top of page

ఇరాన్, రష్యాలే నమ్మదగ్గ మిత్రులు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 3 hours ago
  • 3 min read

యుద్ధం ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్నది. ఒక వారంలోపే ముగిసిపోతుందనుకున్నది కాస్త ఇప్పుడు ఆరోవారంలోకి ప్రవేశించింది. అయినా ఏమాత్రం తీవ్రత తగ్గకపోగా మరింత జోరందుకునే సూచనలే అధికంగా కనిపిస్తున్నాయి. యుద్ధానికి అంకురార్పణ చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన చర్యలు, విచక్షణారహిత, అహంకారపూరిత వ్యాఖ్యలు, తిట్ల పురాణాలతో పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నారు. మరోవైపు పరిస్థితి తన చేయి దాటిపోతుండటం, స్వదేశంలోనే తనపై వ్యతిరేకత, నిరసన జ్వాలలు మిన్నంటుతున్న పరిస్థితుల్లో చర్చల ప్రతిపాదన చేసినా ఇరాన్ ససేమిరా అనడంతో ఏం చేయాలో తెలియక అసహనంతో ఇరాన్‌లోని విద్యుత్, ఆయిల్ వ్యవస్థలపై దాడులు చేసి ఆ దేశాన్ని అంధకారంలోకి నెట్టేస్తామని ట్రంప్ హూంకరిస్తున్నారు. పైగా యుద్ధాన్ని మొదలుపెట్టి హర్మూజ్ జలసంధిలో ఆంక్షలకు కారకుడైన ఆయనే ఇప్పుడు ఎవరి చావు వారు చావండి అన్నట్లు దాన్ని తెరిపించే బాధ్యత తనది కాదంటున్నారు. ఈ తరుణంలో యుద్ధం వల్ల పరోక్షంగా ప్రభావితమవుతున్న భారత వైఖరి ఎలా ఉండాలి? మనది తటస్థ విధానమే అయినప్పటికీ అవసరమైనప్పుడు ఏ దేశం వైపు మొగ్గు చూపాలి? ఆపత్కాలంలో నమ్మదగిన మిత్రదేశం ఏది? అన్న చర్చ జరుగుతోంది. ఈ యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతప్తికరంగా ఉన్నాయా? అన్న అంశాలపై దేశంలో జరిగిన ఒక సర్వే ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడించింది. యుద్ధం మొదలైననాటితో పోలిస్తే.. దాని పరిణామాలతోపాటు దేశప్రజల అభిప్రాయాలు కూడా మారుతున్నట్లు తేలింది. అయితే సర్వేలో పాల్గొన్న వారిలో మెజారిటీ ప్రజలు అమెరికాను నమ్మదగిన మిత్రురాలిగా మాత్రం పరిగణించడంలేదు. జనాభిప్రాయ సేకరణలో అపార అనుభవమున్న సీఓటర్ సంస్థ యుద్ధం మొదలైనప్పటి నుంచి వారం వారం దేశవ్యాప్తంగా టెలిఫోనిక్ సర్వే నిర్వహించింది. పలు ప్రశ్నలు సంధించి ప్రజల నుంచి ఫోన్ ద్వారా అభిప్రాయాలు సేకరించి విశ్లేషించింది. నాలుగో వారం వరకు సేకరించింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో అమెరికా కంటే ఇరాన్‌నే మనం ఎక్కువగా విశ్వసించాలని అధికశాతం మంది అన్నారు. వారం వారానికి ఇరాన్ పట్ల మొగ్గు పెరుగుతూ.. అమెరికా పట్ల తగ్గుతూ వచ్చింది. మార్చి రెండో వారంలో ఇరాన్‌పై 27 శాతంగా ఉన్న మొగ్గు నాలుగో వారానికి 58 శాతానికి పెరిగింది. అదే సమయంలో అమెరికాపై మొగ్గు 26 నుంచి 15 శాతానికి తగ్గింది. పశ్చిమాసియా యుద్ధంలో భారత్ తటస్థంగా ఉండాలనే మొదటి నుంచీ ప్రజలు కోరుకుంటున్నారు. దీనిపై వారి మొగ్గు 58 నుంచి 60 శాతానికి పెరిగింది. ఒకవేళ తటస్థ వైఖరి కాకుండా ఏదో ఒక దేశం వైపు చేరాల్సిన పరిస్థితి ఎదురైతే భారత్ ఎటువైపు నిలబడాలన్న ప్రశ్నకు ఎక్కువ మంది ఇరాన్‌ను సూచించారు. మార్చి రెండో వారంలో ఇరాన్ వైపు 56 శాతమే ఉన్న మొగ్గు నాలుగో