ఇసుక.. వ్యాపారం కసాబిసా
- BAGADI NARAYANARAO

- Nov 13, 2024
- 4 min read
విశాఖలో అవసరానికి మించి నిల్వలు
టౌన్ కంటే గ్రామాల్లో ధర అధికం
రీచ్ ఒడ్డున అనధికార వసూళ్లు
ఇంకా ఊపందుకోని నిర్మాణ రంగం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

క్రిష్ దర్శకత్వం వహించి దగ్గుబాటి రాణా, నయనతార జంటగా నటించిన కృష్ణమ్ వందే జగద్గురుం సినిమా చూశారా?.. అందులో మట్టిరాజు అనే ఒక పాత్ర ఉంటుంది. సమాజంలో భూగర్భాన్ని దొరిచేస్తున్నారని, భవిష్యత్తులో మట్టి, ఇసుక కూడా కరువైపోతుందని భావించే ఎల్‌బీ శ్రీరామ్ (మట్టిరాజు) తెర మీద కనిపించిన ప్రతీసారి మట్టిని ఎత్తి దాచుకుంటుంటాడు. సరిగ్గా ఇసుక ఉచితమన్న ఆదేశాల తర్వాత జిల్లాలో అదే తంతు జరుగుతోంది. ఇసుక ఉచితమైనా ప్రతీ రీచ్ నుంచి దాన్ని తరలించడానికి వీళ్లేదు. అక్రమమో, సక్రమమో ప్రభుత్వం నిర్దేశించిన ర్యాంపుల నుంచి మాత్రమే ఇసుకను తీసుకువెళ్లాలి. అయితే ఆ ర్యాంపుల్లో ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లాలంటే.. గ్రామ పెద్దలుగా చెలామణి అవుతున్న మోతుబరులకు ట్రాక్టర్‌కు రూ.100 చొప్పున చెల్లించాలట. దూరంగా వెళ్లి ఇసుకను తెచ్చుకోవడమే ఒక పని అనుకుంటే, ఇప్పుడు అదనంగా రూ.100 చెల్లించడమేమిటని ఎక్కడ ఇసుక కనిపిస్తే అక్కడ తవ్వేసి పోగులు పెట్టేస్తున్నారు. దీంతో జిల్లాలో రాష్ట్రం మొత్తం అవసరాలకు సరిపడ ఇసుక ఇక్కడే పోగై వుంది. ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల గత ఐదేళ్లలో నిర్మాణాలు జరగలేదని, ఇప్పుడు అవి ఊపందుకుంటాయని భావించినా మనీ సర్క్యులేట్ కాకపోవడంతో నిర్మాణ రంగం ఇంకా జోరందుకోలేదు. ఎంతసేపూ విశాఖలో నిర్మాణమవుతున్న బహుళ అంతస్తులకు ఇసుకను తరలించడం మినహా జిల్లాలో ఆ స్థాయి నిర్మాణాలు లేవు. అనుమతులు ఉన్న ర్యాంపుల నుంచి, లేని ప్రాంతాల నుంచి, మరోవైపు ఒడిశా రేవుల నుంచి తరలిపోతున్న ఇసుకంతా వైజాగ్‌లోనే పోగవడం వల్ల ఇప్పుడు ఇసుక వ్యాపారానికి పూర్తిగా డిమాండ్ పడిపోయింది. పలు రేవుల్లో పోటీపడి తక్కువ ధరకు విశాఖపట్నం పంపించేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానం వల్ల ఇసుక ధరలు తగ్గడమే కాకుండా ఇసుకకు డిమాండ్ పడిపోయింది. కేవలం పార్టీని నమ్ముకున్నవారికి ఆర్ధిక ప్రయోజనం కలిగించే ఆలోచనతోనే ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. పట్టణాల్లో కారుచౌకగా లభ్యమయ్యే ఇసుక గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ధరకు సరఫరా చేస్తున్నారు. శ్రీకాకుళం నగరంలో, రీచ్‌లకు 10 కిలోమీటర్ల పరిధిలో మూడు టన్నుల ఇసుకను రూ.1000 నుంచి రూ.1200లకు సరఫరా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.2600 నుంచి రూ.3వేలు వసూలు చేస్తున్నారు. దీనికి కారణం ఇసుక రీచ్‌లు కలిగివున్న సమీప గ్రామాలకు బయట నుంచి ట్రాక్టర్లు అనుమతించడం లేదు. దీంతో ఇసుక రీచ్‌లు కలిగిన గ్రామాల నుంచి వెళ్లడానికి ఒక్కో ట్రాక్టర్‌కు రూ.100 వసూలు చేస్తున్నారు. ఇసుకను ట్రాక్టర్లకు లోడ్ చేసే కూలీల రేట్లు పెంచేశారు.
