top of page

ఉచితం మాటున అరాచకం!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 1 day ago
  • 2 min read
  • భైరి`కరజాడ ర్యాంపులో యథేచ్ఛగా ఇసుక అక్రమాలు

  • అధికార పార్టీ స్థానిక నేతలే సూత్రధారులు

  • వంశధార బ్రిడ్జికే ముప్పు తెచ్చేలా తవ్వకాలు

  • చర్యలకు వెనకాడుతున్న అధికారులు

  • పార్టీకి, ఎమ్మెల్యేకు చెడ్డపేరు తెస్తున్న కమ్యూనికేషన్‌ గ్యాప్‌

ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఉచిత ఇసుక విధానం జిల్లాలో ఎవరికి కాసులు కురిపిస్తుందో గానీ.. అసలు ఈ వ్యాపారానికి దూరంగా ఉంటున్నప్పటికీ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ లాంటి ఒకరిద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మచ్చగా మారుతోందనడంలో సందేహం లేదు. ఉచితంగా తవ్వుకోమన్నారన్న ఒకే ఒక కారణంతో నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా చివరకు స్థానిక టీడీపీ నేతలు చెప్పినా, ఎమ్మెల్యే కల్పించుకున్నా పెడచెవిన పెడుతున్న పరిస్థితి నెలకొంది. పబ్లిక్‌గా వాల్టా చట్టానికి తూట్లు పొడవడమే కాకుండా వంశధార నదిపై ఉన్న మడపాం బ్రిడ్జి పిల్లర్లు కుంగిపోయే ప్రమాదం ముంచుకొస్తున్నా.. తమ వ్యాపారం తమదేనన్న రీతిలో కొందరు వ్యవహరిస్తున్నారు. ఇసుక ఎంత తవ్వుకున్నా ఫర్వాలేదు గానీ పొక్లెయిన్లు పెట్టి మరీ బ్రిడ్జికి ముప్పు తెచ్చేలా తవ్వవద్దు మహాప్రభో అని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఫలితం దక్కడంలేదు. ఈ భాగోతం జిల్లా అధికారులకు తెలిసినా ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోతున్నారు. టీడీపీ నాయకుల అండదండలు లేకుండా ఇంత పెద్ద ఎత్తున ఇసుక తరలించడం కుదిరే పని కాదని, వారిపై కేసులు పెడితే ఎమ్మెల్యే ఇబ్బంది పడతారని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఒకటి రెండు కేసులు నమోదైతే పొక్లెయిన్లు పెట్టి జరిపే తవ్వకాలైనా ఆగుతాయని ఎమ్మెల్యే భావిస్తున్నారు. ఈ రెండు వ్యవస్థల మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ను ఆసరాగా తీసుకొని బ్రిడ్జిని కూల్చే పని నిరంతరాయంగా జరిగిపోతోంది. ఇందుకు సాక్ష్యం ఈ ఫొటోలే.

