top of page

ఉద్యోగం రాకముందొకలా.. వచ్చాక మరో గోల!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 1 day ago
  • 2 min read
  • నిరుద్యోగుల కోరికల ముందు జావగారిపోతున్న జాబ్‌మేళాలు

  • ఉద్యోగాల్లో చేరాక కోరికల చిట్టా విప్పుతున్న అభ్యర్థులు

  • సాకులతో అవకాశాలు చేజార్చుకుంటున్న యువత

  • నెపాన్ని మాత్రం ప్రభుత్వంపైకి నెట్టేస్తున్న వైనం


ree

(సత్యంన్యూస్‌,శ్రీకాకుళం)

ఉద్యోగం లేనంతకాలం ఏదో ఒకటి వస్తే అదే పదివేలు అనుకుంటాం.. తీరా ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కడ మన హక్కులు, జీతాల ప్రస్తావన తీసుకొస్తాం. ఏదో ఒక అవకాశం లభించిందని సంతృప్తి చెందకుండా జీతాలు పెరగలేదని, పనిభారం ఎక్కువగా ఉందని నిత్యం అసంతృప్తి వ్యక్తం చేస్తుంటాం. ఈ తరహా మనస్తత్వం ఏ ఒక్కరికో పరిమితం కాదు. ఇది సహజ మానవనైజం. ఇదే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు గండికొడుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాలను జావగార్చేస్తున్నాయి. జిల్లాలో నియోజకవర్గాలవారీగా ప్రతివారం జరుగుతున్న జాబ్‌మేళాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో సిద్ధించకుండా చేస్తున్నాయి. అయితే నిరుద్యోగులు, రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్నే దీనికి బాధ్యురాలిని చేసేస్తున్నాయి. ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఏమార్చారాని, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వరంగంలో శాశ్వత ఉద్యోగాలు ఇవ్వకుండా అరకొర వేతనాలు ఇచ్చే ప్రైవేటు ఉద్యోగాలు చూపిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ అందరికీ ప్రభుత్వరంగంలోనే ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదన్న విషయం తెలిసినా.. దాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు.

నియోజకవర్గాల్లో జాబ్‌మేళాలు

తాము అధికారంలోకి వస్తే 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని తెలుగుదేశం కూటమి యువతకు హమీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ మినహా ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైకాపా హాయంలో చేపట్టిన కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియ కూటమి సర్కార్‌ వచ్చిన తర్వాత తుది దశకు చేరుకున్నా.. వారికి ఇంకా శిక్షణే ప్రారంభం కాలేదు. జిల్లాలో ప్రైవేట్‌ రంగంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 3,922 ఉన్నాయి. వీటిలో 18,071 మంది వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నారు. నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడం ఒక్క ప్రభుత్వరంగం వల్లే సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం వేగంగా విస్తరిస్తున్న ప్రైవేటురంగంలో ఉపాధి అవకాశాలు చూపించేందుకు కార్యాచరణ రూపొందించింది. అందుకోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేసి యువతలో సాంకేతిక నైపుణ్యాలను పెంచడం, అనంతరం జాబామేళాలు ఏర్పాటు చేసి ప్రైవేటు పారిశ్రామిక, వాణజ్య సంస్థలు వారిని ఉద్యోగాల్లో చేర్చుకునేలా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఏడాదిన్నర కాలంలో సుమారు 12 జాబ్‌మేళాలు నిర్వహించారు. వీటిలో వందలాది యువతకు ఆతిధ్య, సేల్స్‌, బ్యాంకింగ్‌, ఫార్మా తదితర రంగాల్లో ఉపాధి కల్పించినట్టు అధికారులు చెబుతున్నారు.