వారానికి 74 శాతానికి పెరిగింది. అదే సమయంలో అమెరికా వైపు ఉండాలన్న వారి సంఖ్య 44 శాతం నుంచి 26 శాతానికి పడిపోయింది. అంటే రోజులు గడుస్తున్నకొద్దీ.. యుద్ధం కొనసాగుతున్నకొద్దీ భారతీయుల్లో ఇరాన్‌కు మద్దతు పెరుగుతున్నదని ఈ సర్వే ద్వారా అర్థమవుతున్నది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో జియో పాలిటిక్స్‌లో అంటే అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో ఏ దేశం అత్యంత విశ్వననీయమైనదన్న ప్రశ్నకు మరో ఆలోచన లేకుండా ఎక్కువ శాతం మంది రష్యాకే ఓటు వేయడం విశేషం. రెండో వారంలో 67 శాతంగా ఉన్న రష్యాపై అనుకూలత నాలుగు వారాలు గడిచేసరికి 70 శాతానికి పెరిగింది. అదే సమయంలో తక్కువే అయినప్పటికీ అమెరికాపై అనుకూలత సైతం 10 నుంచి 14 శాతానికి పెరగడం విశేష పరిణామమే. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాల్లో దేనివల్ల భారత్‌కు ఎక్కువ ముప్పు ఉంటుందని ప్రశ్నకు చాలామంది చైనా వైపే చూపించారు. చైనాతో ముప్పు ఉందని రెండోవారంలో 41 శాతం మంది అభిప్రాయపడగా నాలుగో వారానికి 44 శాతానికి పెరిగింది. మరోవైపు పాకిస్తాన్‌తో ముప్పు ఉందని భావించినవారి సంఖ్య 30 నుంచి 34 శాతానికి ఎగబాకింది. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత విదేశాంగ విధానం ఎలా ఉందంటే.. 32 శాతం మంది బాగుందని, 21 శాతం మంది ఫర్వాలేదని అభిప్రాయపడగా 42 శాతం మంది అసంతప్తి వ్యక్తం చేశారు. అంటే ఓవరాల్‌గా భారత విదేశాంగ విధానం పట్ల సంతప్తి వ్యక్తమైనట్లే. యుద్ధ ప్రభావం మన దేశ ఆర్థికరంగంపై తీవ్రంగా ఉంటుందని 45 నుంచి 50 శాతం మంది చెప్పగా 13`16 శాతం మంది విదేశాంగ శాఖను, 11`13 శాతం మంది రాజకీయ వ్యవస్థను ప్రస్తావించారు. యుద్ధం ప్రభావంతో గ్యాస్ సమస్య పెరిగిందా అన్న ప్రశ్నకు తీవ్రంగా ఉందనే మొదటినుంచీ అధికశాతం ప్రజలు భయపడుతున్నట్లు తేలింది. గ్యాస్ సమస్యపై యుద్ధ ప్రభావం బాగా ఉందని రెండో వారంలో 64 శాతం మంది అభిప్రాయపడగా నాలుగు వారంలో 65 శాతం మంది చెప్పారు. అంటే ప్రభుత్వం భరోసా ఇస్తున్నా గ్యాస్ సరఫరా విషయంలో ప్రజల్లో ఆందోళన ఏమాత్రం తగ్గడంలేదని తేటతెల్లమవుతున్నది. ఇక యుద్ధం కారణంగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని ఏకంగా 82 శాతం మంది ఆందోళన చెందుతున్నారు. అందులోనూ ఎక్కువమంది పెరుగుదల 10 నుంచి 50 శాతం వరకు ఉండవచ్చని అంచనా వేశారు. గ్యాస్ కొరత ఎదురైతే ప్రత్యామ్నాయంగా ఎక్కువ మంది అంటే 66 శాతం మంది మళ్లీ పాతకాలాన్ని గుర్తు చేసుకుంటూ కట్టెల పొయ్యిల వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది. కేవలం 16 శాతం మందే విద్యుత్ పరికరాలను ప్రత్యామ్నాయంగా భావిస్తుండగా 8 శాతం మందైతే వంటలు తగ్గించుకోవాలనుకుంటున్నారు. ఈ యుద్ధం కారణంగా రానున్న కాలంలో గ్లోబల్ వ్యవస్థ చాలా మార్పులకు లోనవుతుందని 52 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రజల అభిప్రాయాలు చూస్తే ప్రస్తుత యుద్ధం అంతర్గతంగా అలజడి రేపుతున్నట్లు అర్థమవుతోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page