క్లాస్ రూపం.. మాస్ బేరం!
- BAGADI NARAYANARAO

- 2 hours ago
- 2 min read
అపార్ట్‌మెంటు ముసుగులో హాస్టళ్లు సెటప్
రెసిడెన్షియల్ అనుమతితో కమర్షియల్ దందా
విద్యార్థులు, శిక్షణార్థులతో నిరంతరం కోలాహలం
ఫీజుల రూపంలో భారీగా వసూళ్లు
స్థానికులకు మాత్రం మురుగునీటి అవస్థలు

(సత్యంన్యూస్,శ్రీకాకుళం)
ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి నటించిన వినోదం సినిమా చూశారా? అందులో ఉత్తుత్తి బ్యాంక్ అని ఒక సెట్ వేసి కోటా శ్రీనివాసరావు డబ్బులు కొట్టేసే సన్నివేశం అప్పట్లో ఫ్యామస్. బయటకు బ్యాంకులాగే కనిపించినా లోపలంతా డొల్లే. ఇప్పుడు ఈ ఫొటోలో కనిపిస్తున్న అపార్ట్‌మెంట్లు కూడా అలాంటివే. బయట ఎలివేషన్‌లో అపార్ట్‌మెంట్ లుక్ చూపించి లోపల మాత్రం హాస్టల్ మాదిరిగా విభజించేసి ఫ్యామిలీలు ఉండాల్సిన చోట బ్యాచిలర్లను పదుల సంఖ్యలో దించేసే సముదాయమిది. నగరంలోని జీటీ రోడ్డులో ఉన్న బాలాజీ లాడ్జి యాజమాన్యానిదే ఈ భవనం. అయ్యప్ప ఆలయం దాటిన తర్వాత అదే పేరుతో ధర్మక్షేత్రనగర్ పేరుతో ఊరి శివారులో వెలిసిన కాలనీలో రెసిడెన్షియల్ పర్పస్ కోసం అపార్ట్‌మెంట్ ప్లాన్ పెట్టి అనుమతులు తెచ్చుకున్న బాలాజీ లాడ్జి పెద్దలు ఆ తర్వాత నాలుగు గోడల మధ్య హాస్టల్‌కు అనుగుణంగా విభజించి బొల్లినేని మెడిస్కిల్స్ సెంటర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు హాస్టల్‌కు అద్దెకిచ్చేశారు. ఒక్కో అపార్ట్‌మెంట్ నాలుగంతస్తులు ఉంది. ఒక ఫ్లోర్‌కు నాలుగు ఫ్లాట్లు ఉంటాయని భావించినా 16 కుటుంబాలు మాత్రమే ఒక అపార్ట్‌మెంట్‌లో నివసించే అవకాశం ఉంటుంది. కానీ హాస్టల్‌గా మార్చడం వల్ల వందలాది మంది విద్యార్థులు ఇందులో ఉంటున్నారు. కొత్తగా ఏర్పాటైన కాలనీ కావడంతో ఇంకా ఈ అపార్ట్‌మెంట్లకు పూర్తిగా మురుగునీరు పారే సదుపాయం రాలేదు. అటువంటి చోట జెమ్స్‌కు చెందిన నర్సింగ్ కళాశాల బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టళ్లు, శిక్షణ కేంద్రాలు నడుస్తుండటం స్థానికులకు ఇబ్బందిగా మారింది. అసలు అపార్ట్‌మెంట్‌లా కనిపిస్తున్న ఈ భవనాల లోపల ఎవరు రెసిడెంట్లుగా ఉంటున్నారో తెలుసుకోవాలని స్థానికులు ప్రయత్నిస్తే అమ్మాయిలుండే హాస్టల్‌లో బయటివారెవరూ ప్రవేశించడానికి అనుమతి లేదంటూ సెక్యూరిటీ గార్డులు తోసేస్తున్నారు.
ముడపుల మంత్రాంగం
అపార్ట్‌మెంట్ కోసం నగరపాలక సంస్థ నుంచి అనుమతి తీసుకున్న బాలాజీ క్లాత్‌సెంటర్ కమ్ లాడ్జి యజమాని శ్రీకాంత్ బాబు ఏబీసీ కన్‌స్ట్రక్షన్ ద్వారా మÖడేళ్ల క్రితం చాపురం పంచాయతీ పరిధిలోకి వచ్చే ఈ స్థలంలో నిర్మాణం చేపట్టారు. మున్సిపల్ రికార్డులు పరిశీలిస్తే రెసిడెన్షియల్ బిల్డింగ్ అని మాత్రమే ఉంది. అది అపార్ట్‌మెంటా లేక నాలుగంతస్తుల భవనమా అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఏదైనా రెసిడెన్షియల్ భవనాన్ని కమర్షియల్ పర్పస్ కింద నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్నందుకు కచ్చితంగా మున్సిపాలిటీకి ముడుపులిచ్చే ఉంటారు. ఆ మేరకు ఆరా తీస్తే జెమ్స్ నుంచి ప్రతి నెలా రూ.3 లక్షల అద్దె తీసుకుంటున్న శ్రీకాంత్ బాబు నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ ఉద్యోగులను గట్టిగానే మేపుతున్నారని తెలిసింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చెందిన నర్సింగ్ విద్యార్థుల కోసం తరగతి, వసతి గదుల నిర్మాణం గుట్టుచప్ప్పుడు కాకుండా జరిగిపోయిందని స్థానికులు చెబుతున్నా ఈ తతంగం టౌన్‌ప్లానింగ్ యంత్రాంగానికి, దగ్గరలో ఉన్న సచివాలయ సిబ్బందికి తెలుసుననే అభియోగాలు ఉన్నాయి. దీనిపై స్థానికులు గ్రీవెన్స్‌లో కూడా ఫిర్యాదు ఇచ్చారు. స్పందించిన జేసీ ఫర్మాన్ అహ్మద్ దీన్ని పరిశీలించాలని కార్పొరేషన్ అధికారులకు ఆదేశించారు. వాస్తవానికి ఈ తతంగమంతా భవన యజమాని లోపల హాస్టల్, క్లాస్‌రూమ్‌లకు అనుగుణంగా నిర్మాణాలు చేపడుతున్నప్ప్పుడే జరిగింది. కలెక్టర్ గ్రీవెన్స్‌కు ఫిర్యాదు వెళ్లింది కాబట్టి అప్పట్లో కార్పొరేషన్ అధికారులు ఆపించారు. అంతకు ముందే బొల్లినేని మెడిస్కిల్స్ ఇక్కడ హాస్టల్ కమ్ క్లాస్‌రూమ్స్ పెట్టాలని భావించినా ఈ గొడవల వల్ల ఆ ప్రతిపాదన విరమించుకుంది. కానీ జెమ్స్ కాలేజీలో పని చేస్తున్న ఒక ఉద్యోగి శ్రీకాంత్ బాబు నుంచి కొంత సొమ్ము తీసుకొని మెడిస్కిల్స్ ఈ భవనాల్లోనే హాస్టల్ నిర్వహించడానికి ఒప్పించినట్లు ఆరోపణలున్నాయి. ఇప్ప్పుడు స్థానికులు దీనిపై ఫిర్యాదు చేస్తున్నా కార్పొరేషన్‌లో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.






Comments