ఈసారి రథసప్తమి వేడుకలుఏడు రోజులు ఎందుకో తెలుసా?!
- DV RAMANA

- 3 days ago
- 2 min read
ఆయురారోగ్యాలు ప్రసాదించే మహాశక్తులు ఏడు గుర్రాలు
ప్రకతికి పర్యాయపదాలని మరో పురాణ కథనం
ఈ సప్తాశ్వాలకు ప్రతీకగానే ఏడు రోజుల ఉత్సవాలు
ఘనంగా ప్రారంభమైన రథసప్తమి వేడుకలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
సప్తాశ్వ రథమారూఢమ్
ప్రచండం కాశ్యపాత్మజమ్
శ్వేత పద్మధరం దేవమ్
తం సూర్యం ప్రణమామ్యహమ్
సకల లోకాలను ఏలే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామిని ఈ శ్లోకంతోనే ప్రార్థిస్తుంటాం. ఈ శ్లోకంలోని మొదటి లైను సప్తాశ్వ రథమారూఢమ్.. అంటే ఏడు గుర్రాల(అశ్వాలు)తో కూడిన రథం అధిరోహించే వాడని అర్థం. సూర్యనారాయణ స్వామి ఈ ఏడు గుర్రాల రథాన్ని అధిరోహించే నిత్యం భూమండలం చుట్టూ తిరుగుతూ సకల లోకాలకు వెలుగు ప్రసాదిస్తుంటాడు. అదితి కుమారుడు కనుక ఆదిత్యుడు అని కూడా పిలిపించుకునే ప్రత్యక్ష భగవానుడు గరుత్మంతుని సోదరుడైన అనూరుడిని తన సప్తాశ్వ రథానికి సారధిగా చేసుకుని గగన మండలంలో సంచరిస్తూ తన విద్యుక్త ధర్మం నిర్వహిస్తుంటాడు. సూర్యభవనాడు తన రథానికి ఏడు గుర్రాలనే ఎందుకు వినియోగిస్తున్నాడని సంశయం కలగకవచ్చు. పురాణాల ప్రకారం దానికి అనేక కారణాలు ఉన్నాయి. సూర్యుడు భూమండలం చుట్టూ తిరగడానికి ఒకరోజు పడుతుంది. అలా ఏడు రోజులు తిరిగితే అది ఒక వారం అవుతుంది. ఈ ఏడు రోజులకు ఆయన రథానికి ఉన్న ఏడు గుర్రాలు ప్రతీకలని అంటారు. సూర్యుడి రథాన్ని ఇంద్రధనస్సుగా గానూ అభివర్ణిస్తుంటారు. ఆ ఇంద్ర చాపంలో ఉండే సప్తవర్ణాలే (రంగులే) ఈ ఏడు గుర్రాలని కూడా ప్రతీతి. ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అని కూడా అంటారు. సప్తాశ్వ రథంపైనే సూర్యదేవుడు మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుý గుండా ప్రయాణిస్తుంటాడు. ఈ మొత్తం ప్రయాణానికి ఏడాది పడుతుంది. అది సూర్య జయంతి నుంచే ప్రారంభమవుతుంది. అదే రథసప్తమి. వాస్తవానికి అందరూ అనుకుంటున్నట్లు రథసప్తమి సూర్య జయంతి కాదు. సూర్యుడు ఆ రోజు పుట్టలేదు. ఆయన సప్తాశ్వ రథాన్ని అధిరోహించి ప్రయాణం మొదలుపెట్టిన రోజు. అందుకే ఈ పుణ్యతిధిని రధసప్తమి అంటారు. ఈ పురాణ ప్రాశస్త్యాన్ని దష్టిలో ఉంచుకునే రాష్ట్ర ప్రభుత్వం రథసప్తమిని ఏడు రోజుల పండుగగా నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో రథసప్తమిని అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఒక్కరోజు మాత్రమే జరిపేవారు. 2024లో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర ఉత్సవంగా గుర్తించారు. ఆ మేరకు గత ఏడాది ఉత్సవాలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది సూర్యుడి రథాశ్వాలకు, రథసప్తమి అన్న పేరుకు నిజమైన నిర్వచనంగా ఏడు రోజులు నిర్వహించడానికి స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో సన్నాహాలు పూర్తి చేశారు. ఉత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి.
