top of page

ఇన్ని అవమానాలు మనకొద్దు బాలూ..!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Dec 4, 2025
  • 4 min read

( సత్యంన్యూస్‌, శ్రీకాకుళం )

మంచి చేశాడని కాటన్‌ దొరకు కూడా విగ్రహం పెట్టిన రాష్ట్రం మనది. బాలు యూనివర్సల్‌.. అడ్డు చెప్పుడం అనేది సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం అవుతుంది. అంబేద్కర్‌, రాజీవ్‌ గాంధీ వగైరాలు పక్కా తెలంగాణ వాసులు కాబోలు. అందుకే వీళ్ల విగ్రహాలకు ఎలాంటి అడ్డు చెప్పరు శభాష్‌. ఇప్పుడు కేసీఆరే వచ్చి ఒరే తప్పురా.. బాబు, అలాంటి గొప్ప వారి విషయంలో ఇలా చేస్తే పుట్టగతులు ఉండవు.. అన్నా వినే స్థితి లేదు కొంతమందికి. వాళ్లదేం తప్పు కాదు.. అలా ఒకప్పుడు ఎగదోసిన మీడియా, చూస్తూ ఊరుకున్న నాయకులు, సమాజం అందరూ బాధ్యులే. ఇందుకు కాదు ఈ రోజుకీ..

అందరి దేవుడు - ఇప్పుడు ఒక రాష్ట్రం దేవుడు లెక్క

అందరి అభిమాన నటుడు - ఒక ప్రాంతం వాడి లెక్క

అందరి అభిమాన నాయకుడు - ఒక కులం వాడి లెక్క

అందరి అభిమాన క్రీడాకారులు - ఒక మతం లెక్క

వీళ్లకి బుద్దుడు, తిలక్‌, అంబేద్కర్‌, గాంధీ, నెహ్రూ, బోస్‌, శివాజీలలో కూడా ప్రాంతం, కులం, మతం కనపడతాయి. ఎడ్డెం అంటే తెడ్డెం అనాలి, ఫోటో పేపర్‌లో, మీడియాలో రావాలి, నిశాని బ్యాచ్‌కు బిల్డప్‌ కావాలి. మతం, కులం, ప్రాంతం అని ఇన్సెక్యూరిటీని బయట పడేసుకుని ఇంకా ఇంకా.. జారుడు మెట్లు.. మీద.. అడుగులు వేయడం వారికి అలవాటే.

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒక మానవమాత్రుడు కాదు. దశాబ్దాల తరబడి పామరుల మొదలు పండితుల వరకు తన గాత్రంతో అలరించిన గాన గంధర్వుడు. అనేక కష్టాలతో జీవితాలను ఈడుస్తున్న జనాలకు తన పాటలు విన్నంతసేపైనా ఆ కష్టాలను మర్చిపోయేలా చేసిన సమ్మోహనకారుడు. సినిమా ఇండస్ట్రీ మద్రాసులో ఉండటం వలన ఆయన తమిళుడు అని తమిళనాడు వాళ్లు అనుకుంటారు. కన్నడలో మాధుర్యంగా పాడటం వలన కన్నడ వాడని కన్నడిగులు అనుకుంటారు. కానీ ప్రతి తెలుగువాడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మా తెలుగు అని గర్వంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి. ఎస్పీ బాలసుబ్రమణ్యం తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం, ఆయన దురదృష్టం. బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతీలో ప్రతిష్టించడం అనేది ఆయనకు మనం ఇచ్చే గౌరవం కాదు. మనకు మనం ఇచ్చుకునే గౌరవం. తెలంగాణ పాట పాడలేదు అనో, తెలంగాణలో పుట్టలేదు అనో ఆయన విగ్రహాన్ని రవీంద్ర భారతీలో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించడం మూర్ఖత్వం.

అలా చేయాలంటే ముందు బెంగాల్‌కి చెందిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పేరు మీద నెలకొల్పిన రవీంద్ర భారతి పేరు మార్చాలి. హుస్సేన్‌ సాగర్‌ నడిమధ్యలో పెట్టిన బుద్ధుడి విగ్రహం, సెక్రటేరియట్‌ పక్కన పెట్టిన అంబేద్కర్‌ విగ్రహం, ఇంకా ఊరు, వాడ జంక్షన్లలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌, వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను, ఇంకా అనేక ఇతర రాష్ట్రాల నాయకుల విగ్రహాలను కూడా తొలగించాలి.. కానీ వీరంతా పార్టీలు వేరయినా దేశానికి, రాష్ట్రానికి సేవ చేసిన నాయకులు అని తెలుసుకుంటే ఆ ఆలోచన రాదు. ఎందుకంటే మెదడు మోకాళ్లలో కాకుండా ఉండాల్సిన స్థానంలోనే ఉందని భావిస్తున్నాం కాబట్టి.

