ఈ ఎన్నికలోనూ విలువల క్రాసింగేనా?
- DV RAMANA

- Sep 10, 2025
- 2 min read

ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. అనుకున్నట్లే ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధిం చారు. కానీ మెజారిటీ విషయంలో అంకెలు అటూ ఇటూ అవ్వడం చర్చకు ఆస్కారమిచ్చింది. విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్‌రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో రాధాకృష్ణన్ విజ యం సాధించారు. రావలసిన దానికంటే ఎన్డీయే అభ్యర్థికి ఎక్కువ మెజారిటీ రావడంతో విపక్షం వైపు నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తేటతెల్లమైంది. 14 ఓట్లు క్రాస్ అయ్యాయని ఓటింగ్ గణాం కాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల సంఖ్య 781. వీరిలో 14 మంది పోలింగులో పాల్గొనకపోవడంతో 767 ఓట్లు పోలయ్యాయి. వాటిలో 15 ఓట్లు చెల్లలేదు. ఇందులో రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు లభించగా, జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు లభించాయి. వాస్తవ బలాబలాలను పరిశీలిస్తే ఎన్డీయేకి 438, ఇండియా కూటమికి 314 ఓట్ల బలం మాత్రమే ఉంది. అంటే.. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి రావాల్సిన 314 ఓట్లలో 14 ఆయనకు కాకుండా అధికార అభ్యర్థికి పడినట్లు స్పష్టమైంది. పార్లమెంటు సభ్యులే ఓటర్లుగా ఉన్న ఎన్నికలో చెల్లని ఓట్లు నమోదు కావడం ఒక విడ్డూరం. కాగా ఈ ఎన్నికల్లోనూ.. 2022లో జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ సరిగ్గా 15 ఓట్లే చెల్లకుండాపోవడం మరింత విడ్డూరం. ఓట్లు చెల్లకుండా చేయడం కూడా ఒక కళే. తమకు అనుకూలమైన వారు గెలవడానికి వీలుగా రచించే వ్యూహాల్లో ఓట్ల చెల్లకపోవడం కూడా ఒక భాగమని ఎన్నికల తంతు గురించి తెలిసినవారికి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక క్రాస్ ఓటింగ్ వ్యవహారం కూడా గౌరవ పార్లమెంటు సభ్యులు, రాజకీయ పార్టీల ప్రతిష్టకు మచ్చలాంటిదే. ఉప రాష్ట్రపతి ఎన్నికను రెండు కూటములు ప్రతిష్టాత్మకంగా తీసు కున్నాయి. గతంలో మాదిరిగా అధికార ఎన్డీయే కూటమికి పార్లమెంటులో ఏమంత బలం లేదు. ఈ పరిస్థితుల్లో ఈసారి ఉప రాష్ట్రపతి ఎన్నికను ఇండియా కూటమి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్డీయే అభ్యర్థికి ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగానికి, ఆర్‌ఎస్‌ఎస్ వాదానాకి జరుగుతున్న ఎన్నికగా ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను చిత్రీకరించి విస్తృత ప్రచారం చేసింది. అభ్యర్థి ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరించి, న్యాయకోవిదుడైన సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయ మూర్తి జస్టిస్ వి.సుదర్శన్‌రెడ్డిని ఏకాభిప్రాయంతో ఎంపిక చేసి గెలవడం ఏమంత సనాయసం కాదని ఎన్డీయే కూటమికి సవాల్ విసిరింది. దీంతో ఎన్డీయే కూటమిలో కొంత ఆందోళన నెలకొంది. ఇదే అంశంపై కూటమి పక్షాల మధ్య కొంత చర్చ జరిగింది. ఎందుకైనా మంచిదన్నట్లు కేంద్రంలోని బీజేపీ పెద్దలు తమ వ్యూహాలకు పదునుపెట్టారు. తమకు పెద్ద బలం లేనందున ఏమాత్రం ఏమరు పాటు వహించినా ఫలితం తారుమారు అవుతుందని భావించి ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించారు. ప్రతి పక్ష ఇండియా కూటమిలోనే చీలికలు తీసుకొచ్చేలా వ్యూహాలు పన్నారు. దానికి ముందు రెండు ప్రధాన కూటములకు దూరంగా ఉన్న బీఆర్‌ఎస్, బీజేడీ, అకాలీదళ్‌లు ఎన్నికకు దూరంగా ఉండేలా చేయ డంలో విజయం సాధించారు. అందులో భాగంగానే వేర్వేరు కారణాలు చూపిస్తూ ఆ పార్టీల ఎంపీ లు పోలింగ్‌లో పాల్గొనలేదు. ఇది పరోక్షంగా ఎన్డీయేకి కలిసి వచ్చింది. మరోవైపు 14 మంది ఇండియా కూటమి ఎంపీలను కూడా కేంద్రం పెద్దలు మచ్చిక చేసుకున్నట్టు సమాచారం. వీటన్నింటి కారణం గా తుది ఫలితంలో తేడా వచ్చింది. ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ అనుకున్నదాని కంటే ఎక్కువ ఓట్లు సాధించగలిగారు. ఇండియా కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు సుమారు 14 మంది క్రాస్ ఓటింగ్ చేశారన్నది తేలిపోయింది. ఈ పరిణామాలను గమనిస్తే.. ఇండియా కూటమిలోని మిత్ర పక్షాల మధ్య ఐక్యత లేదన్న విషయం మరోమారు బట్టబయలైంది. కాగా ఇండియా కూటమిలో కీలక భాగస్వామి అయిన తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కు పాల్ప డ్డారని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. తమిళనాడు వాసుల్లో ప్రాంతీయ పక్షపాతం ఎక్కువ. తమ రాష్ట్రానికి చెందినవారికి మేలు జరుగుతుందనుకుంటే అంతర్గత విభేదాలను సైతం పక్కనపెట్టి ఏకమైపోతారు. ఆ రాష్ట్ర రాజకీయాలు కూడా దీనికి మినహాయింపు కాదు. ఆ కారణంతోనే ఉప రాష్ట్ర పతి ఎన్నికల్లో డీఎంకే పక్షీయులు తమిళనాడుకే చెందిన ఎన్డీయే అభ్యర్థికి రాధాకృష్ణన్‌కు అనుకూలంగా క్రాస్ ఓట్ చేశారని అంటున్నారు. ఏమైనా ప్రజాప్రతినిధులే ఇలా అనైతిక చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు.










Comments