సస్పెన్షన్ తొలగింది.. బదిలీ తరిమింది! అయ్యగారి కక్షే గెలిచింది!!
- Prasad Satyam
- 1 day ago
- 2 min read
ట్రెజరీ శాఖలో మొదటికొచ్చిన వివాదం
అధికార దర్పం ప్రదర్శించిన డీడీ రవికుమార్
ఏడుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేసిన డైరెక్టర్
అది గిట్టక.. వారిలో ఆరుగురిపై ఉన్నఫళంగా బదిలీ వేటు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం ట్రెజరీ శాఖ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) అనుకున్నంతా చేశారు. తన పంతం నెగ్గించుకోవడానికి సస్పెన్షన్ విముక్తి పొందిన ఏడుగురు ఉద్యోగుýకు ఆ ఆనందం లేకుండా చేశారు. వారిలో ఆరుగురిపై నిర్దాక్షిణ్యంగా బదిలీ వేటు వేసి జిల్లా కేంద్రం నుంచి తరిమేశారు. జిల్లా ట్రెజరీ శాఖలో డీడీ రవికుమార్, కొందరు ఉద్యోగుల మధ్య రచ్చ జరిగిన నేపథ్యంలో దానిపై విచారణ జరిపిన వనజారాణి పూర్తి వివరాలతో ట్రెజరీ శాఖ డైరెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఆ నివేదిక అధారంగా డీడీ రవికుమార్ చేతిలో సస్పెన్షన్‌కు గురైన ఏడుగురు ఉద్యోగులను రీవోక్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సస్పెన్షన్ ఎత్తివేత ఆదేశాలు ఇంకా బాధిత ఉద్యోగుల చేతికి అందించకముందే వారికి బదిలీ ఆదేశాలతో పాటు ప్రొసీడింగ్స్‌ను వారికి డీడీ మెయిల్ చేశారు. ఈ విషయాన్ని ‘సత్యం’ ముందే అంచనా వేసి.. తన వార్తా కథనం ద్వారా పేర్కొంది. బదిలీల అంశం డీడీ చేతిలో ఉంటుంది కాబట్టి ఆయన వీరందరినీ మళ్లీ బలి తీసుకుంటారని అంచనా వేసింది. కాగా ఏడుగురు ఉద్యోగుల్లో సీనియర్ అకౌంటెంట్ మనోహర్ తప్ప మిగిలినవారందరిపైనా బదిలీ వేటు వేసి చెట్టుకో పుట్టగా విడదీశారు. మరీ ముఖ్యంగా సీనియర్ అకౌంటెంట్ బి.ప్రదీప్‌కుమార్‌ను జిల్లా చివరన ఉన్న ఇచ్ఛాపురానికి బదిలీ చేశారు. భవిష్యత్తులో దీనిపై ఎంక్వైరీలు జరిగితే మనోహర్ డీడీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని, అతని ద్వారా మిగిలిన ఆరుగురి మీద ఫిర్యాదు చేయించడానికి అవకాశం ఉంటుందని అస్మదీయులు ఇచ్చిన సలహా ప్రకారం మనోహర్‌ను తప్పించి మిగతా ఆరుగుర్నీ సస్పెన్షన్ రివోక్ కమ్ బదిలీ చేస్తూ డీడీ రవికుమార్ బుధవారం మెయిల్ ద్వారా ప్రొసీడింగ్స్ పంపారు. ఏ తప్ప్పు చేయలేదని విచారణలో నిర్ధారణ కావడం వల్లే తమపై సస్పెన్షన్లు ఎత్తేశారని, అటువంటప్ప్పుడు మళ్లీ బదిలీ అనే శిక్ష ఎందుకు వేశారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. తమ బదిలీ పనిష్మెంట్ కిందకే వస్తుందని, ఇది ట్రెజరీస్ డైరెక్టర్ ఆదేశాలకు పూర్తి విరుద్ధమన్నది బాధిత ఉద్యోగుల వాదన. కాగా సీనియర్ అకౌంటెంట్లు బెండి మోహనరావును జిల్లా ట్రెజరీ నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు, మాదారపు డేవిడ్‌ను నరసన్నపేట సబ్‌ట్రెజరీకి, జి.రాజశేఖర్‌ను రణస్థలం సబ్‌ట్రెజరీకి, బి.నాగభూషణరావును పలాస సబ్‌ట్రెజరీకి, జూనియర్ అసిస్టెంట్ బి.సాయికృష్ణను విజయనగరం జిల్లా ట్రెజరీకి బదిలీ చేస్తూ రవికుమార్ ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయంపై ట్రెజరీస్ డైరెక్టర్‌కు స్వయంగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఫోన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. జిల్లాకు డీడీగా రావడానికి అధికారులు విముఖత చూపుతున్నంత మాత్రాన రవికుమార్ లాంటి వారిని ఇక్కడ కొనసాగించడం సరికాదని వీరు వాదిస్తున్నారు.






Comments