స్వయంఉపాధికి ‘కౌశలం’

నిరుద్యోగ యువతకు వారి అర్హతలు, ఆసక్తి ఆధారంగా శిక్షణ ఇచ్చి పరిశ్రమల్లో లేదా ఇంటి నుంచి పని చేసే విధంగా స్వయంఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ‘కౌశలం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. 18 ఏళ్లు దాటి పదో తరగతి, ఆపైన చదివిన యువత పూర్తి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఆ మేరకు జిల్లాలో ఇప్పటి వరకు 1,37,745 మంది దరఖాస్తు చేసుకోగా 1,10,400 దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఆ వివరాలను సచివాలయ సిబ్బంది కౌశలం యాప్‌లో నమోదు చేస్తున్నారు. నిరుద్యోగుల విద్యార్హతలు, వారి ఆసక్తి మేరకు తగిన శిక్షణ ఇప్పించిన అనంతరం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం సంకల్పంచింది. కౌశలం పథకం నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ ప్రక్రియను పూర్తి చేసి నాలుగు నెలలు గడుస్త్తున్నా ఎటువంటి పురోగతి లేదు. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి ఐటీ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోందని, అవి పూర్తి అయిన తర్వాత విధి విధానాలు ప్రకటిం చి ఆర్హులందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అధికారులు చెబుతున్నారు.

నిరుద్యోగలు అసంతృప్తి

కాగా ప్రభుత్వపరంగా నిర్వహిస్తున్న జాబ్‌మేళాల్లో ఎంతమంది ఎంపికవుతున్నారు.. వారిలో ఎంత మంది ఉద్యోగాల్లో చేరి స్థిరపడుతున్నారన్న లెక్కలు అధికారుల వద్ద లేవు. జాబ్‌మేళా నిర్వహించి ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇవ్వడం మినహా వారు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారా లేదా అన్నదాన్ని అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా అర్హతలు, పనికి తగినట్లు కాకుండా తక్కువ వేతనాలు ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ కారణంతోనే జాబ్‌మేళాల ద్వారా ఉద్యోగాలు పొందినవారిలో చాలామంది కొద్దిరోజులకే వెనక్కి వచ్చేస్తున్నారు. కుదురుగా పని చేసుకుంటున్నవారి సంఖ్య స్వల్పంగానే ఉంటున్నది. అయితే ఉద్యోగాలు కల్పించడమే తమ బాధ్యత అని, వాటిలో చేరడం, చేరకపోవడం వారి ఇష్టమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. వేతనం, ఇతర అంశాలు పూర్తిగా తెలుసుకుని, అవి నచ్చితేనే ఉద్యోగాల్లో చేరుతున్నారన్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. జాబ్‌ మేళాల్లో ఎక్కువగా సేల్స్‌, బ్యాంకింగ్‌, హోటల్‌, హాస్పిటల్‌ రంగాల ఉద్యోగాలే ఇస్తున్నారు. ఈ రంగాల్లో పనిచేస్తున్న వారికి యాజమాన్యాలు టార్గెట్లు పెడుతుండటంతో కొద్దిరోజులకే పలువురు ఉద్యోగం మానేస్తున్నారు. అధిక వేతనం ఆఫర్‌ చేసే పరిశ్రమల ఉద్యోగాల్లో మాత్రమే చేరుతున్నారు. తక్కువ వేతనం ఆఫర్‌ చేసే పరిశ్రమల్లో మాత్రం బాండ్‌, సర్టిఫికెట్స్‌ ఇవ్వాలన్న షరతుకు అంగీకరిస్తేనే చేరేందుకు ముందుకొస్తున్నారు. ప్రైవేట్‌ సంస్థలు తమ వద్ద ఉద్యోగాల్లో చేరే వారి నుంచి సెక్యూరిటీగా రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికి బాండ్‌ రాసిచ్చి, సర్టిఫికెట్లు డిపాజిట్‌ చేయాలన్న నిబంధన అమలు చేస్తున్నాయి. ఈ నిబంధనతోనే చాలామంది నిరుద్యోగులు ప్రైవేట్‌ ఉద్యోగాల్లో చేరకపోవడానికి దారితీస్తున్న కారణాల్లో ఒకటన్న వాదన వినిపిస్తోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page