top of page

‘ఉక్కు’ హక్కుకు మనమే నీళ్లొదిలేశాం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Aug 26, 2025
  • 2 min read

ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వజ్రాయుధంలాంటిది. ఉపయోగించుకునే ఉపయోగించుకున్నంత అన్నట్లు.. వాడుకునే విధానాన్నిబట్టే దాని ప్రయోజనాలు కూడా ఆధారపడి ఉంటాయి. పనికిమాలిన వాటికోసం ఉపయోగిస్తే.. అది దుర్వినియోగం అయినట్లే.. అలాంటప్పుడు ప్రయోజనాలు ఆశించే హక్కు కూడా కోల్పోతాం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో రాష్ట్ర ప్రజలకు సరిగ్గా ఇదే సూత్రం వర్తి స్తుంది. విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరిస్తున్న విషయం కొత్త కాదు. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందునుంచే ఆ ప్రక్రియను కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ప్రారంభించింది. ఆ విషయం తెలిసినా.. మనందరం ఎన్నడూ లేనంత రికార్డు స్థాయి సీట్లు కట్టబెట్టి మరీ అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీయే కూటమి ప్రభుత్వాలనే కూర్చోబెట్టాం. అంటే వారి విధానాలను, చర్య లను, కార్యక్రమాలను మన సమర్థించినట్లే కదా?! అలాంటప్పుడు ఇప్పుడేదో కొత్తగా ప్రారంభిం చినట్లు స్టీల్‌ప్లాంట్‌ను విభాగాలవారీగా ప్రైవేటుకు ధారాదత్తం చేసేస్తున్నారని వగచడంలో అర్థం ఉందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇది మన స్వయంకృతాపరాధమేనని మనల్ని మనం తిట్టు కుంటే మంచిదేమో! ‘విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు’ అన్న నినాదం ఆంధ్రుల భావోద్వేగాలతో పెన వేసుకున్నదని అంటుంటాం. పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న విశాఖఉక్కు కర్మాగారాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరికివారుగా తమ సొంతమన్నట్లు ఓన్‌ చేసుకుంటారు. ఆ పేరు వినగానే ఏదో తెలియని అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతుంటారు. కానీ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆ నినాదం తాలూకూ మ్యాజిక్‌ పని చేయలేదు. దాని పరిరక్షణ కోసం అప్పటికే వెయ్యికిపైగా రోజుల నుంచి జరుగుతున్న ఉద్యమమూ ప్రభావం చూపలేదు. ‘మీకెందుకు మేం అధికారంలోకి వస్తే స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షిస్తాం.. అంతెందుకు ఇప్పటికే ప్రైవేటీకరణ సన్నాహాలను నిలిపివేయించాం’ అని ఎన్డీయే కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పెద్దలు చెప్పిన కబుర్లు, చేసిన బాసల ముందు అవన్నీ కొరగాకుండాపోయాయి. ఆ తారకమంత్రానికి తలలూపుతూ తన్మయత్వంతో పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లి ఈవీఎంలలోని ఎన్డీయే పార్టీల గుర్తుల బటన్లు అదేపనిగా నొక్కేసి.. థంపింగ్‌ మెజారిటీ ఇచ్చి మన భుజాలపైకి ఎక్కించుకున్నాం. ఇంకేముంది.. ప్రజలు ఓట్లు వేసి గెలిపించారంటే.. మన నిర్ణ యాలకు జైకొట్టినట్లే కదా! అని మోదీ సర్కారు రెట్టించిన ఉత్సాహంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్యలను పరుగులు పెట్టిస్తోంది. తాజాగా ఫ్యాక్టరీలోని క్యాంటీన్లను చాలావరకు మూసేశారు. దాదాపు 32విభాగాలను ప్రైవేట్‌కు కట్టబెట్టే చర్యల్లో భాగంగా ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌(ఈవోఐ).. అంటే ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు ఆహ్వానిస్తూ స్టీల్‌ప్లాంట్‌ మాతృసంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎన్‌ఎల్‌) నోటిఫికేషన్లు జారీ చేసింది. దాంతో గగ్గోలు మొదలైంది. ఇచ్చిన హామీలను ఉల్లంఘించి మళ్లీ ప్రైవేటీకరణ జపం చేస్తున్నారని మోదీ సర్కారును ప్రతిపక్షాలు, ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. విశాఖ ఉక్కు అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. అందులో పూర్తిస్థాయి పెట్టుబడులు, పెత్తనం అన్నీ కేంద్ర ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖవే. ఆ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే ఎన్డీయే కూటమికి మన ఓట్లతోనే అధికారం కట్టబెట్టామాయే. అలాంటప్పుడు విశాఖ ఉక్కు.. ఆంధ్రల హక్కు అని ఇంకా ఏ మొహంతో చెప్పగలమో విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి. మోదీ ప్రభుత్వాన్ని, దానికి అండదండగా నిలుస్తున్న రాష్ట్రంలోని చంద్రబాబు సర్కారును రాష్ట్ర ప్రజలు నూటికి నూరు శాతం దీవించారు. ఇతర ఏ రాష్ట్రల్లోనైనా ఏ కొంచమైనా వ్యతిరేకత కనిపించిదేమోగానీ ఆంధ్ర ప్రజల ఆశీ ర్వాదం మాత్రం ఎన్డీయే కూటమికి సంపూర్ణంగా లభించింది. తద్వారా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు మనం లైసెన్సు ఇచ్చినట్లే కదా! ఇక మన రాష్ట్ర నాయకత్వం గురించి మాటలు అనవసరం. జగన్‌ బాబును తిడతాడు.. బాబు జగన్ను ఆక్షేపిస్తాడు. మరోవైపు తనను గాజువాకలో గెలిపించి ఉంటే స్టీల్‌ప్లాంట్‌ కోసం పోరాడేవాడినని పవన్‌కల్యాణ్‌ ఎత్తిపొడు స్తాడు. పైగా కేంద్రానికి పూర్తి దన్నుగా నిలుస్తాడు. అయినా ఈ నాయకులను ప్రశ్నించడానికి, తప్పుపట్టడానికి కూడా లేదు. ఎందుకంటే.. ‘రాజు ఏం మాట్లాడినా తప్పు లేదు’ అన్నట్లు వారిని సమర్థించడానికి.. అదే సమయంలో ఎత్తిచూపే మనలాంటి వారిని బూతులతో ఎదురుదాడి చేయ డానికి వందిమాగధులు ఉండనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కులోని 32 విభాగాల ప్రైవేటీకరణకు సన్నాహాలు చేయడంపై మనలో మనం బాధపడటం తప్పితే ఇంకేం చేయలేమేమో!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page