ఇదేం ‘సరసం’ సామీ!
- DV RAMANA

- 6d
- 3 min read

‘మా థియేటర్లలో టికెట్ల ధరలు ఏమాత్రం ఎక్కువ కావు. వాటిలో అమ్మే స్నాక్స్ కూడా సరసమైన ధరలకే లభిస్తాయి’.. ఈ మాట వింటే అదో పెద్ద జోక్ అని ఎవరైనా సరే చెబుతారు. కానీ పీవీఆర్ ఐనాక్స్ ఎండీకి మాత్రం అవి చాలా తక్కువ ధరలేనట! ఈ రోజుల్లో మల్టీప్లెక్స్‌లలో సినిమా చూడటం సామాన్యులకు ఎంత ప్యాషనో అంతకుమించిన ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. టికెట్ రేట్ల సంగతి పక్కన పెడితే లోపల స్టాల్స్ ద్వారా విక్రయించే స్నాక్స్ ధరలు చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. పీవీఆర్ ఐనాక్స్ ఎండీ అజయ్ బిజిలీ మాత్రం తమ ధరలు అస్సలు ఎక్కువ కాదని సమర్థించుకున్నారు. తమ మల్టీప్లెక్స్‌లలో వసూలుచేసే సగటు టికెట్ ధర రూ.259 మాత్రమేనని, పాప్‌కార్న్ ధర రూ.159 నుంచే మొదలవుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఆయన చెప్పిన రేట్లు ఎక్కడ అమలవుతున్నాయో చెప్పాలని నెటిజన్లు, సామాన్య ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. అజయ్ బిజిలీ చెప్పిన లెక్కలు కాగితాల మీద బాగున్నా సామాన్యుడి అనుభవానికి మాత్రం పూర్తి విరుద్ధంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. పీవీపీ ఎండీ చెప్పిన రూ.259 రేటు అనేది యావరేజ్ మాత్రమేనని, ఇందులో టైర్ 2 సిటీల రేట్లు, రూ. 99 ఆఫర్లు అన్నీ కలిపి ఉంటాయని నెటిజన్లు లాజిక్ తీస్తున్నారు. మెట్రో సిటీల్లో, ప్రైమ్ లొకేషన్లలో వీకెండ్ సినిమా చూడాలంటే టికెట్ రేటు రూ. 500 నుంచి రూ. 800 వరకు ఉంటోందని, అదే పెద్ద హీరోల సినిమాలైతే ఇంకా ఎక్కువ రేట్లు చెల్లించాల్సి వస్తుందని గుర్తు చేస్తూ.. ఎండీ చెప్పిన రేటుకు ఎక్కడా టికెట్లు దొరకడం లేదని కౌంటర్లు వేస్తున్నారు. అసలు సమస్య టికెట్ రేట్ల కంటే స్నాక్స్, పానీయాల ధరలే ఎక్కువగా ఉన్నాయని ప్రేక్షకులు చాలా ఏళ్ల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 రూపాయల పెట్టుబడి ఖర్చు అయ్యే మొక్కజొన్నను రూ.159కి అమ్మడం ఏ రకమైన న్యాయం అని ఓ యూజర్ ప్రశ్నించారు. ఇది సరసమైన ధర అనేకంటే దోపిడీకి మించిన దోపిడీ అనాలని, ప్రపంచంలో ఏ వ్యాపారంలోనూ పెట్టుబడి, అమ్మకాల ధరల మధ్య ఇంత వ్యత్యాసం ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. ఎండీ అజయ్ చెప్పినట్లు రూ.159 కూడా పాప్‌కార్న్ స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. రెగ్యులర్‌గా తీసుకునే కాంబోల ధరలు రూ.400 నుంచి రూ.500 వరకు ఉంటున్నాయి. బయట నుంచి స్నాక్స్ తీసుకెళ్లడానికి అనుమతించరు, పోనీ థియేటర్లో కొనుక్కుందామంటే రేట్లు మండిపోతుంటాయి.. ఇదో రకమైన మోనోపలీ అని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక మధ్యతరగతి కుటుంబం సినిమాకు వెళితే పరిస్థితి ఏమిటని మరో నెటిజన్ ప్రశ్నించారు. ఫ్యామిలీలో నలుగురు సినిమాకు వెళ్తే టికెట్లు, స్నాక్స్ అన్నీ కలుపుకుని కనీసం రెండువేలు పైనే ఖర్చు అవుతోందని లెక్కలు చెబుతున్నారు. కేవలం పాప్‌కార్న్, కూల్‌డ్రిరక్స్ కోసమే టికెట్ రేట్లకు మించి ఖర్చు చేయాల్సి వస్తుండటంతో సామాన్యులు రెగ్యులర్‌గా