top of page

‘ఉత్తమ’ అధ్యాపకునికి హాల్‌మార్క్‌ యశ్వంత్‌

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • Sep 8
  • 2 min read
  • అధ్యాపక వృత్తిలో మేటి

  • పరిశోధకునిగా వన్నె తగ్గని ఖ్యాతి

  • వెతుక్కుంటూవచ్చిన బెస్ట్‌ టీచర్‌ అవార్డు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)
ree

పాలిటెక్నిక్‌ ఈసీఈ అధ్యాపకుడు, ఆమదాలవలస వాసి డాక్టర్‌ పూజారి వెంకట యశ్వంత్‌కు రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుడు అవార్డు లభించడంపై సాంకేతిక విద్య వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. 2013లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ అధ్యాపకునిగా ఆమదాలవలస పాలిటెక్నిక్‌ కళాశాలలో యశ్వంత్‌ చేరారు. నాటినుంచి విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంలో అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఏ సబ్జెక్టయినా కాన్సెప్ట్‌ను వివరంగా చెబితే విద్యార్థులకు అర్థమవుతుందని ఆయన నమ్ముతారు. బోధన విషయంలో, విద్యార్థుల క్షేమాన్ని కాంక్షించడంలో యశ్వంత్‌ అగ్రాసనం అందుకుంటారు. విద్యార్థులకు తన పాఠాలు శాశ్వతంగా అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఓ సొంత యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించారు. ఇప్పటి వరకు 1400 వీడియోలను అప్‌లోడ్‌ చేశారు. డిప్లమో, బీటెక్‌ విద్యార్థులకు అవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. యశ్వంత్‌ వీడియో పాఠాలు చూసి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినవారు కూడా ఉన్నారు. 2021లో ఎన్‌.ఐ.టి. తిరుచురాపల్లి నుంచి పీహెచ్‌డీ పూర్తిచేశారు. ఇమేజ్‌ సూపర్‌ రిజల్యూషన్‌ టెక్నిక్స్‌ ద్వారా కృత్రిమ మేథను ఉపయోగించి ఆకులలో వ్యాధులను గుర్తించడంపై యశ్వంత్‌ చేసిన పరిశోధనకు ఆయనకు డాక్టరేట్‌ అందించారు. ఆయన పరిశోధనా ప్రతిభకు మెచ్చి 2023లో బడ్డింగ్‌ రీసెర్చర్‌ (ఔత్సాహిక పరిశోధకుడు) అవార్డును ఎన్‌.ఐ.టి. బహూకరించింది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు రూపకల్పన చేసిన సుధాంశుమణి చేతుల మీదుగా యశ్వంత్‌ ఈ అవార్డు అందుకున్నారు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌పై ఇప్పటి వరకు ఆయన 25 పరిశోధనా పత్రాలు సమర్పించారు. అన్ని ప్రఖ్యాత జర్నల్స్‌ యశ్వంత్‌ పరిశోధనా పత్రాలను ప్రచురించాయి. ప్రముఖ ఐఐటీ, ఎన్‌ఐటీల ద్వారా పరిశోధనా పత్రాలు సమర్పించారు. చాలామంది పరిశోధకులు తమ పరిశోధనలకు ఈయన రీసెర్చ్‌ను వాడుకుంటారు. ఆయన రిసెర్చ్‌ పేపర్ల మీద 209 సందర్భాల్లో సైటేషన్స్‌ ఉండటం గమనార్హం. రామకృష్ణ మిషన్‌ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో ఉచితంగా వెయ్యికి పైగా సోలార్‌ బల్బులు పంపిణీ చేశారు. అయితే సాంకేతిక సమస్యలతో అవన్నీ నిరుపయోగంగా మారాయి. యశ్వంత్‌ నేతృత్వంలో ఆమదాలవలస పాలిటెక్నిక్‌ విద్యార్థులు వాటి లోపాలను సరిదిద్ది గిరిజనులకు వెలుగును పంచారు.

యశ్వంత్‌ తండ్రి సత్యనారాయణ. స్వస్థలం మొదలవలస. ఆయన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చరిత్ర అధ్యాపకులుగా పని చేసేవారు. యశ్వంత్‌ చిన్నతనంలోనే ఆయన హృద్రోగంతో మరణించారు. దీంతో యశ్వంత్‌ తల్లి అన్నపూర్ణ తన ఇద్దరు పిల్లలను వృద్ధిలోకి తీసుకువచ్చారు. యశ్వంత్‌ తమ్ముడు స్రవంత్‌ ఐఐటీ మద్రాసులో బీటెక్‌ చేశారు. ఇప్పుడు డిజిసెర్ట్‌ అనే కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. యశ్వంత్‌ విశాఖపట్నంలో ఉన్న అనిట్స్‌లో బీటెక్‌ చేశారు. ఆయన ఇంజినీరింగ్‌లో ఉండగానే టాకియాన్‌ అనే పత్రికను నిర్వహించడం విశేషం. విశేష ప్రతిభ కలిగిన యశ్వంత్‌కు ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు రావడం జిల్లావాసులకు గర్వకారణం. ఈ సందర్భంగా యశ్వంత్‌ ‘సత్యం’తో మాట్లాడుతూ ‘ఓ ఉపాధ్యాయుడు విద్యార్థి మేథస్సును వికసింపజేయాలి, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలి, తన కాళ్ల మీద తను నిలబడేలా, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకునేలా తీర్చిదిద్దాలి. ఈ దిశగానే నా ప్రయాణం ప్రారంభించాను. విద్యార్థుల కోసం శ్రమించే ప్రతీ ఉపాధ్యాయునికి ఈ అవార్డు అంకితం’ అని వినమ్రంగా చెప్పారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page