప్పుకోవడం సరికాదు. ఇంటర్నెట్ యుగంలో కామసూత్రం కోసం ప్రత్యేకంగా నాటకాల రూపంలోనో, బుర్రకథలుగానో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది అర్ధనారీశ్వర తత్వమే. పోనీ శృంగారం టు మోక్షం అనే ఒక ప్రయాణాన్ని చూపించాలనుకుంటే అందుకు అర్ధనారీశ్వరుడి బొమ్మ ప్రచురించివుంటే బాగుండేది.
అర్ధనారీశ్వర తత్వమంటే శివుడు, పార్వతి సగం సగం కలిసి ఒకే రూపంలో ఉండటం. ఇది స్త్రీ, పురుషులు, ప్రకృతి, శక్తి, చైతన్యం ఇవేవీ వేర్వేరు కావని, సంపూర్ణం కోసమే ఇద్దరూ కలిసివుండాలనే లోతైన సత్యాన్ని చెప్పడం. ఇది తల నుంచి కాలివరకు శరీరంలోని సగానికి సగం స్త్రీ, సగం పురుష రూపంలో ఉండటం. ఆలోచన, ఆచరణ, శక్తి, చైతన్యం వంటివి సమతుల్యంగా ఉండాలని సూచించడం. అర్ధం అంటే అర్ధ (సగం), నారీ (స్త్రీ), ఈశ్వర (సగం పురుషుడు). స్త్రీ పురుషులు వేర్వేరుగా ఉన్నా కలిసివున్నప్పుడు సంపూర్ణత సాధ్యమని చెప్పడం. అలాగే స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని, ఐక్యతను సృష్టిలోని వారి పరస్పర ఆధారిత స్వభావాన్ని వివరిస్తుంది. ఇదే అర్ధనారీశ్వర స్తోత్రం సారాంశం కూడా. కానీ ఇక్కడ ఇన్విటేషన్‌లో పురుషుడు వేరేగా, స్త్రీ వేరేగా శృంగార భంగిమ కనిపిస్తుంది. అసలు అర్ధనారీశ్వరమంటేనే పార్వతీ పరమేశ్వరులు కదా.! వీరినే మహాకవి కాళిదాసు
‘వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ!!’ అంటాడు.
సనాతనం ప్రకారం ఈ సృష్టికి తల్లిదండ్రులు పార్వతీపరమేశ్వరులు. వారే అర్ధనారీశ్వరులు. ఇవేవీ కావు.. పెద్దలెంతోమంది చూస్తుండగా పబ్లిక్‌గా సంభోగించడం చూశాం, గుర్రంతో అశ్వమేథ యాగాలు నడపడం చూశాం, యజ్ఞం చేస్తున్నవారి భార్యను ఇంకొకడు మదనక్రీడకు పిలుచుకుపోవడం చూశాం. అప్పుడు లేని సిగ్గూ, దురభిమానం ఇప్పుడు మనకెందుకు? గోపురాల మీద, రథాల మీద, గర్భగుడి విమానాల మీద, కోవెల గోడల మీద లక్షల సంఖ్యలో ఉన్న ఈ బూతుబొమ్మలు కనిపించకుండా చేయడం సాధ్యమైతే ఆ పనికి పూనుకోవడం మంచిది. అది పూర్తిగా సాధ్యం కాకపోతే కళ్లతో పాటు నోరు కూడా మూసుకొని ఒక స్వప్నంగా భావించి ఆ అధ్యాయం మర్చిపోవడం ఉత్తమమని తాపీ ధర్మారావు దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు? అనే పుస్తకానికి పీఠిక రాసిందే మనం ఫాలో అవుదామనుకుంటే ఓకే.
అర్ధనారీశ్వరమంటే శృంగారం నుంచి మోక్షానికి వెళ్లడమేనన్న కాన్సెప్ట్‌ను స్వాతి సోమనాథ్ బృందం కొత్తగా తెర మీదకు తీసుకురావచ్చు. అది మన్ననలు పొందితే అందరూ ఆమోదించవచ్చు కూడా. కానీ శృంగార టు మోక్ష అనే సబ్‌సైటిల్ ఇచ్చినప్పుడు మోక్షానికి గుర్తుగానైనా, లేదూ అర్థనారీశ్వర తత్వానికైనా సింబాలిక్‌గా మరో బొమ్మ ఇన్విటేషన్ మీద ముద్రించివుంటే బాగుండేది.










Comments