top of page

‘ఉచితాలు’ రాక్స్‌.. న్యూయార్క్‌ షేక్‌!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Nov 6, 2025
  • 3 min read
  • మేయర్‌గా భారతీయ మూలాలు ఉన్న జోహ్రాన్‌ మమ్దానీ ఎన్నిక

  • మన ఎన్నికల తాయిలం అమెరికాకు ఎగమతి

  • భారత్‌నే ఆదర్శంగా తీసుకుని ఉచిత హామీల వర్షం

  • వాటి ముందు పని చేయని ట్రంప్‌ బెదిరింపులు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

గత ఏడాది మన రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్న ఒక నేత ఇంటింటి ప్రచారం సందర్భంగా.. ‘మేం అధికారంలోకి వస్తే నీకు రూ.15 వేలు.. నీకు రూ.15వేలు.. నీకు రూ.15 వేలు’ అని ఇళ్లలోని పిల్లలను ఉద్దేశించి ఊదరగొట్టారు. అయనొక్కరే కాదు. మనదేశంలో ఎన్నికలనగానే ఉచితాలే గుర్తుకొస్తాయి. ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా పరిణమించడమే కాకుండా.. ఓటర్లను ప్రలోభపర్చి ఓట్లు దండుకునే ఈ అనైతిక విధానాన్ని సుప్రీంకోర్టు సైతం తప్పు పట్టినా ఖాతరు చేయకుండా రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఎన్నికల్లో ఉచిత హామీలు గుప్పిస్తూ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. అంటూ ప్రచారం చేస్తున్నాయి. గత ఏడాది ఎన్నికల్లో మరో అడుగు ముందుకేసి గ్యారెంటీ హామీలంటూ సూపర్‌ సిక్స్‌ వంటి పథకాలను తెరపైకి తెచ్చాయి. మనకే ప్రత్యేకమనుకున్న ఈ ఎన్నికల తాయిలం ఇప్పుడు అమెరికాకు కూడా ఎగుమతి అయ్యింది. సాధారణంగా అమెరికాలాంటి దేశాల్లో అభివృద్ధి గురించి తప్ప ప్రలోభాలు, తాయిలాలకు ఓటర్లు ప్రభావితం కారు. కానీ చిత్రంగా తాజాగా అమెరికాలో జరిగిన గవర్నర్‌, మేయర్‌ ఎన్నికల్లో ‘ఉచితాలే’ ఓ అభ్యర్థిని మేయర్‌ పీఠంపై కూర్చోబెట్టాయి. అందులోనూ అమెరికా ఆర్థిక రాజధానిగా ప్రసిద్ధి పొందిన న్యూయార్క్‌ మహానగరంలో.. సాక్షాత్తు దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రచారాన్ని కూడా తిప్పికొట్టి ఉచిత హామీలు ఇచ్చిన డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థికి ఓటర్లు మేయర్‌ పట్టం కట్టడం అనూహ్య పరిణామం. ఆ అభ్యర్థి భారతీయ మూలాలు ఉన్న వ్యక్తే. ప్రముఖ దర్శకురాలు మీరానాయర్‌కు స్వయానా కుమారుడే.

34 ఏళ్ల చిన్న వయసులోనే

అమెరికాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్‌ పార్టీకి వ్యతిరేకంగా ఓటర్లు తీర్పు చెప్పారు. ఫలితంగా మెజారిటీ గవర్నర్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌, మేయర్‌ పదవులను డెమొక్రాటిక్‌ అభ్యర్థులు ఎగరేసుకుపోయారు. వారు గెలుచుకున్న వాటిలో కీలకమైనది న్యూయార్క్‌ మేయర్‌ పదవి. ఈ పదవికి డెమొక్రాటిక్‌ పార్టీ నుంచి పోటీ చేసిన జోహ్రాన్‌ మమ్దానీ బంపర్‌ మెజారిటీతో రిపబ్లికన్‌ అభ్యర్థిపై విజయం సాధించారు. ఈ పదవికి ఎన్నికైన తొలి భారతీయ ముస్లింగాను, 34 ఏళ్ల అతి చిన్న వయస్సులోనే ఆ పదవిలో కూర్చుంటున్న తొలి నేతగానూ మమ్దానీ చరిత్ర సృష్టించారు. ట్రంప్‌ పార్టీనే కాదని ఓటర్లు ఆయన్ను అందలం ఎక్కించడం వెనుక ప్రచారంలో ఆయన ఇచ్చిన ఉచిత హామీలే కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్‌లో పార్టీలు పుంఖానుపుంఖాలుగా ఉచిత హామీలు ఇచ్చి ఓట్లు కొల్లగొట్టే వ్యూహాన్నే ఆయన అందిపుచ్చుకున్నట్లు కనిపిస్తోంది. అచ్చం గత ఏడాది భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలు పార్టీలు ఇచ్చిన హామీలనే కొద్దిపాటి మార్పులతో మమ్దానీ న్యూయార్క్‌ ప్రజలకు ఎరగా వేశారు. ఫ్రీ బస్సు సౌకర్యం, ఇంటి అద్దెల తగ్గింపు, ఉద్యోగుల పిల్లల సంరక్షణకు ఉచిత డేకేర్‌ సెంటర్ల నిర్వహణ, నిత్యావసరాల ధరల భారం తగ్గించేలా భారత్‌ తరహాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో రేషన్‌ షాపుల ఏర్పాటు, అందరికీ సొంత ఇల్లు నినాదంతో వచ్చే పదేళ్లలో నగర ప్రజలకు చౌకగా రెండు లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని మమ్దానీ వాగ్దానం చేశారు. మమ్దానీ విజయంలో ఫ్రీ బస్సు పథకం ఎక్కువ ప్రభావం చూపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అధ్యక్షుడు ట్రంప్‌కే షాక్‌

