top of page

ఉద్యమజ్వాలల్లో భారత ఉపఖండం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Sep 10, 2025
  • 3 min read
  • ప్రజాగ్రహానికి కుప్పకూలుతున్న ప్రభుత్వాలు

  • మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్‌, నేడు నేపాల్‌

  • ప్రస్తుతం పాకిస్తాన్‌లోనూ అదే తరహా పరిస్థితులు

  • ప్రజలను పట్టించుకోని ఏ దేశానికైనా ఇదే గతి తప్పదు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

దక్షిణాసియా.. ముఖ్యంగా ఒకప్పుడు భారత ఉపఖండంలో అంతర్భాగంగా ఉండి.. ఆ తర్వాత స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించిన భారత చుట్టుపక్కలు దేశాలు అశాంతితో రగిలిపోతున్నాయి. ప్రజాగ్రహం పాలకులపై తిరుగుబాటు చేసి ప్రభుత్వాలనే పడగొడుతోంది. ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో ప్రభుత్వాలను కూలదోసిన ప్రజాతిరుగుబాటు ఇప్పుడు హిమాలయ దేశమైన నేపాల్‌ను అతలాకుతలం చేస్తోంది. ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ పెద్దలు, వారి కుటుంబాల మితిమీరిన విలాసాలు, ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలు, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, పెరుగుతున్న సైనిక పెత్తనం.. ఇవన్నీ ప్రజల్లో ఆగ్రహావేశాలను రెచ్చగొట్టి తిరుగుబాటుకు బాటలు వేస్తున్నాయి. తమ అసమర్థ పాలన బయటపడకుండా మీడియా గొంతునొక్కి భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం యువతరాన్ని విప్లవ తరంగాల్లా మారుస్తున్నాయి. శ్రీలంకలో అధ్యక్షుడు రాజపక్స పాలన పతనంతో మొదలైన.. బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోవడం.. తాజాగా నేపాల్‌లో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని ప్రజలు వెంటాడి మరీ పడగొట్టిన ఉదంతాలు ప్రజల గొంతును, వారి హక్కులను అధికార బలంతో ఎంతోకాలం అణచివేయలేమని స్పష్టం చేస్తున్నాయి. నేపాల్‌లో కూడా అదే జరిగింది. కాగా పాకిస్తాన్‌లోనూ దాదాపు అదే పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ వైఫల్యం, ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలతో ఆ దేశం నిద్రపోతున్న అగ్నిపర్వతంలా ఉంది. అది ప్రజాగ్రహం పెల్లుబుకి ఏ క్షణంలోనైనా అది బద్దలై ప్రభుత్వం పతనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారతదేశం చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాల వెనుక అమెరికా నిఘా విభాగం ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్‌ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌`అమెరికా సంబంధాలు దెబ్బతినడమే ఈ అనుమానాలకు ఆస్కారమిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో ఏం జరిగిందన్నది ఒకసారి పరిశీలిద్దాం.

శ్రీలంక ప్రభుత్వ పతనం

శ్రీలంక తన చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని 2022లో చవిచూసింది. విదేశీ మారక నిల్వలు నిండుకోవడం, ఇంధనం, ఔషధాల కొరత, తీవ్రమైన ద్రవ్యోల్బణం, అధిక అప్పుల కారణంగా ప్రజల జీవితాలు దుర్భరమయ్యాయి. వీటిని పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారు. దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన వేలాది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రధాని మహీంద రాజపక్స, అధ్యక్షుడు గోటబాయ రాజపక్సలను వారి అధికార నుంచి తరిమేయడమే కాకుండా వారి నివాసాలను కూడా తగలబెట్టారు. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన భవనాన్ని వదిలి పారిపోయారు. నిరసనకారులు పార్లమెంట్‌, రాష్ట్రపతి భవనాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రజాగ్రహం దెబ్బకు దశాబ్దాలుగా అధికారంలో పాతుకుపోయిన రాజపక్స కుటుంబం అడ్రస్‌ లేకుండా పోయింది.

