top of page

ఉందిగా కోర్టు సాకు.. చేసేద్దాం ఆ సొమ్ముతో సోకు!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Aug 7
  • 2 min read
  • డైరెక్టర్‌ అనుమతి లేకుండానే ఎడాపెడా ఖర్చులు

  • ఒక కేసులో కోర్టు ఆదేశాలతో అవే నిధులతో చెల్లింపు

  • అదే అదనుగా ఇతరత్రా చిల్లర ఖర్చులన్నీ దాంతోనే

  • డీఎంహెచ్‌వో కార్యాలయ ఏవో నిర్వాకం

ree
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఒకసారి బట్టలు మాసిన తర్వాత ఎక్కడ కూర్చోడానికైనా ఆలోచించం. కుండకి ఓ పక్క చిల్లు పడిన తర్వాత అందులో నీరుండి ప్రయోజనమేమిటని భావిస్తాం. ఇవి ఎవరికైనా వర్తించే జీవిత సూత్రాలు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కూడా ఇటువంటి జీవనసూత్రమే కనిపిస్తోంది. ఓ బ్యాంకు డిపాజిట్‌పై వచ్చిన వడ్డీ గానీ, అసలు గానీ వాడటానికి వీల్లేదన్న నిబంధనలున్నా కోర్టు ధిక్కార కేసు ఉంది కాబట్టి, ఆ మేరకు సొమ్ములు చెల్లించాలన్న నెపంతో బ్యాంకులో ఉన్న డిపాజిట్‌ తాలూకా వడ్డీని ఏడాది క్రితం కొంతమేరకు విత్‌డ్రా చేసిన వైద్య ఆరోగ్యశాఖ ఏవో బాబూరావు ఆ తర్వాత తన కార్యాలయ పరిధిలో ప్రతి ఖర్చును ఈ వడ్డీ సొమ్ముతోనే చేయిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. 2005లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వైద్యఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న ఆస్పత్రులు, పీహెచ్‌సీలకు సర్జికల్‌, మెయింటినెన్స్‌ కోసం రూ.2 కోట్ల బడ్జెట్‌ను అప్పటి ప్రభుత్వం జిల్లాకు విడుదల చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ, స్థానికంగా ఈ నిధులతో ఎటువంటి కొనుగోళ్లూ జరపకూడదంటూ ఉత్తర్వులిచ్చింది. దీంతో హెడ్‌ అకౌంట్‌ 240 పేరిట ఈ నిధులు అప్పట్నుంచీ బ్యాంకులోనే ఉన్నాయి. ఇప్పుడు దాని మీద వచ్చిన వడ్డీయే దాదాపు రూ.2 కోట్లు ఉంది. కానీ దీన్ని విత్‌డ్రా చేసి ఖర్చు చేయాలంటే హెల్త్‌ డైరెక్టర్‌ అనుమతి ఉండాలి. గతంలో జిల్లా స్థాయిలో అనేక బిల్లుల చెల్లింపులకు ఈ వడ్డీని వాడుకుంటామంటూ ఆ కార్యాలయానికి లేఖలు రాసినా ఎటువంటి అనుమతులూ రాలేదు. కానీ 2024లో డీఎంహెచ్‌వో కార్యాలయానికి ఏవోగా వచ్చిన బాబూరావు ఈ వడ్డీ డబ్బుల్లో రూ.18 లక్షలు హన్షిత ఎంటర్‌ప్రైజెస్‌కు చెల్లించారు. అలా ఎందుకు చేశారని ఆరాతీస్తే 2018లో ధనుంజయరెడ్డి కలెక్టర్‌గా ఉన్నప్పుడు జిల్లాలో ఉన్న పీహెచ్‌సీలకు బల్లలు, బెంచీలు, కుర్చీలు వంటివి కొనుగోలు చేయాలని నోట్‌ పెట్టి హన్షిత ఎంటర్‌ప్రైజెస్‌ నుంచి రూ.18 లక్షలు విలువైన మెటీరియల్‌ కొనుగోలు చేశారు. ఆ మేరకు వీరికి బిల్లులు చెల్లించాల్సి ఉంది. కానీ ఎప్పటికీ చెల్లింపులు జరగకపోవడంతో సంబంధిత సంస్థ కోర్టును ఆశ్రయించి బిల్లులు చెల్లించేలా ఆదేశాలు తెచ్చుకుంది. అయితే దాన్ని కూడా ఆ తర్వాత వచ్చిన అధికారులు పట్టించుకోలేదు. మళ్లీ హన్షిత ఎంటర్‌ప్రైజెస్‌ కోర్టు ధిక్కరణ కింద మరో కేసు వేసింది. దీంతో ఎస్‌బీఐలో ఉన్న వడ్డీ సొమ్ములో రూ.18 లక్షలు హన్షిత ఎంటర్‌ప్రైజెస్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. వాస్తవానికి కోర్టు కంటెంప్ట్‌ కేసు కాబట్టి కలెక్టర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకే కొనుగోలు చేపట్టారు కాబట్టి ఈ బిల్లులు వేరే నిధుల నుంచి చెల్లించాలి. లేదూ అంటే కోర్టు ధిక్కరణ కింద కేసు ఉంది కాబట్టి ఎస్‌బీఐలో ఉన్న 240 హెడ్‌ నుంచి వడ్డీని విత్‌డ్రా చేసుకోడానికి అనుమతి ఇవ్వాలని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ హెల్త్‌కు రాయాలి. ఒకవేళ ఈమేరకు అనుమతులు ఇవ్వకపోతే హైకోర్టు ధిక్కరణ కింద వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ హెల్త్‌ అధికారులే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ బాబూరావే వడ్డీ డబ్బులు విత్‌డ్రా చేశారు. పోనీ బిల్లుల చెల్లింపులోనైనా పారదర్శకత పాటించారా..? అంటే అదీ లేదు. దాదాపు రూ.18 లక్షలు పైబడి బిల్లులు చెల్లించినప్పుడు టీడీఎస్‌ 5 శాతం కట్‌ చేయాలి. దీని వల్ల దాదాపు రూ.50వేలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అది కూడా చేయలేదు. ఆ తర్వాత ఎలాగూ వడ్డీ డబ్బులు తీయడం మొదలుపెట్టాం కాబట్టి, నెమ్మదిగా కార్యాలయ ఖర్చులు ఒడ్డెక్కించేద్దామన్న భావనతో ఇటీవల మళ్లీ 2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు విత్‌డ్రా చేశారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో కొంతమేర విద్యుత్‌వైర్లు ఆమధ్య పాడైపోయాయి. పనిలో పనిగా ఒక టీవీ, ఒక ఏసీ ఈ డబ్బులతో కొనుగోలు చేశారు. వాస్తవానికి లక్ష రూపాయలు పైబడిన పనులు చేపట్టాలంటే ఏపీహెచ్‌ఎంఐడీసీ సంస్థ చేపట్టాలి. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల మౌలిక వసతుల కల్పన కోసం ఈ విభాగం పని చేస్తుంటుంది. వారికి చెబితే అంచనాలు తయారుచేసి రిపేరు పనులు చేస్తారు. అలా కాకుండా దాదాపు రూ.3 లక్షల పనులను వీరే సొంతంగా తయారుచేసేశారు. స్థానికంగా వైర్లు కొనుగోలు చేశారని, వీటిలో నాణ్యత లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. స్థానికంగా బిల్లులు తయారుచేసి అకౌంటెంట్‌, ఏవోలు డీఎంహెచ్‌వో అండదండలతో ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page