ఈ వేదన తీరేదెలా!?
- NVS PRASAD

- 2 days ago
- 2 min read
ఎమ్మెల్యే శిరీషకు ఆగని కన్నీరు
పండా దాతృత్వాన్ని తప్పుపట్టగలమా?
తొమ్మిదేళ్ల చిన్నారికి మోక్షాన్ని ఎలా చూడాలి?
తప్పు మనదా? మన ధర్మానిదా?
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

నిన్న కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది మహిళలు.. 2015 జులై 15 గోదావరి పుష్కరాల్లో మరణించిన 27 మందిలో 25 మంది మహిళలు.. ఇంకా గంగానది పుష్కరాల సందర్భంగా అలహాబాద్‌లో జరిగే పుష్కరాల్లో స్త్రీల మరణాల సంఖ్య ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్త్రీలు బలహీనులైనందున ఇలా తొక్కిసలాటలో మరణిస్తారని తీర్మానించేవారు ఉన్నారు. కానీ అసలుకారణం స్త్రీని సంప్రదాయబద్ధంగా కనిపించేట్టు చేసే ఒక భావజాలం. ఒత్తిడిని కలుగజేసే చీర. ఈ భావజాల ఒత్తిడి ఎలాంటిదంటే.. మహిళలు దైనందిన జీవితంలో అత్యంత అసౌకర్యాన్ని కలిగించే చీరను అమితంగా ప్రేమిస్తారు. ఆధ్యాత్మిక సందర్భాలకు తగ్గ వస్త్రధారణగా మాత్రమే కాదు.. భారతీయతకు ప్రతీకగా కూడా చీరను భావిస్తారు. ఇదో భావదారిద్య్రం. ఏ వస్త్రధారణ అయినా సౌకర్యం, సురక్షితమే లక్ష్యమైవుండాలి. కానీ మన ఉనికి చుట్టూ మేకులు కొట్టే వ్యవస్థలో మనం కట్టుకున్న బట్టలే మారణాయుధాలుగా వేటగాడి వలలా మన శరీరాన్ని చుట్టేస్తే ఆరుగజాల వస్త్రబంధిఖానాలో చనిపోక ఏం చేస్తాం? ఏ దొమ్మీలోనైనా పడ్డంత తేలిక కాదు చీరతో లేచి నిలబడటం. అందుకే సంప్రదాయ రథం తొక్కుకుంటూ వెళ్లిపోతే తొమ్మిది శవాలుగా లెక్కతేలాయి. ఈ సంస్కృతి హత్యలకు సంతాపాలే తప్ప, ఛార్జిషీట్లు, శిక్షలు ఉండవు. భగవంతుడే స్వయంగా అలా నీకు పుణ్యపు చావు మంజూరు చేశాడని కర్మసిద్ధాంతమే సాక్ష్యం చెబుతుంది. కానీ తల్లి ప్రాణం కదా.. తల్లడిల్లిపోతుంది.

తాను ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనని, బ్రిటీష్ తూటాలకు ఎదురొడ్డి పోరాడిన సర్దార్‌కు మనుమరాలినని ఆ క్షణంలో ఆమె మనసు చెప్పివుండదు. తన కళ్ల ముందే తన తోటి మహిళలు విగతజీవులుగా ఉండటం చూసి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనపైన పరామర్శకు స్వయంగా తమ పార్టీ జాతీయ కార్యదర్శి వచ్చినా ఆమె ముఖంలో ఎక్కడా వెలుగు కనపడలేదు. తోటి దేశం నేతలంతా పలాసలోనే ఉన్నా, ఆమె మనసు మాత్రం చనిపోయిన కుటుంబాల చుట్టే తిరిగింది. ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రుల కోసమే రోధించింది. ఆదివారం స్వయంగా దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వచ్చినా ఆమె కుదుటపడలేదు. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించినా ఆమెకు ఊరట కలగలేదు. ఈ ఘటనలో చనిపోయిన 13 ఏళ్ల లొట్ల నిఖిల్‌కు అసలు పాపమేంటి, పుణ్యమేంటి తెలుస్తుందా? కార్తీక ఏకాదశి అంటే ఏంటమ్మా? అని అడిగితే ఆ తల్లి చెప్పగలిగేదా? కచ్చితంగా లేదు. కానీ కళ్ల ముందు ఆ కొడుకు లేకపోవడం ఇప్పుడు సత్యం. దేవుడు ఉన్నాడో లేడో చెప్పగలగడం మిధ్య. ఈ మధ్యలో మనుషులు మరణించడం మాత్రం వాస్తవం. ఇందులో ఏది పాపం.. ఏది పుణ్యం వెతకక్కర్లేదు. స్వయంగా తన సొంత ఆస్తులు అమ్ముకుని తన ప్రాంతంలో భక్తులకు వేంకటేశ్వరస్వామి దర్శనం కల్పించాలని భావించి గుడిని నిర్మించిన 94 ఏళ్ల హరిముకుంద పండాది తప్పు అని ఎలా చెబుతాం? ఇందుకోసం రూ.10 కోట్లకు పైగా తన సొంత సొమ్ములు, 12 ఎకరాల భూమిని ఖర్చు చేసిన ఆయన్ను దోషిగా ఎలా నిలబెడతాం? కేవలం మన జీవితంలో కొన్ని రోజులే పుణ్యతిధులని, మిగిలినవన్నీ భగవంతుని సేవకు అనువు కాదని ప్రచారం చేసే మన ధర్మాన్ని ఇప్పుడేమీ అనలేం. బతికివుండటమే జీవిత పరమార్థమని, మానవ సేవే మాధవ సేవ అని ప్రచారం చేయకపోవడం మన తప్పు. ఇందుకు ప్రతీ సందర్భంలోనూ మూల్యం చెల్లిస్తున్నాం. ఇక్కడ శిరీష కంటతడి పెట్టింది తన నియోజకవర్గంలో తనను నమ్మిన తొమ్మిది మంది చనిపోయినందుకు కాదు.. ఒక తల్లిగా, సాటి స్త్రీగా బలవంతుల కాళ్ల కింద చిక్కుకుపోయిన సాటి ప్రాణాన్ని మరి తీసుకురాలేమని.










Comments