అనధికారిక లోడిరగ్‌లు

నెల రోజుల క్రితం వరకు 20 నుంచి 50 టన్నుల లారీని లోడ్ చేయడానికి రూ.18వేలు నుంచి రూ.30వేలు వసూలు చేశారు. వీటిని విశాఖలో రూ.50వేల నుంచి రూ.70వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటూ ఉండేవారు. జిల్లాలో 14 రీచ్‌లను నామినేషన్ పద్ధ్దతిలో అప్పగించిన తర్వాత అనధికారికంగా ఒక లారీని లోడ్ చేయడానికి రూ.8వేల నుంచి రూ.15వేలు మాత్రమే తీసుకుంటున్నారు. దీన్ని విశాఖకు తరలించి టన్నును రూ.600కు విక్రయిస్తున్నారు. దీనికి కారణం నూతన ఇసుక విధానం అమల్లోకి వస్తుందని ప్రకటించిన నెల రోజుల్లోనే విశాఖకు లక్షల టన్నుల ఇసుకను తరలించి టీడీపీ నాయకులు సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం విశాఖలో డిమాండ్‌కు మించి ఇసుక నిల్వలు ఉండడంతో ఇసుక అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం ఇసుకను కొందరు తరలిస్తున్నా మెట్రిక్ టన్ను రూ.600కు మించడం లేదు. అయితే దీన్ని కొందరు అక్రమార్కులు వదలడం లేదు. జిల్లాలోని జోగిపంతులపేట, బూరవల్లి, బట్టేరు, గోపాలపెంటతో పాటు మిగతా 10 రీచ్‌లను ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో టీడీపీ నాయకులకు కట్టబెట్టింది. ఈ రీచ్‌ల్లో రాత్రి వేళల్లో రోజు ప్రతి 60 నుంచి 100 లారీలు విశాఖ వైపు ఇసుకను తరలిస్తున్నారు. వీరికి పోటీగా నదీ పరివాహక ప్రాంతాల్లో స్థానికులు జట్టుగా ఏర్పడి అనధికారిక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకున్నారు.
విధానం ఉచితం.. వ్యవహారం అనుచితం
రీచ్‌ల సమీప ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో పెద్దలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ట్రాక్టర్లను అడ్డుకుంటున్నారు. ట్రాక్టర్ అనుమతించాలంటే గ్రామానికి ఒక ట్రాక్టర్‌కు రూ.100 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నదిలో ఇసుక లోడ్ చేయడానికి ఇతర ప్రాంతాల నుంచి లేబర్‌ను ట్రాక్టర్లతో అనుమతించడం లేదు. ఆ గ్రామంలో ఉన్న కూలీలతోనే లోడ్ చేయించాలని నిబంధన పెడుతున్నారు. గ్రామానికి చెందిన ట్రాక్టర్‌కు ఒక రకంగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ట్రాక్టర్లకు వేరే రకంగా కూలి రేట్లు వసూలు చేస్తున్నారు. దీంతో నదుల నుంచి ఇసుకను తరలించడానికి ఇతర ప్రాంతాలకు చెందిన ట్రాక్టర్ల యజమానులకు ఉచిత ఇసుక అందని ద్రాక్షగా మారిపోయింది. జిల్లాలో అన్ని డివిజన్లలో ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయకపోవడంతో వీరంతా నదుల వద్దకు ఇసుకను తవ్వి లోడ్ చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. రీచ్‌కు సమీప ప్రాంతంలో ఉన్న గ్రామ పెద్దలకు డబ్బులు చెల్లించి లోడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో టన్ను ఇసుక రూ.వెయ్యికి మించి పలుకుతుంది.
