వరదగట్టుపై మళ్లీ వాలిన భూ రాబందులు
- BAGADI NARAYANARAO

- 2 days ago
- 2 min read
గతంలో ఒకసారి అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట
అక్కడ పార్కు అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు
సర్వే అనంతరం ముందుసాగని పనులు
ఇదే అదనుగా రెచ్చిపోతున్న ఆక్రమణదారులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నగర శివారులోని నాగావళి వరదగట్టుపై మళ్లీ అక్రమార్కులు గురిపెట్టారు. బలగ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1/5లో ఉన్న ఈ గట్టుపై నిర్మాణాలు కూడా ప్రారంభించారన్న స్థానికుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ ఆదేశాలతో సోమవారం ఆరఐ, వీఆర్వోలు అక్కడికి వెళ్లి ఆక్రమణలను అడ్డుకున్నారు. అయితే మంగళవారం మళ్లీ అదే పని చేస్తుండటంతో రెవెన్యూ సిబ్బందిని అక్కడికి పంపిన తహసీల్దార్ పనులు నిలిపేయకుంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించాల్సి వచ్చింది. వరద గట్టు ఆక్రమణలపై గ్రీవెన్స్‌లో పలుమార్లు స్థానికులు ఫిర్యాదు చేయడంతో కబ్జాదారులు కొన్ని రోజులు వెనక్కి తగ్గినా మళ్లీ అక్రమ నిర్మాణాలు మొదలయ్యాయి.
హెచ్చరికలు బేఖాతరు

వరదగట్టును సొంతం చేసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను స్థానికులు రెండేళ్లుగా అడ్డుకుంటూ వచ్చారు. 2023లో కలెక్టర్ ఆదేశాలతో మండల రెవెన్యూ అధికారులు వరద గట్టు ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హెచ్చరిక బోర్డులు పెట్టారు. ఇదే అంశంపై స్థానికుల ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే గొండు శంకర్ భౌతికంగా పరిశీలించి ఆ భూమి ప్రభుత్వానికి చెందినదేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆతర్వాత కూడా కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుతో కలిసి పరిశీలించారు. ఆ సందర్భంగా దాన్ని ఆహ్లాదకరమైన పార్కుగా అభివృద్ధి చేయాలని కేంద్రమంత్రి ప్రతిపాదించారు. మిగతా స్థలంలో డ్వాక్రా బజార్ నిర్మించాలని ఎమ్మెల్యే శంకర్ నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. ఆ మేరకు రెవెన్యూ అధికారులు డ్రోన్ సర్వే కూడా చేశారు. అయితే ఆ తర్వాత ఆ ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. దాంతో అక్రమార్కులు మళ్లీ ఆ స్థలంలో వాలిపోయి దర్జాగా నిర్మాణాలు చేపట్టారు.
జిరాయితీ భూమిగా చెబుతున్న ఈ ప్రాంతంలో ఐదు దశాబ్దాల క్రితం కోనేరు ఉండేదని స్ధానికులు చెబుతున్నారు. వెబ్‌ల్యాండ్‌లో కూడా భూ స్వభావం కోనేరుగానే నమోదై ఉంది. రీసర్వే తర్వాత 1/5 సర్వే నెంబర్‌లో ఉన్న భూవిస్తీర్ణం 74 సెంట్లు జిరాయితీగా చూపించారు. అయితే దాన్ని వారసత్వంగా కాకుండా కొనుగోలు చేసినట్టు చూపించడం పైనే అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఎసఎలఆర్ ప్రకారం 74 సెంట్లు ఉన్నట్టు చెబుతున్నా భౌతికంగా 1/5 సర్వే నెంబరులో రెండు ఎకరాలు ఉందని అంటున్నారు. దీని లెక్క తేల్చాలని ఆదివారంపేటకు చెందిన బోనెల చిరంజీవి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తే రెవెన్యూ సిబ్బంది రికార్డుల ప్రకారం అది జిరాయితీ భూమి అని ఎండార్స్‌మెంట్ ఇచ్చారు. నాగావళికి వరదలు వచ్చే సమయంలో ఆ ప్రవాహం పట్టణంలోకి రాకుండా కోనేరు ఉన్న ప్రాంతంలో రక్షణ కోసం వరద గట్టును నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. వరద గట్టును ఆనుకుని ఉన్న శ్రీకాకుళం నుంచి ఆమదాలవలసకు వెళ్లే నడక మార్గాన్ని ఐదు దశాబ్దాల క్రితం ఆర్ అండ్ బి రహదారిగా అభివృద్ధి చేశారు. 2023లో ఇదే రోడ్డు విస్తరణకు రెవెన్యూ, ఆర్ అండ్ బి అధికారులు కొలతలు వేసిన సమయంలో వరద గట్టు, రోడ్డు మధ్య ఉన్న మిగులు భూమి ఉన్నట్లు తేలింది. దాంతో ఆక్రమణదారులు రంగంలోకి అది తమదేనని వాదించడం మొదలుపెట్టారు. వైకాపా నాయకులుగా చెలామణీ అవుతున్న నలుగురు స్థానికులు అధికారుల హెచ్చరికలను ఖాతరు చేయకుండా భూమికి హద్దులు వేసి అనంతరం క్రయచీటిల ద్వారా విక్రయించినట్టు తెలిసింది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భూస్వభావంపై కచ్చితమైన ప్రకటన చేసి ఆక్రమణదారుల నుంచి భూమిని స్వాధీనం చేసుకొని ప్రజావసరాల కోసం వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు.






Comments