top of page

ఉచితాలకు అడ్డుకట్ట వేయాల్సిందే

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 2 min read
ree

అప్పు చేసి పప్పుకూడు తినకూడదంటారు. దాన్ని పరిపాలన పరిభాషలో చెప్పాలంటే.. అప్పులు చేసి ఉచిత పథకాలు అమలు చేయకూడదు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే.. అంతకంటే ముందు రాజకీయ ప్రయోజనార్థం ఉచిత హామీల వర్షం కురిపించకూడదు. ఇదే విషయాన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టంగా చెప్పింది. ఆర్థిక నిపుణులూ హెచ్చరిస్తున్నారు. అనుత్పాదకమైన ఉచిత పథకాల కోసం ఖజానాను గుల్ల చేయడం, అందినకాడికి అప్పులు చేయడం వల్ల అర్థిక వ్యవస్థ చితికిపోతుందని హెచ్చరిస్తున్నారు. అయినా పార్టీలు, వాటి చేతిలో ఉన్న ప్రభుత్వాలు ఆ హెచ్చరికలను బేఖాతరు చేస్తుండటం పట్ల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) మాజీ అధ్యక్షుడు దువ్వూరి సుబ్బారావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత పథకాల ద్వారా పార్టీలు ఎన్నికల్లో గెలవవచ్చేమోగానీ.. వీటివల్ల దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు. ‘అప్పు చేసిన డబ్బు పంచడం సులభం, కానీ దానితో జాతులు(దేశాలు) నిర్మాణం కావు’ అని వ్యాఖ్యానించారు. దీనికి తాజా ఉదాహరణగా బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను సుబ్బారావు ప్రస్తావించారు. ఎన్నికల ప్రచారం ‘ప్రజాకర్షక వాగ్దానాల పోటీ’గా మారింది. బీహార్‌లోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ప్రచారం సందర్భంగా సుమారు 1.2 కోట్ల మంది మహిళల ఖాతాల్లో రూ.10వేలు చొప్పున జమ చేసింది. కానీ ప్రభుత్వంలో లేనందున అప్పటికప్పడు డబ్బు సమకూర్చలేని స్థితిలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష కూటమి ఏమాత్రం తగ్గకుండా ప్రతి మహిళకు రూ.30వేల సాయం, ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం వంటి పెద్ద పెద్ద హామీలు గుప్పించింది. ఇవన్నీ చూస్తుంటే పార్టీలు ఆర్థిక బాధ్యత, బడ్జెట్‌ పరిమితులను పూర్తిగా విస్మరించినట్లుంది. ఉచిత వాగ్దానాలను అమలు చేసిన తర్వాత వాటి ప్రభావం ఎంతలా ఉందో ఆయా రాష్ట్రాలకు అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత పథకాల బడ్జెట్‌ మొదట అనుకున్నదానికంటే చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఉచితాల కారణంగా అభివృద్ధి పనులకు బడ్జెట్‌ కొరత ఎదుర్కోవాల్సి వస్తోంది. బడ్జెట్లో సింహభాగం నగదు బదిలీలు, ఉచిత సౌకర్యాలు, సబ్సిడీలకు ఖర్చు అయిపోతుంటే.. విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఇతర కీలక మౌలిక రంగాలకు పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. అప్పులు చేసి ఉచితాలు పంచడం తీవ్ర తప్పిదం. అది మన తర్వాత తరాలపైనా భారం మోపడమే. నేటి ఖర్చు రేపటి భారంగా పరణమిస్తుంది. దాని కోసం చేసే అప్పును వడ్డీతో సహా భవిష్యత్తు తరాలు చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత హామీలు ఇవ్వడమంటే ఒక విధంగా ప్రభుత్వాలు విఫలమైనట్లే. ఉద్యోగాలు, ఇతర అభివృద్ధి, మౌలిక సౌకర్యాలు కల్పించలేని పరిస్థితుల్లోనే తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుని ప్రజల దృష్టిని మరల్చి, తాత్కాలిక ఆకర్షణలకు లొంగిపోయేలా చేయడమే రాజకీయ పార్టీలు ఉచిత హామీల వర్షం కురిపించడం వెనుక ఉద్దేశం. ప్రజలను తాత్కాలికంగా ఆశల్లో నిలబెట్టవచ్చు.. కానీ వారిని స్వయం సమృద్ధి సాధించేలా చేయడమే నిజమైన అభివృద్ధి. అదే ప్రభుత్వాలు, పార్టీల ప్రథమ కర్తవ్యం. ఉచిత పథకాలపై ప్రభుత్వం ఎంత వరకు ఖర్చు చేయవచ్చు. వాటికి నిధులు ఎక్కడి నుంచి సమకూర్చాలన్నదానిపై జాతీయ స్థాయిలో అందరినీ బద్ధులను చేసేలా మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. అలాంటి అడ్డుకట్ట లేకపోతే పరిస్థితి విషమిస్తుంది. ఇప్పటికే ఎన్నకల్లో పోటాపోటీగా ఉచిత వాగ్దానాలు గుప్పిస్తున్నారు. ఒకరు ఒకటి ప్రకటిస్తే.. ఇంకొకరు రెండు ప్రకటిస్తున్నారు. ఈ వేలంపాటకు అడ్డూఅడుపూ లేకుండాపోతుంది. అయితే వీటిలో చాలా వరకు హామీలుగానే మిగిలిపోతున్నాయి. అమలుచేస్తే కొద్దిపాటి హామీలకు కూడా నిధులు సమకూర్చడానికి ప్రభుత్వాలు ఆపసోపాలు పడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. హామీలపై ఎన్నికైన ప్రభుత్వాలు ఇప్పుడు వాటిని నెరవేర్చడంలో ఇబ్బంది పడుతుంటే.. వాటి ప్రభావం ప్రభుత్వ రోజువారీ కార్యకలాపాలపై పడుతోంది. ఇతర అభివృద్ధి పనులు, పథకాలకు నిధుల్లో కోత వేయాల్సి వస్తుండగా.. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని దుస్థితి నెలకొంటోంది. ఇది ఏపీలో ఇప్పటికే కనిపిస్తోంది. ఇక తెలంగాణ సంవత్సరాల తరబడి పెద్ద ఎత్తున ఉచిత పథకాలు/ఆర్థిక సహాయం అందిస్తూ ‘ఫిస్కల్‌ హ్యాంగోవర్‌’తో పోరాడుతోంది. గతంలో రాజకీయాల్లో ఉచిత హామీలు(ఫ్రీ బీస్‌) సంస్కృతిని ఖండిరచిన ప్రధాన మంత్రి సరేంద్ర మోదీ వాటి శక్తిని గమనించిన తర్వాత తాను కూడా ఆ సంస్కృతిని అందిపుచ్చుకున్నారు. ఉచితాల వల్ల జరిగే అనర్థాల గురించి నాయకులకు, పార్టీలకు తెలియదని అనుకోవడం భ్రమే అవుతుంది. తెలిసినా వాటిని వ్యతిరేకించడానికి ఎవరూ సాహసించరు. అలా చేసినవారు ప్రజావ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని పార్టీల భయం. అందువల్ల ఏ పార్టీ కూడా ఉచిత పోటీలో వెనుకబడి ఉండటానికి ఇష్టపడదు. మన ఆర్థిక రాజకీయాల్లో నిజాయితీ, జవాబుదారీతనాన్ని పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ దిశగా ప్రభుత్వాలు, పార్టీలు, నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు తాముగా ఉచితాలకు అడ్డుకట్ట వేసుకోవాల్సి ఉంటుంది. మరో విషయమేంటంటే.. ఎన్నికల్లో ప్రతి పార్టీ ఉచిత హామీలు ప్రకటిస్తూ పోతుంటే క్రమంగా వాటి ప్రభావం తగ్గుతుందని మాజీ గవర్నర్‌ సుబ్బారావు ఒక పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అయినట్లు వాటి అమలు తగ్గిపోతుంది. ఇదీ ఒకందుకు మంచిదే.. తామరతంపరగా ఇస్తున్న హామీలు కేవలం ఎన్నికలకే పరిమితమని, వాటిని నెరవేర్చే పరిస్థితి లేదని గ్రహించి వాటిని ప్రజలు నమ్మడం మానేస్తారు. అప్పుడే పార్టీలు ఉచిత వాగ్దానాల వర్షాన్ని ఆపేస్తాయి. ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుంది.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page