ఈసారికి శాలువలతో సరి!
- NVS PRASAD
- Aug 16
- 3 min read
తటస్తంగా మారిన వరం తనయులు
దేశం కోటాలో తానే అధ్యక్షుడినంటున్న హరిగోపాల్
విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఊణ్ణ
జిల్లా అధ్యక్షుడికి లైన్ క్లియర్‌కు గోవిందరాజులు వ్యూహం
యువకుల కోటాలో మేమూ ఉన్నామంటున్న మల్లా, తంగుడు
రసవత్తరంగా మారిన నగర కళింగకోమటి కార్యవర్గ ఎన్నిక

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నగర కళింగకోమటి సంఘానికి కొత్త కార్యవర్గ నియామకం ప్రస్తుతానికి ‘దుప్పటి’ కప్పుకొని పడుకునే పరిస్థితిలో ఉంది. ఆదివారం ఈమేరకు ఎన్నిక/ఎంపిక నిర్వహించాల్సివున్నా ఇంతవరకు అందుకు సంబంధించిన సమయం, వేదికను శనివారం మధ్యాహ్నానికి ఇంకా నిర్ణయించలేదు. సంప్రదాయం మేరకు తాజా మాజీ అధ్యక్షుడు ఈ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయడానికి చొరవ తీసుకోవాలి. కానీ ఊణ్ణ నాగరాజు ఇంకా ఏడాదికి పైగా తన అధ్యక్ష పదవికి కాలపరిమితి ఉన్నా, అధికారం మారిందన్న ఒకే ఒక్క కారణంతో ఈ కథనం ప్రచురించే సమయానికి ఫిక్స్ చేయలేదు. అలా అని ఎన్నిక కోసం సమావేశం జరగదా? అంటే.. అదీకాదు. ఎందుకంటే.. సమయం, వేదికకు సంబంధించి ఊణ్ణ నాగరాజు నుంచి సమాచారం రాకపోతే తానే శనివారం సాయంత్రం దీన్ని ప్రకటిస్తానని పోటీలో ఉన్న కోరాడ హరిగోపాల్ ఇంతకు క్రితమే పేర్కొన్నారు.
సీన్ కట్ చేస్తే.. కళింగకోమటి నగర కార్యవర్గం ఎన్నిక సమయం గడిచేకొద్దీ మలుపులు తీసుకుంటోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నందున కోరాడ హరిగోపాల్ అధ్యక్షుడిగా ఆయనకు మద్దతు తెలిపినవారు మిగిలిన కార్యదర్శి, ట్రెజరర్, ఉపాధ్యక్షులు వంటి పోస్టులతో ఎంపికవుతారని, ఇది కేవలం లాంచనం మాత్రమేనని మొన్నటి వరకు అంతా భావించారు. కానీ అకస్మాత్తుగా ఊణ్ణ సర్వేశ్వరరావు తానూ రేసులో ఉన్నానని ప్రకటించడంతో హరిగోపాల్ ప్యానల్‌కు పదవులు పళ్లెంలో పెట్టి ఇవ్వడం అంత సులువు కాదని అందరికీ అర్థమైంది. అంతవరకు హరిగోపాల్‌కు తెర వెనుక మద్దతు ప్రకటించిన వరం తనయులు ఇప్పుడు తటస్తులుగా మారారు. హరిగోపాల్ నగర అధ్యక్షులు కావాలని కోరిక బలంగా సంతోష్‌కు ఉన్నా, ఊణ్ణ సర్వేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకించే సాహసం చేయలేకపోతున్నారు. తెలుగుదేశం అధికారంలో ఉండటం వల్ల తానొక్కడినే అభ్యర్థినని, ఊణ్ణ సర్వేశ్వరరావు వైకాపా బలపరుస్తున్న అభ్యర్థి అని హరిగోపాల్ భావించినా సర్వేశ్వరరావు మాత్రం చాపకింద నీరులా తన ప్రచారం చేసుకుపోతున్నారు. కేవలం మార్కెట్‌లో వర్తకులు, పెద్దిన మురళీ మద్దతు మినహా ఇప్పటి వరకు హరిగోపాల్ తాను బరిలో ఉన్నానని, తన ఎన్నికకు సహకరించాలని ఎవరికీ ఫోన్ చేయలేదు. ఎందుకంటే.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకుడే అధ్యక్షుడిగా ఉండాలన్న నిబంధన ఉంది కాబట్టి గడిచిన ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో జగన్మోహన్‌రెడ్డికి జైకొట్టిన ఊణ్ణ సర్వేశ్వరరావును ఎన్నుకునే పరిస్థితే ఉండదనేది హరిగోపాల్ వర్గం వాదన. వాస్తవానికి ఊణ్ణ సర్వేశ్వరరావుకు నగరంలో ఉన్న చాలామంది టీడీపీ నేతల కంటే ముందునుంచే టీడీపీలో సభ్యత్వం ఉంది. ఆ కార్డును ఇప్పుడు ఆయన బయటపెట్టారు. కేవలం గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా కళింగకోమట్లను బీసీల్లో చేరుస్తూ జీవో వచ్చినందున హర్షం వ్యక్తం చేశాం తప్ప, వైకాపా కోసం ఎక్కడా పని చేయలేదని ఆయన చెబుతూ తనకు మద్దతు తెలపాలని అందర్నీ కోరుతున్నారు. ఈమేరకు ఇప్పటికే మూడుసార్లు ఆయన వివిధ వర్గాలతో సమావేశమయ్యారు. నగరంలో కళింగవైశ్య కల్యాణ మండపం శిథిలావస్థకు వచ్చిందని, దీనికి ఆనుకొని ఉన్న రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవనాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి భారీగా ఆస్తివిలువను పెంచారని, ఇప్పుడు కళింగవైశ్య కల్యాణ మండపాన్ని ఆ రీతిలో బాగుచేయాలంటే పిలిస్తే పలికే విధంగా, పది రూపాయలు డొనేషన్ ఇచ్చే నాయకత్వం అవసరమనే నినాదాన్ని సర్వేశ్వరరావు తెర మీదకు తెచ్చారు. అయితే టీడీపీ అంటే కేవలం హరిగోపాల్ మాత్రమే కాదని, ఈ పార్టీలో ఉన్న జామి భీమశంకర్, బరాటం ఉదయశంకర్ గుప్త, ఇప్పిలి తిరుమలరావు వంటి చాలామంది సీనియర్లు ఉన్నారని, ఇక్కడ పార్టీల ప్రస్తావన లేకుండా కోమట్ల మద్దతు ఉన్నవారికే ఎంపిక చేయాలని కోరుతూ మరో ప్యానల్ తెరమీదకు వచ్చింది. వరం తనయులు కోరాడ హరిగోపాల్‌కు తెర వెనుక మద్దతు ఇచ్చినంత వరకు హరిగోపాల్ వర్గంగా ఉన్న అంధవరపు చైతన్యప్రభు, మల్లా కల్యాణ్ చక్రవర్తి, తంగుడు రాజులు ఇప్పుడు పార్టీలకు అతీతంగా యువత కోటాలో తమను ఎన్నుకోవాలని రెండు రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. అయితే హరిగోపాల్, లేదంటే వైకాపా మాత్రమే కాదని, తమను కూడా కళింగకోమటి అభివృద్ధి కాంక్షకులుగానే చూడాలని వారు పిలుపునిస్తున్నారు. దీంతో ఇప్పుడు ముక్కోణపు పోటీ మొదలైంది. వాస్తవానికి ఊణ్ణ సర్వేశ్వరరావు వెనుక మద్దతిస్తున్న నేతలు వైకాపాలో ఉన్నవారే. అలాగని వారిలో చాలామంది గతంలో టీడీపీలో కూడా కొనసాగివున్నారు. అలాగే టీడీపీలో కూడా ఓ బలమైన వర్గం ఊణ్ణ సర్వేశ్వరరావుకు మద్దతు తెలుపుతుంది. పార్టీ మాత్రం కోరాడ హరిగోపాల్‌ను నగర సంఘం అధ్యక్షుడిగా నియమించాలని భావిస్తోంది. ఎందుకంటే.. తనకు జిల్లా కళింగకోమటి అధ్యక్ష పదవి కావాలని హరిగోపాల్ ఆమధ్య తన గ్రూపుతో సమావేశం పెట్టి రాష్ట్ర అధ్యక్షుడు బోయిన గోవిందరాజులు దృష్టికి తీసుకువెళ్లారు. కానీ ఆయన సతీష్‌ను అధ్యక్షుడిగా ప్రకటించారు. ఇప్పుడు హరిగోపాల్, సతీష్‌ల మధ్య పంచాయితీ తేలకపోవడం బోయిన గోవిందరాజులుకు తలనొప్పిగా మారింది. ఇప్పుడు కోరాడ హరిగోపాల్‌ను నగర అధ్యక్షుడ్ని చేస్తే, సతీష్‌ను తాను అనుకున్నట్టే జిల్లా అధ్యక్ష పదవికి పంపించవచ్చనేది గోవిందరాజులు భావన. అదే సమయంలో ఇటీవల పెద్ద ఎత్తున మార్కెట్‌లో రక్తదానం నిర్వహించిన కోరాడ హరిగోపాల్‌ను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఫోన్‌లో అభినందించారు. ఈ సందర్భంగా నగరంలో నగర సంఘ ఎన్నికల అంశాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అధ్యక్షుడిగా హరిగోపాలే ఉండాలని తాను కోరుకుంటున్నానన్న విషయాన్ని కేంద్రమంత్రి బయటపెట్టడంతో పాటు స్థానిక ఎమ్మెల్యేను కలిసి మద్దతు కూడగట్టాలని హరిగోపాల్‌కు సూచించినట్టు భోగట్టా. అయితే హరి ఈమేరకు ఎవరిని కలిశారో తెలియదుగానీ, సర్వేశ్వరరావు మాత్రం వైకాపా కేటగిరీలోకి వస్తారు కాబట్టి తాను మాత్రమే అభ్యర్థినన్న భావనలో ఉన్నారు. కానీ బలమైన పోటీ సర్వేశ్వరరావు రూపంలో రావడంతో మల్లా కల్యాణ్ చక్రవర్తి ప్యానల్ కూడా రంగంలోకి వచ్చింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. ఆదివారం నాటి ఎన్నిక ప్రక్రియ జరగదని అర్థమవుతుంది. ఎప్పటి మాదిరిగానే వచ్చినవారిలో పెద్దలకు శాలువాలు (దుప్పటి) కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి కొన్నాళ్లు ఈ వ్యవహారాన్ని పడుకోబెట్టేస్తారు. ఈలోగా కళింగకోమటి కార్పొరేషన్ చైర్మన్ పోస్టుకు ఎవరెళ్తారో తెలిసిపోతుంది. ఆ తర్వాత నగర టీడీపీ కార్యవర్గంలో ఎంతమంది కోమట్లు అకామిడేట్ అవుతారో తేలుతుంది. అప్పుడు ఒక వ్యక్తికి ఒకే పదవి రీతిలో మూడు గ్రూపులను కూర్చోబెట్టి పదవులు సర్దుతారు. అప్పటికీ ఏకాభిప్రాయానికి రాకపోతే, వరం పెద్ద కుమారుడు ప్రసాద్‌ను రంగంలోకి దించినా ఆశ్చర్యం లేదు.
コメント