అధ్యక్షుడిగా పది నెలల క్రితం పదవి చేపట్టినప్పటినుంచీ అపసవ్య విధానాలతో రెచ్చిపోతున్న డోనాల్డ్‌ ట్రంప్‌కు న్యూయార్క్‌ ఓటర్లు షాక్‌ ట్రీట్‌మెంటు ఇచ్చారు. మేయర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి కర్టిస్ట్‌ స్లివా విజయం కోసం ట్రంప్‌ స్వయంగా వచ్చి ప్రచారం చేశారు. సోషల్‌ మీడియా ద్వారా కూడా డిజిటల్‌ ప్రచారం చేశారు. తమ అభ్యర్థిని కాదని మమ్దానీ గెలిపిస్తే కనీస అవసరాలకు సరిపడిన స్థాయిలోనే నిధులు కేటాయిస్తానని, న్యూయార్క్‌ నగరానికి భారీగా నిధుల కేటాయింపు జరగదు అని అర్థం వచ్చేలా ట్రంప్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అయినా ఉచిత హామీల ముందు ఆ బెదిరింపులేవీ పని చేయలేదు. రిపబ్లికన్‌ అభ్యర్థితోపాటు మాజీ మేయర్‌ అండ్రు క్యూమోను కూడా తిరస్కరించి జోహ్రాన్‌ మమ్దానీని గెలిపించారు. 2030 నాటికి కనీస వేతనాలు పెంచుతామని చిరు వ్యాపారుల జీవన వ్యయాలను తగ్గించి, కార్పొరేట్లు, సంపన్నులపై పన్నులు పెంచుతామని మమ్దానీ ఇచ్చిన హామీ కూడా న్యూయార్క్‌ వాసులను ఆకట్టుకుంది. జోహ్రాన్‌ మమ్దానీ భారతీయ సినీ డైరెక్టర్‌ మీరానాయర్‌ కుమారుడు. ఉగాండా జాతీయుడైన మహమ్మద్‌ మమ్దానీ, మీరా దంపతుల సంతానం. సోషలిస్ట్‌ భావజాలం ఉన్న మమ్దానీ ప్రస్తుతం భారత్‌ అంటేనే ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతున్న ట్రంప్‌ని ఢీకొట్టి మేయర్‌గా ఎన్నికవ్వడం అమెరికాతోపాటు ఇండియాలో కూడా చర్చకు దారితీసింది.

సతీమణి కూడా ప్రముఖురాలే

న్యూయార్క్‌ మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్‌ మమ్దానీ విజయం వెనుక ఆయన సతీమణి రామా దువ్వాజీ కీలకపాత్ర పోషించారు. ప్రత్యర్థి రిపబ్లికన్‌ పార్టీ తరఫున స్వయంగా దేశాధ్యక్షుడు ట్రంప్‌ ప్రచారం చేస్తే.. మమ్దానీ తరఫున ఆయన భార్యే ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె పేరు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హోరెత్తిపోతోంది. పేరు చూసి ఆమె కూడా భారతీయ మూలాలు ఉన్నవారే అనుకుంటే పొరపాటే. ఈమె సిరియా మూలాలు ఉన్న వ్యక్తి. 28 ఏళ్ల వయస్కురాలైన ఆమె ఒక కళాకారిణి. బొమ్మలు బాగా వేస్తుంది. న్యూయార్క్‌లోని స్కూల్‌ ఆఫ్‌ విజువల్‌ ఆర్ట్స్‌లో ఇల్లస్ట్రేషన్‌ మాస్టర్స్‌ పూర్తి చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 2.65 లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె భర్త మేయర్‌ ఎన్నికల బరిలో దిగిన తర్వాత ఆ సంఖ్య మరింత పెరిగింది. ఆమె వేసిన పెయింటింగ్స్‌, గీసిన క్యారికేచర్స్‌ విస్తృత ప్రాచుర్యం పొందుతున్నాయి. మధ్యతరగతి మహిళల జీవన విధానం, వారి ఆలోచనలు, మగవారి చేతిలో అణచివేత.. వంటి సున్నిత అంశాలను కూడా ఆమె స్పృశిస్తుంటారు. మమ్దానీ ప్రచారంలో అటువంటి పెయింటింగులు, క్యారీకేచర్లే ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. ఆడియో, వీడియో ప్రోమోలు, సోషల్‌ మీడియా పోస్టర్లు అన్నీ రామాయే డిజైన్‌ చేశారు. సహజంగా రాజకీయాల్లో భర్త విజయం తర్వాత భార్యకు పేరొస్తుంది. కానీ ఇక్కడ భర్త విజయంలో ఆమె కీలక భాగస్వామి కావడం ఇప్పుడు బాగా వైరల్‌ అవుతోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page