top of page

ఉచితం మాటున కాసుల వేట

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • 4 days ago
  • 1 min read
  • కొత్తూరు, హిరమండలాల పరిధిలో అక్రమ తవ్వకాలు

  • కూటమి నేతల కనుసన్నల్లో రాత్రింబవళ్లు దందా

  • ఇసుక లభ్యత లేకున్నా నదీగర్భాన్ని కుళ్లబొడుస్తున్నారు

  • నిబంధనలకు విరద్ధమంటూనే చోద్యం చూస్తున్న అధికారులు

(సత్యంన్యూస్, కొత్తూరు/హిరమండలం)

రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లో ఉంది. అంటే ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను ప్రజలు ఉచితంగానే రేవుల నుంచి తరలించుకోవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా అలా జరగడంలేదు. ‘ఉచితం’ బలవంతులకే ఉపయోగపడుతున్నది. పర్యావరణ చట్టాలకు తూట్లు పొడిచి మరీ వంశధార నదీగర్భాన్ని ఇసుకాసురులు ఉచితం ముసుగులో చీల్చేస్తున్నారు. రాత్రింబవళ్లు భారీ యంత్రాల సాయంతో యథేచ్ఛగా ఇసుకను తవ్విపోసి తరలించేస్తున్నారు. ఏకంగా నదిలో బాటలు నిర్మించి నదీగర్భంలోకే భారీ వాహనాల పోనిచ్చి ఇసుకను ఎత్తిపోస్తున్నారు. అధికార కూటమి నాయకులే ఈ దందాలో కీలకపాత్ర పోషిస్తూ రూ.లక్షల్లో ప్రభుత్వ ఆదాయాన్ని దోచేస్తున్నారు. కొత్తూరు మండలం పొంటూరు పంచాయతీ బంకి గ్రామం, హిరమండలం పరిధిలో భాగీరధిపురం సమీపాల్లో వంశధార గర్భాన్ని భారీ యంత్రాలతో తవ్వేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు వస్తున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి నదిలో తవ్వకాలు సాగిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒడిశా రిజిస్ట్రేషన్ కలిగిన ట్రాక్టర్లు, పొక్లెయిన్లతో పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. నదీ గర్భంలో పది మీటర్ల లోతు వరకు భారీ యంత్రాల సాయంతో తవ్వకాలు జరుపుతున్నారు. ఫలితంగా ఎక్కడికక్కడ లోతైన గుంతలు ఏర్పడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నదిలో వరద ప్రవాహం పెరిగిన తర్వాత ఇసుక మేటలు వేయడం సర్వసాధారణం. గత ఏడాది అక్టోబర్‌లో సంభించిన వరదల్లో పెరిగిన ఇసుక మేటలను యంత్రాలతో తవ్వి తరలించుకుపోయారు. అయినా సంతృప్తి చెందకుండా ఏడు నెలల తర్వాత ఇప్పటికీ ఇసుక నిల్వలు తరిగిపోయినా గుంతలు తవ్వి అందులోని ఇసుకను తరలిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకపోయినా తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్వకాలకు అనుమతులు లేవని చెబుతున్న మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు.. అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టడానికి మాత్రం చర్యలు చేపట్టడంలేదు. అక్రమ తవ్వకాలపై స్థానికులు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రోజూ వందలాది లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను తరలించుకుపోతున్నారు. అధికార కూటమి పార్టీల నాయకుల కనుసన్నల్లో సాగుతున్న అక్రమ ఇసుక దందాపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page