లారీలకు ఉచితంగా ఇవ్వాలి
గత 20 ఏళ్లుగా శ్రీకాకుళం నుంచి విశాఖకు ఇసుక రవాణా చేస్తున్నాం, ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది కాబట్టి లారీలకు ఉచితంగా ఇసుక లోడ్ చేస్తే విశాఖలో విక్రయించి డబ్బులు చేసుకుంటామని ఈ నెల 11న కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందించారు. ఉచిత ఇసుక పాలసీల వల్ల చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఉచిత ఇసుక అని చెప్పి జిల్లాలో నారాయణపురం, గార, బట్టేరు ర్యాంపుల్లో ప్రతి లారీకి 10 టైర్లు లారీకి రూ.12 వేలు, 12 టైర్లు రూ.14 వేలు, 14 టైర్లు రూ.16 వేలు, 16 టైర్లకు రూ.18 వేలు లోడ్‌ఛార్జీలు తీసుకుంటున్నట్టు కలెక్టర్‌కు వివరించారు. ఎటువంటి మైనింగ్ బిల్లు, రశీదు ఇవ్వడంలేదని కలెక్టర్‌కు వివరించారు. దీనివల్ల ఇసుకను విశాఖకు తరలిస్తున్నప్పుడు ఓవర్ లోడ్ అని, మైనింగ్ బిల్లు లేదని లారీలపై కేసులు పెట్టి సీజ్ చేస్తున్నట్టు వివరించారు. ట్రాక్టర్లు మాదిరిగా తమకు ఇసుక ఉచితంగా లోడ్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. ఉచిత ఇసుక అమల్లోకి రాకముందు వీరంతా ఒక్కో లారీకి రూ.20వేల నుంచి రూ.30వేలు ముట్టజెబుతూ వచ్చారు. అప్పుడు అక్రమంగా ఇసుకను విశాఖకు తరలించి లారీ ఇసుకను డిమాండ్‌ను బట్టి రూ.50 నుంచి రూ.70 వేలకు విక్రయించేవారు. ప్రస్తుతం ఇసుక డిమాండ్ తగ్గిపోవడంతో లారీ ఇసుక విశాఖలో రూ.20 వేలకు మించడం లేదు. దీంతో వీరంతా ఉన్నతాధికారులను ఆశ్రయించి ఉచితంగా ఇసుక లోడ్ చేసుకొనే వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నారు.
సీపన్నాయుడుపేటలో..
ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట వద్ద ఉచిత ఇసుక అమల్లోకి వచ్చిన నాటికి కేవలం 5 ట్రాక్టర్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. వీటిని కేవలం ఇటుకలను తరలించడానికే వినియోగించేవారు. ఉచిత ఇసుక అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామంలో కొత్తగా 35 ట్రాక్టర్లు ప్రత్యక్షమయ్యాయి. మొత్తం 40 ట్రాక్టర్ల యజమానులంతా కలిసి గ్రామ సమీపంలో నాగవళి నదిలో తమ్మినాయుడుపేట వద్ద ఇసుక ర్యాంపును తెరచి సింగూరు తోటల్లో స్టాక్ పాయింట్ ఏర్పాటుచేసి జేసీబీలతో లారీల్లో లోడ్ చేసి విశాఖకు ట్రాన్స్‌పోర్టు చేస్తున్నారు. సీపన్నాయుడుపేటకు చెందిన ట్రాక్టర్లు యజమానులంతా కలిసి సమీప గ్రామాల నుంచి వచ్చే ట్రాక్టర్లలో ఇసుక లోడ్ చేసేందుకు అనుమతించడం లేదని స్థానిక ట్రాక్టర్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల అవసరాలకు ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఫరీద్‌పేట, ఇబ్రహింబాద్, కుశాలపురం తదితర గ్రామాలకు