ఉందిలే.. ఈఎంఐ ఊబి!
- DV RAMANA

- Aug 4, 2025
- 2 min read

‘ఉందిగా సెప్టెంబర్ మార్చిపైన.. వాయిదా పద్ధతుంది దేనికైనా’.. అని ఓ సినీ కవి చేసిన ఉవాచ ఇప్పుడు సగటు మనిషిపై తారకమంత్రంలా పని చేస్తోంది. ఆ పాటలోని మిగతా సాహిత్యాన్ని వదిలేసి ‘వాయిదా పద్ధతుంది దేనికైనా’ అన్న ఒకదాన్ని తెగ వాడేస్తున్నాడు. ముఖ్యంగా వస్తుసామగ్రి కొను గోలు విషయంలో వాయిదాలనే నమ్ముకుంటున్నాడు. దాన్నే ప్రస్తుత మార్కెట్ పరిభాషలో చెప్పాలంటే ఈఎంఐ. ఇంటికి గానీ, తనకు గానీ ఏ అవసరం వచ్చినా.. ‘ఉందిగా ఈఎంఐ సౌకర్యం’ అని రాగం తీసుకుంటూ కొనిపడేస్తున్నాడు. మన దేశంలో మెజారిటీ జనాభాత మధ్యతరగతివారే. తమ కంటే పై స్థాయిలో జీవిస్తున్న వారిని అందుకోవటానికి చేసే ప్రయత్నం వారిని వాయిదాల పద్ధతిపై ఆధార పడేలా చేస్తోంది. ఈ క్రమంలో ఈఎంఐ పద్ధతిలో నెలనెలా చెల్లించవచ్చు కదా అన్న ధీమాతో కిందా మీదా చూడకుండా కొనుగోళ్లు జరిపేస్తున్నారు. కానీ నెల తిరిగేసరికి ఈఎంఐల భారం కళ్లు తిరిగేలా చేస్తోంది. అర్థికంగా మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి కల్పిస్తోంది. పరువు కోసం పాకులాడే మధ్య తరగతి ప్రజలు తమకు వస్తున్న ఆదాయాన్ని అవసరాలకు సరిపెట్టుకోవడంతో ఆగకుండా ఇతర కోరికలు, లగ్జరీలకు అప్పుల మీద అప్పులు చేసేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు పన్నులు, ద్రవ్యోల్బ ణం వంటి వాటి కంటే ఈఎంఐల భారంతో ఎక్కువ బాధపడుతున్నారని తాజా నివేదికలు చెబుతు న్నాయి. కంటికి కనిపించని ఈఎంఐ ట్రాప్ భారతీయులను ఆర్థికంగా పతనబాట పట్టిస్తోంది. మధ్య తరగతి ప్రజలు ‘సంపాదించటం.. అప్పులు చేయటం.. వాటిని చెల్లించటం.. ఆ గ్యాప్ పూడ్చటానికి మళ్లీ అప్పు చేయటం’.. ఇలా అప్పుల చట్రంలో చిక్కుకుంటున్నారు. ఎలాంటి సేవింగ్స్ లేకపోవటం, క్రెడిట్ కార్డులు స్వైప్ చేస్తూ తమకు తెలియకుండానే ఈఎంఐల ఉచ్చులో పడిపోయి వాటి నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఫోన్ కొనాలన్నా, ఫ్రిజ్ కావాలన్నా, ఏసీ.. సోఫా.. విమానం, రైలు టికెట్లు.. చివరికి సినిమా టికెట్లకూ ఈఎంఐలు వాడేస్తున్నారు. కిరాణా సరుకులు కొనడానికి కూడా సూపర్ మార్కెట్లకు వెళ్లి క్రెడిట్ కార్డులు గీకేస్తున్నారు. ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా రుణం అందు తుండటంతో చాలామంది రుణం తీసుకోవడం, ఈఎంఐ కట్టడాన్ని ఈ రోజుల్లో అతి సాధారణ అంశంగా భావిస్తున్నారు. కానీ పరిస్థితులు వాస్తవం కంటే దారుణంగా దిగజారుతున్నాయి. ఫలితంగా దేశంలో గృహ రుణాల వాట జీడీపీలో 42 శాతానికి చేరుకోవటం ఆందోళన కలిగిస్తోంది. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా డెబిట్, క్రెడిట్ కార్డులపై అందే రుణాలు, ‘బై నౌ పే లేటర్’ వంటి సర్వీసులు పరిస్థితులను మరింతగా దిగజారుస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో ప్రస్తుతం వినియో గంలో ఉన్న ఐఫోన్లలో 70శాతం ఈఎంఐలపై కొన్నవేనంటే అతిశయోక్తి కాదు. ఈఎంఐలకు ప్రజలు ఎంత అలవాటు పడిపోయారో దీన్ని బట్టే అర్థమవుతుంది. చిన్న రుణాలు తీసుకుంటున్న వారిలో 11 శాతం మంది ఈఎంఐలు కట్టడంలో విఫలమవుతున్నారని తేలింది. ఈ పరిస్థితుల్లో రుణాలను పేర్చు కొని పోతూ మధ్యతరగతి భారతీయులు కోలుకోలేని రుణాల ఊబిలోకి జారిపోతున్నారని ఆర్థిక నిపు ణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఫోన్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ అంటూ ప్రతినెలా సంపాదనలో కనీసం రూ.25వేల వరకు చెల్లింపులకే కేటాయించాల్సి వస్తోంది. దీనివల్ల పొదుపు చేసే శక్తి సన్నగిల్లి ప్రతి అవసరానికి మళ్లీ అప్పులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో అనుకోకుండా అనారోగ్యం ఏర్పడితే ఇక అంతే జీవితం మొత్తం తలకిందులైపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది వ్యక్తులకు సంబంధించిన సమస్య కాదని.. దేశాభివృద్ధిని కూడా దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్య తరగతివారే కాకుండా సంపన్నులు కూడా ఇటీవలి కాలంలో ఈఎంఐల వైపు మొగ్గు చూపుతున్నారు. తమకు వచ్చే ఆదాయంలో కట్టాల్సిన ఈఎంఐలు 40 శాతం లోపే ఉండేలా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. అలాగే అత్యవసర సమయంలో ఆదుకునేలా ఎమ ర్జెన్సీ ఫండ్ ఏర్పాటుకు నెలకు కనీసం రూ.500 కేటాయించాలన్నారు. అందరి ముందూ గొప్పగా.. ఉన్నతంగా జీవిస్తున్నట్లు కనిపించటం కోసం రుణాలు తీసుకుని విలాసాలకు పోవద్దని హెచ్చరిస్తు న్నారు. సరైన మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం అలవర్చుకోవాలంటున్నారు. ఒత్తిడితో జీవితాన్ని గడ పటం సాధారణమైన అంశం కాదని.. రుణాలు చెల్లించకుండా జీవించటం సక్సెస్ కాదంటున్నారు. ఎక్కువ సంపాదించటం కంటే ఎక్కువ దాచుకోవటంలోనే ఆర్థికంగా స్వేచ్ఛ లభిస్తుందని మధ్యతరగతి ప్రజలు గుర్తుంచుకోవాల్సి ఉంది.










Comments