స్థానిక నేతలదే దందా

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక ర్యాంపులకు టెండర్లు పిలిచింది. ఈ ప్రక్రియ ద్వారానే బైరి, కరజాడ ర్యాంపును కొందరు దక్కించుకున్నారు. వీరు గనుల శాఖ నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ ఇసుక తవ్వుకుపోతున్నారని, దీనివల్ల భూగర్భ జలాలు ఇంకిపోయి వ్యవసాయ బోర్ల నుంచి నీరు రావడంలేదని ఫిర్యాదులు వెళ్లాయి. ఆ తర్వాత ఇక్కడ సీనరేజ్‌కు కాంట్రాక్ట్‌ ముగిసింది. అప్పుడు కూడా శ్రీకాకుళం ఎమ్మెల్యేను కనీసం కలవకుండా సంబంధిత కాంట్రాక్ట్‌ సంస్థ జిల్లాలో ఇసుక వ్యాపారం చేసుకుంటూపోయింది. అక్రమాలపై ఎవరు ఎంత అరిచి గీపెట్టినా కనీసం చెవికెక్కించుకోలేదు. ఇప్పుడు ఈ ర్యాంపులో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం లేదు. దీంతో బైరి, కరజాడలలో ఉన్న వ్యక్తులే పార్టీలకు అతీతంగా రాత్రీపగలు తేడా లేకుండా ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ఒడ్డున ఇసుక తవ్వుకొని ట్రాక్టర్లలో తీసుకువెళ్లి అమ్ముకోవాల్సిన చోట రెండు భారీ పొక్లెయిన్లు పెట్టి రాత్రంతా తవ్వుతున్నారు. ట్రాక్టర్ల ద్వారా ఒడ్డుకు ఇసుకను తరలించి, ఉదయం లారీలకు ఎత్తి రవాణా చేయిస్తున్నారు. ఇసుక ఉచితం కాబట్టి ఇందులో తప్పు కనిపించకపోవచ్చు. కానీ మడపాం బ్రిడ్జి పిల్లర్లకు అతి సమీపంలో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. దానివల్ల అక్కడ భూగర్భం బలహీనపడి వరదలొస్తే ఈ పిల్లర్లు తట్టుకుని నిలబడటడానికి బేస్‌ దొరక్కుండాపోతుంది. అప్పుడు మొత్తం బ్రిడ్జికే ముప్పొస్తుంది. కేవలం ఇసుక వ్యాపారం కోసమే ట్రాక్టర్లు, పొక్లెయిన్లు కొనుగోలు చేసిన కొందరు అదే స్థాయిలో రోజుకు 100 లారీలకు పైబడి ఇసుకను రవాణా చేస్తున్నారు.

అక్రమ రవాణాకే రోడ్డు వేశారా?

కరజాడ, బైరి గ్రామాల పరిధిలో ఇసుకాసురుల దెబ్బకు మూడు నెలల క్రితమే పల్లెపండగ పథకంలో భాగంగా రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు శిథిలావస్థకు చేరింది. జాతీయ రహదారి సర్వీసు రోడ్డు నుంచి బైరి వైపు కేటీఆర్‌ విల్లా ముందు నుంచి నది వరకు రూ.10 లక్షల ఉపాధి కాంపొనెంట్‌ నిధులతో రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు మీదుగానే రోజూ వందలాది ఇసుక లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో మూడు నెలల వ్యవధిలోనే రోడ్డు దెబ్బతిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇసుక అక్రమ రవాణాకే వేసినట్లుందని వారుసెటైర్లు వేస్తున్నారు. రైతులకు, గ్రామస్తులకు ఉపయోగం లేనిచోట రోడ్డు వేస్తే, దాన్ని మూడు నెలల్లోనే మట్టిలో కలిపేశారని భగ్గుమంటున్నారు. ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు చెడ్డపేరు వస్తుందని హెచ్చరించినా ఇసుకాసురులు వినిపించుకోవడం లేదట. అధీకృత ఏజెన్సీలు ఆరు నెలలుగా ఇసుక తవ్వకాలు నిలిపివేసినప్పటికీ అక్రమ తవ్వకాలు జోరందుకున్నాయి. ఈ గ్రామాల్లో టీడీపీ నాయకులు సిండికేట్‌గా మారిపోయారు. నది నుంచి ఇసుక తోడి సమీప తోటల్లో డంపింగ్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి విశాఖకు లారీల్లో తరలించుకుపోతున్నారు. ఫిర్యాదులు వస్తే నదికి సమీపంలో అక్రమంగా వేసిన ఇసుక పోగులను సీజ్‌ చేస్తున్నట్టు చూపిస్తున్న అధికారులు ఎవరిపైనా కేసులు నమోదు చేయకుండానే చేతులు దులిపేసుకుంటున్నారు. వైకాపా హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలపై రీచ్‌ వద్దకు వెళ్లి ఆందోళన చేసిన స్థానిక టీడీపీ నాయకులే ఇప్పుడు ఇసుక తవ్వకాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. లారీ సామర్థ్యాన్ని బట్టి రూ.10వేలు నుంచి రూ.20 వేలకు విక్రయిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page