తెలంగాణ రాష్ట్ర హక్కుల గురించి పోరాడటం అంటే పక్క రాష్ట్రం వారిని ద్వేషించడం కాదు. చనిపోయినవారి మీద ప్రతాపం చూపించడం అసలే కాదు. ఈరోజు... ఎన్నో వేల పాటలు పాడిన గాయకుడు. అందులో విప్లవ రచయితలు రాసిన..పాటలు పాడుతూ భావ గీతాలు కాకుండా విప్లవ గీతలు కూడా. పాడినప్పుడు.. వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాధ రథచక్రాలు అన్నప్పుడు...మా తెలంగాణా వాళ్ళే పాడాలి ఆంధ్రా గాయకులు పాడకూడదు అని ఎందుకు అగడలేదు? తమ ప్రోపగండా కోసం గో బ్యాక్‌ మార్వాడీలు అనే పనికిరాని మాటలు చెప్పే ఉద్యమ నాయకులం అని చెప్పుకొనే వాళ్లు లేరేమో?

బాలు పాట వినకుండా తెల్లారుతుందా ఏ ఇంటిలో అయినా... మా తెలుగు మాస్టారు అని చెప్పుకునేలా సంస్కారం పంచిన ఆయన మాట పాటా అజరామరం.. గంధం వాసన ఎవరికో తెలియదు అంటారు కదా ఇప్పుడు అది నిజమే అనిపిస్తుంది. బాలుకి అవమానం జరిగితే.. యావత్‌ సమాజానికి జరిగినట్టే.

బాలు గానానికి కూడా హద్దులు ఉంటాయా?

గాన గంధర్వుడికి మరణాంతరం ప్రాంతం పేరిట హైద్రాబాదులో జరిగిన అవమానం ఆయన అభిమానులు ప్రతి ఒక్కరికీ కన్నీరు తెప్పిస్తుంది. కొంతమంది రాజకీయ నాయకులు తమ వికృత విన్యాసాలకు , అధికార దాహానికి కులం, మతం, ప్రాంతం, భాషలను పావులుగా వాడుకుంటాయనే సంగతి చరిత్రలో చూసాం . ఇప్పుడూ చూస్తూనే ఉన్నాం. ఈ రాక్షస రాజకీయ క్రీడాకారులకు మంచి చెడులు ఉండవు.. పాపపుణ్యాలు అసలే తెలియవు.. తెలిసిందల్లా అధికార దాహం, అహంకారపూరిత ఉన్మాద మనస్తత్వం.

ఇప్పుడీ ఉపాధ్ఘాతం ఎందుకంటే.. దేశం మెచ్చిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యాన్ని కూడా ఒక ప్రాంతానికి పరిమితం చేస్తూ మాట్లాడిన తెలంగాణకు చెందిన కుసంస్కార అజ్ఞానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహ ఆవిష్కరణకు శుభలేఖ సుధాకర్‌ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ద్వారా ఇందుకు సంబంధించిన అనుమతులు కూడా తెచ్చుకున్నారు. ఈ దశలో విగ్రహ ఏర్పాట్లు పర్యవేక్షించటానికి రవీంద్ర భారతికి వచ్చిన ఆయన్ని తెలంగాణా ఉద్యమకారుడిగా చెప్పుకుంటున్న పృథ్విరాజ్‌ అనే వ్యక్తి అటకాయించి ఎస్పీ బాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవాడు కాదు కాబట్టి ఆయన విగ్రహం ఇక్కడ పెట్టటానికి వీల్లేదంటూ గొడవకు దిగాడు. దానితో శుభలేఖ సుధాకర్‌ సౌమ్యంగా ఆయనకి నచ్చచెబుదామని ఎంతసేపు ప్రయత్నించినా వినకపోగా నువ్వు అంటూ ఏకవచనంతో సంబోధిస్తూ గొడవకు దిగాడు. ఆ వ్యక్తి ఆగడాలు భరించలేక సుధాకర్‌ కారులో వెళ్లిపోవడం కనిపించింది. ఇదీ జరిగింది.

ప్రాంతీయ వాదం వేరు ప్రాంతీయ ఉన్మాద ఉగ్రవాదం వేరు

ఈ సంఘటనలో అందరికీ రెండోదే కనిపించింది. ఈ దృశ్యాన్ని వీడియోలో చూసిన తెలంగాణా వాసులు కూడా కన్నీరు పెట్టుకున్నారు.. ఈ దుశ్చర్యని ఖండిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దేశం మెచ్చిన గాయకుడు ఎస్పీ బాలుని కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయడమేంటని మండిపడుతున్నారు. ఎక్కడో పుట్టి ప్రాంతాల హద్దులను చెరిపేసుకుంటూ సాగునీరు, తాగునీరు అందిస్తూ గమ్యానికి చేరుకునే జీవనది లాంటి వారు ఎస్పీ బాలసుబ్రమణ్యం తను నడిచి వెళ్లిన దారిలో పాటల పరిమళాలను వెదచల్లుకుంటూ వెళ్లాడు.