చెందిన వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టరుతో తరలించాల్సిన ఇసుకను లారీల్లో లోడ్ చేసి తరలించడం చట్ట విరుద్దమని స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సీపన్నాయుడు గ్రామానికి చెందిన ట్రాక్టర్ల యజమానులంతా ఒక జట్టుగా ఏర్పడి స్టాక్ పాయింట్ ఏర్పాటుచేసి రేయింబవళ్లు విశాఖకు లారీల్లో తరలిస్తున్నారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉండడంతో లారీల్లో ఇసుకను విశాఖకు తక్కువ ఖర్చుతో తరలించుకోవచ్చని లారీల యజమానులు సీపన్నాయుడుపేట ట్రాక్టర్ల యజమానులను ఆశ్రయిస్తున్నారు. ఈ వ్యవహారంలో పార్టీలకు అతీతంగా టీడీపీ, వైకాపా నాయకులంతా ఒక్కటై ఇసుక వ్యాపారం చేసుకోవడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రీచ్‌లకు సమాంతరంగా స్టాక్ పాయింట్లు
సింగుపురం గ్రామ పరిధిలో కొండమ్మ తల్లి టెంపుల్ నుంచి పల్లెవలసకు వెళ్లే తోవలో స్టోన్ క్రషర్స్ మధ్యలో ఒక స్టాక్ పాయింట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. బైరి అడ్డురోడ్డు సర్వే నెంబర్లు 87లో పిండిమిల్లు ముందు ఒక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేశారు. అడ్డురోడ్ జంక్షన్ నుంచి ఆమదాలవలస వెళ్లే మార్గంలో నైరా కాలేజీ దాటిన తర్వాత నక్కపేట బస్టాండ్ పక్కన ఒక్క స్టాక్‌పాయింట్ ఏర్పాటు చేశారు. అంపోలు జంక్షన్ నుంచి శారద ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లే మార్గమధ్యంలో అనధికారికంగా ఒక స్టాక్ పాయింట్ ఏర్పాటుచేశారు. బైరి బస్ షెల్టర్ నుంచి బూరవెల్లి మధ్యలో ఒక స్టాక్ పాయింట్, సింగుపురం గ్రామ రెవెన్యూ పరిధిలోని వైష్ణవి ఇంజనీరింగ్ కాలేజీ వెనుకవైపు ఉన్న జగనన్న కాలనీలో ఒక స్టాక్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. వీటిని కరజాడ, బైరి, పొన్నాం, బట్టేరు నుంచి అక్రమంగా ట్రాక్టర్లలో తరలించి ఇసుకను స్టాక్ చేస్తున్నారు. ఈ స్టాక్ పాయింట్లను టీడీపీ, వైకాపా నాయకులు కలిసి ట్రాక్టర్లతో అక్రమంగా తరలిస్తున్నారు. రీచ్‌ల నుంచి సొంత నిర్మాణం కోసం తరలిస్తున్నట్టు చెప్పి స్టాక్ పాయింట్లకు తరలించే ట్రాక్టర్ల యజమానులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం మేరకు ఇసుకను స్టాక్ పాయింట్లకు తరలిస్తే అక్కడ నుంచి లారీల్లో లోడ్ చేసి విశాఖకు తరలిస్తున్నారు. ఈ అనధికారిక స్టాక్ పాయింట్ల వద్ద రూ.7 నుంచి రూ.10 వేలకే ఇసుక లారీల్లో లోడ్ చేస్తున్నారు. దీంతో కొందరు లారీల యజమానులు అనధికారిక స్టాక్ పాయింట్లు నిర్వాహకులతో ముందుగా మాట్లాడుకొని అడ్వాన్స్‌లు ఇచ్చి ఇసుకను స్టాక్ చేయించి వీలు చిక్కినప్పుడల్లా విశాఖకు అక్రమంగా తరలిస్తున్నారు.










Comments