ఏడు గుర్రాలు.. వాటి ప్రత్యేకతలు
సూర్యభగవానుడి రథానికి పూన్చిన ఏడు గుర్రాలు కూడా ప్రకతికి అనుసంధానమైనవే కావడం విశేషం. ఒక్కో అశ్వం ఒక్కో విశిష్టత కలిగి ఉన్నాయి. గాయత్రి, బహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అనే పేర్లతో వీటిని వ్యవహరిస్తుంటారు. అరసవల్లిలో ఏడు రోజులు నిర్వహించే రథసప్తమి ఉత్సవాలను ఒక్కో రోజు ఒక్కో సూర్యాశ్వానికి అంకితం చేశారు. వాటి గురించి క్లుప్తంగా..
ఉత్సవాలు ప్రారంభమైన తొలిరోజు అంటే 19వ తేదీన గాయత్రి ఆశ్వానికి అంకితమిచ్చారు. ఈ ఆశ్వం వెలుగు అంటే ప్రకాశానికి, జ్ఞానానికి ప్రతీక. ప్రపంచానికి నిరంతర వెలుగు, విజ్ఞానం ప్రసాదించి చైతన్యం కలిగించేదిగా, నిరంతర శక్తి కేంద్రంగా గాయత్రి అశ్వాన్ని అభివర్ణిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు సూర్యనారాయణ స్వామి తిరువీధి సేవ నిర్వహిస్తున్నారు.
రెండో రోజైన 20వ తేదీని బహతి అనే అశ్వానికి కేటాయించారు. ఇది శక్తికి, రక్షణకు ప్రతీక. శారీరక, మానసిక ప్రక్షాళనకు ఇది సహకరిస్తుంది. అంతర్గత శక్తినిచ్చి రోగనిరోధకత పెంపొందిస్తుంది. సౌరశక్తిని ఇముడ్చుకోవడం ద్వారా ఒత్తిడిని, వ్యాధులను దూరం చేస్తుంది. ఉత్సవమూర్తికి ఈరోజు అభిషేక సేవ చేస్తారు.
మూడోరోజైన 21ని ఉష్ణిక్ అనే అశ్వానికి అర్పితం చేశారు. తేజస్సు, సంపదల సమద్ధిని సమకూర్చడానికి ప్రతీకగా ఈ అశ్వాన్ని భావిస్తారు. వ్యక్తిగతంగా, సమాజికంగా గుర్తింపునిచ్చి ఆత్మవిశ్వాసం పెంచుతుంది. సంపదలతో జీవితం సమద్ధి సంతరించుకునేలా చేస్తుంది. ఈ రోజు ఆదిత్యునికి స్వర్ణాలంకరణ సేవ నిర్వహిస్తారు.
నాలుగో రోజైన 22వ తేదీని అనుష్టుప్ అనే అశ్వానికి అంకితం చేశారు. జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ క్రమబద్ధంగా ఉంచడంలో సహకరిస్తుంది. ఈ అశ్వం మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికత, సుహద్భావం వంటివి ప్రోది చేస్తుంది. ఈ రోజు స్వామి ఉత్సవమూర్తికి లక్ష పుష్పార్చన చేస్తారు. తద్వార మనసుకు స్వాంతన లభిస్తుంది.
ఐదో రోజైన 23వ తేదీని త్రిష్టుప్ అనే అశ్వానికి గుర్తుగా పరిగణిస్తారు. క్రమశిక్షణకు, అధికారానికి ఇది ప్రతీక. సౌరశక్తిని గ్రహించి శారీరక బలాన్ని పెంచుతుంది. ఈ రోజు సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహిస్తారు.
ఆరో రోజైన 24వ తేదీని జగతి అనే అశ్వానికి ప్రతీకగా భావిస్తారు. శుభకరమైన మార్పు, పునరుద్ధరణ ప్రక్రియలకు ఇది మూలంగా నిలుస్తుంది. ఈ అశ్వం అగ్నికి, శుద్ధీకరణకు ప్రతీకగా భావిస్తారు. సామూహిక సాంత్వనలకు, పర్యావరణాన్ని పరిశుద్ధం చేసేందుకు ఇది దోహదపడుతుంది. మనలోని వ్యతిరేక భావనలను పారదోలి ఒత్తిళ్లను తొలగిస్తుంది. అగ్ని సంస్కారానికి ప్రతీకగా ఈ రోజు మహా సౌరయాగం నిర్వహిస్తారు.
ఏడో రోజైన 25వ తేదీని పంకి అనే అశ్వానికి అర్పించారు. ఇది ముగింపునకు, దైవకపకు చిహ్నం. సౌరశక్తిని సమతుల్యం చేసి జీవన శక్తులను పునరుద్ధరిస్తుంది. ఆధ్యాత్మిక భావనలను పెంపొందించి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. ఈ రోజే రథసప్తమి పర్వదినం.










Comments