దశాబ్దాలుగా ఆ పాటలను వినేగా మనం పరవశాన మైమరిచింది. ఆ పాటలను వినేగా మన కష్టాలను, కన్నీళ్లను కొద్దిసేపైనా మరవగలిగింది. ఆయన పాటలకు మెచ్చి తమిళులు ఏకంగా తమ రాష్ట్రంలో ఒక వీధికి బాలు పేరు పెట్టుకుని తమ అభిమానాన్ని హుందాగా చాటుకున్నారు. ఇక్కడ బాలు తమిళుడు కాదే. మరెందుకు ఆయన మీద వాళ్లు అంత అభిమానం చూపించారు. వాళ్లు ఆయనలో ఎస్పీ బాలసుబ్రమణ్యాన్ని చూడలేదు.. గాన గంధర్వుడిని చూసారు.. ఆయన పాటలను చూసారు.. విన్నారు. కన్నడిగులకి, బాలుకి ఏ సంబంధం ఉందని వాళ్లు నేటికీ ఆయన్ని గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారు? గాన గంధర్వుడు సైతం మనకోసం దివి నుంచి భువికి దిగొచ్చి కొన్ని దశాబ్దాల పాటు మానవాళికి గానామృతం పంచి వచ్చిన పని అయిపోయిన తర్వాత తిరిగి గంధర్వ లోకానికి వెళ్లిపోయారు. అటువంటి బాలసుబ్రమణ్యం మన తెలుగువాడు కావడం మనందరి అదృష్టం. మనందరికీ గర్వకారణం కూడా. ఇప్పటికే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే బాలు గారి జ్ఞాపకార్థం తెలుగు రాష్ట్రాలు చూపిస్తున్న అలసత్వం పట్ల ఆయన అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వాలు చేయలేని పనిని తాను చేద్దామని శుభలేఖ సుధాకర్‌ ముందుకొచ్చి ఏర్పాట్లు చేస్తుంటే స్వాగతించాల్సింది పోయి చనిపోయిన వ్యక్తి మీద ప్రాంతీయ ద్వేషం చూపించడం ఎంత వరకు సబబు? ఇదేనా తెలుగు వారిగా బాలుకి ఇచ్చే గౌరవం? ఇదేనా ప్రఖ్యాత గాయకుడికి మరణాంతరం అర్పించే నివాళి? రోజురోజుకీ దిగజారిపోతున్న మానవత్వానికి పరాకాష్ట ఈ సంఘటన. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ గాయకుడు అందెశ్రీ పాడిన పాట బహుశా ఇటువంటి వారిని ఉద్దేశించే అయ్యుంటుంది.

ఎస్పీ బాలూది తెలంగాణా కాకపోతే హైదరాబాద్‌ నడిబొడ్డున ప్రతిష్టించిన బుద్దుడిది ఏ ప్రాంతం? సచివాలయం పక్కన ప్రతిష్టించిన అంబేద్కర్‌ ది ఏ ప్రాంతం? తెలంగాణాలో వందలాదిగా ప్రతిష్టించిన ఇందిరమ్మ , రాజీవ్‌ , ఎన్టీఆర్‌ , వైఎస్సార్‌ , తదితరులది ఏ ప్రాంతం?

దేశానికి చేసిన సేవలకో, రాష్ట్రానికి చేసిన సేవలకో గుర్తింపుగా అభిమానంతో ప్రాంతాలకు అతీతంగా తెలంగాణా అంతటా వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు లేని నొప్పి బాలు గారి విగ్రహం పెట్టుకుంటుంటే ఎందుకొచ్చింది ?

సంకుచిత మనస్తత్వానికి కూడా ఓ హద్దు ఉంటుంది

అమర గాయకుడి విషయంలో ఆ హద్దులు కూడా దాటేసి విద్వేషంతో తెలంగాణా సెంటిమెంట్‌ ప్రయోగిద్దామని చూస్తే తెలంగాణా వాదులే తిరగబడే రోజు వస్తుంది. నిజానికి గాన గంధర్వుడికి తెలంగాణాలో విగ్రహం ఏర్పాటు చేయడమనేది చాలా చిన్న విషయం.

ఆయన స్థాయికి తెలంగాణా ప్రభుత్వం స్వయంగా పూనుకుని స్మృతి వనం ఏర్పాటు చేస్తే దేశం మొత్తం అభినందిస్తుంది.

ఇప్పుడు తెలంగాణ సమాజం నుంచే వ్యతిరేకత వ్యక్తమవడంతో అప్రకటిత మేథావులందరూ బాలు విగ్రహం ఏర్పాటుకు వ్యతిరేకం కాదు గానీ, రవీంద్రభారతిలో పెట్టడాన్నే వ్యతిరేకిస్తున్నామని, రామోజీ ఫిలింసిటీలోనో, ఆంధ్రుల సినిమా స్టూడియోల్లోనో పెట్టుకోవాలని సలహాలిస్తున్నారు.. అక్కడికి రవీంద్రభారతికి ఆ స్థాయి తీసుకువచ్చిన సమాజమేదో మర్చిపోయి.

ఇంక విగ్రహం పెట్టకండి రవీంద్ర భారతిలో... ఎవడికి నష్టం లేదు? వారికి కళ, దాని విలువ తెలిస్తే పెట్టడంలో అర్ధం ఉంది.. అది లేనప్పుడు అనవసరం. బాలు ఔన్నత్యాన్నీ వివాదం చేసి విగ్రహం పెట్టినా అది అవమానమే!!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page