థియేటర్లకు వెళ్లలేకపోతున్నారు. అందులోనూ మల్టీప్లెక్స్‌ల వైపు అసలే చూడలేకపోతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో కేవలం భారీ బ్లాక్‌బస్టర్ సినిమాలకు మాత్రమే థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. చిన్న, మిడిల్ రేంజ్ సినిమాలను ఓటీటీలో చూసుకోవడానికే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. థియేటర్ యాజమాన్యాలు చెబుతున్న ‘సగటు’ లెక్కలకు, ప్రేక్షకుడి జేబుకు పడుతున్న చిల్లుకు ఎక్కడా పొంతన కుదరడం లేదన్నదే మరికొందరు చెబుతున్న మాట. ఈ కారణాలతోనే పీవీఆర్ ఎండీ చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో వ్యతిరేకత వస్తోంది. రూ.159కి పాప్‌కార్న్ ఎక్కడ దొరుకుతుందో అడ్రస్ చెప్పండంటూ సెటైర్లు వేస్తున్నారు. ఫుడ్ అండ్ బేవరేజెస్ రేట్లు తగ్గించకుండా, టికెట్ రేట్లు తక్కువే అని కలరింగ్ ఇవ్వడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సినిమాల నిర్మాణ ఖర్చు పెరిగిందన్న నెపంతో భారీ మొత్తాలకు సినిమాలు కొనేసి.. దాన్ని జనంపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. వీటిని తట్టుకోలేక జనం హాళ్లకు రాకపోతే థియేటర్లను నడపలేకపోతున్నామని గగ్గోలుపెడుతున్నారు. ఒకవిధంగా ఇదే పైరసీని ప్రోత్సహిస్తోందని చెప్పాలి. సినిమా హాళ్లలో ప్రదర్శించే సినిమా టికెట్ల అమ్మకాల ద్వారానే కాకుండా లోపల రకరకాల ఆహార పానీయాల స్టాల్స్ ద్వారా యాజమాన్యాలు భారీగానే ఆదాయం సంపాదిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకులు తమతో స్నాక్స్ వంటివి తెచ్చుకునేవారు. ఎప్పుడైతే థియేటర్ల నిర్వహణ ఖర్చులు, సినిమా ప్రదర్శనల అద్దెలు పెరగడం ప్రారంభించాయో.. అప్పటినుంచే లోపలే స్నాక్స్, పానీయాల స్టాల్స్ పెట్టి.. బయటనుంచి తెచ్చుకోవడానికి నిషేధించడం ద్వారా తాము చెప్పిన ధరకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కల్పించారు. ఇష్టానుసారం ధరలు పెట్టి ప్రేక్షకులను దోపిడీ చేయసాగారు. దీనిపై పలువురు కోర్టుకు వెళ్లారు. దానిపై 2023 జనవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు థియేటర్ యాజమాన్యాలకే అనుకూలంగా ఉంది. థియేటర్ అన్నది ప్రైవేట్ ప్రాంగణమని, దాన్ని ఇష్టం వచ్చినట్లు నడుపుకోడానికి, అందులోకి ప్రవేశం విషయంలో తనకు నచ్చిన నిబంధనలు పెట్టుకునే స్వేచ్ఛ యాజమాన్యానికే ఉంటుందని స్పష్టం చేసింది. థియేటర్‌లోకి తినుబండారాలు తీసుకొచ్చేందుకు ప్రేక్షకులకు అనుమతిస్తే పారిశుధ్యం దెబ్బతింటుందని, నిర్వహణ భారంగా మారుతుందని, తర్వాత షోకు వచ్చే ప్రేక్షకులకు పారిశుధ్యలోపం ఇబ్బందికరంగా పరిణమిస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై అభ్యంతరం లేకపోయినా తినుబండారాలు, శీతలపానీయాలు, టీ, కాఫీల రేట్లు ప్రేక్షకులకు షాక్ కొట్టేలా ఉంటున్న విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. బయట ఉన్న రేట్లకు దాదాపు పదిరెట్లకుపైగా థియేటర్లలోని స్టాల్స్‌తో అమ్ముతున్నారు. ఏమంటే ఇష్టముంటే కొంటారు, లేకపోతే లేదు! అన్నట్లు మాట్లాడుతున్నారు. దీని గురించి అజయ్ లాంటివారు స్పందిస్తే బాగుంటుంది.










Comments