బంగ్లాదేశ్‌లో విద్యార్థుల తిరుగుబాటు

గత ఏడాది బంగ్లాదేశ్‌లో కూడా విద్యార్థుల నిరసనలతో మొదలైన ప్రజా ఉద్యమం హింసాత్మకంగా మారి షేక్‌ హసీనా ప్రభుత్వ పతనానికి దారితీసింది. దేశంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా 2024 ప్రారంభం నుంచి యువత రోడ్లపైకి రావడం ప్రారంభించింది. ప్రతిపక్షాల మద్దతుతో విద్యార్థి సంఘాలు రోడ్లపై రావడంతో ఉద్యమం తీవ్రతరమై హింసాత్మకంగా మారింది. దాని తీవ్రతను తట్టుకోలేక ప్రధాని షేక్‌ హసీనా రాత్రికి రాత్రి దేశం వదిలి పారిపోవలసివచ్చింది. ప్రస్తుతం షేక్‌ హసీనా ఇండియాలో ఆశ్రయం పొందుతున్నారు. అనంతరం మొహమ్మద్‌ యూనస్‌ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా.. ఇంకా అక్కడ అశాంతి చల్లారలేదు. ఆర్థిక, సామాజిక పరిస్థితులు మారలేదు.

ఇప్పుడు నేపాల్‌ వంతు

మంచు కొండల్లో ఒదిగి ఉండే హిమాలయ దేశం నేపాల్‌లో అసంతృప్తి మంటలు రాజుకుని ప్రభుత్వాన్ని కూల్చేయడమేకాకుండా మంత్రుల ఇళ్లపై దాడులు, వారిని కొట్టడం వంటి పరిణామాలకు కారణమవుతున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్‌ తరహాలోనే యువజనుల ఉద్యమ ధాటికి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కూలిపోయింది. దేశంలో ధరల పెరుగుదల, ఆర్థిక వ్యవస్థ తిరోగమనం వంటి అనేకానేక సమస్యలకు తోడు ఓలీ ప్రభుత్వం సోషల్‌ మీడియాపై నిషేధం విధించడం యువత ఆగ్రహానికి ఆజ్యం పోసింది. ఈ చర్యను భావప్రకటన స్వేచ్ఛను హరించడం, అవినీతిని కప్పిపుచ్చడానికి చేసే ప్రయత్నంగా అభివర్ణించారు. దీనికి నిరసనగా ఖఠ్మాండులో మొదలైన ఉద్యమం దేశమంతా విస్తరించింది. నిరసనకారులు పార్లమెంటును చుట్టుముట్టారు. మంత్రులు, నాయకుల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. ఏకంగా మాజీ ప్రధాని ఇంటినే తగులబెట్టి, ఆయన భార్య సజీవ దహనం కావడానికి కారణమయ్యారు. పోలీసు కాల్పుల్లో 20 మందికి పైగా మరణించినా, వందల మంది క్షతగాత్రులైనా ఉద్యమకారులు ఏమాత్రం వెనుకంజ వేయలేదు. చివరికి సైన్యాన్ని రంగంలోకి దించినా పెద్దగా ఫలితం లేకపోయింది. చివరికి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది.

ముప్పు అంచున పాకిస్తాన్‌

దక్షిణాసియాలో వరుసగా ఒక్కో దేశం ప్రజాగ్రహంతో రగులుతుండగా.. తర్వాత వంతు పాకిస్తాన్‌దే కావచ్చన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాలలో నెలకొన్న సమస్యలే ప్రస్తుతం పాకిస్తాన్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. అదుపులేని ద్రవ్యోల్బణం మొదట పాక్‌ ఆర్థిక పరిస్థితిని దుర్భరం చేసింది. దానికితోడు రాజకీయాలు శాంతిని హరించాయి. వీటితో పాటు ఇటీవల వరదలు ఆ దేశాన్ని కోలుకోనివ్వకుండా చేశాయి. కాగా పాకిస్తాన్‌ ఒకవైపు ఉగ్రవాదాన్ని పోషిస్తూ.. మరోవైపు ప్రజలపై ఆర్థిక భారం మోపుతోంది. భారత్‌తో యుద్ధం కారణంగా ఇప్పటికే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. ప్రస్తుతం పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. ఆర్మీ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ చెప్పినట్లుగా నడుచుకుంటున్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ అనంతరం అసిమ్‌ మునీర్‌ పాక్‌లో నియంతృత్వ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఆయన సూచనల మేరకు దేశ ప్రజలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం నిఘా పెట్టినట్లు సమాచారం. చైనా నిర్మించిన ఇంటర్నెట్‌ ఫైర్‌ వాల్‌ అనే టెక్నాలజీ సహాయంతో ఫోన్లు ట్యాప్‌ చేయడంతోపాటు సోషల్‌ మీడియాను సెన్సార్‌ చేస్తున్నారని ఈ నివేదిక పేర్కొంది. పాకిస్తాన్‌లో పొలిటికల్‌, మీడియా స్వేచ్ఛపై ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయి. దాంతో ఇప్పటికే పాకిస్తానీయులు ప్రభుత్వంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వారు ఏక్షణమైనా ఉద్యమ బాట పట్టవచ్చని పాక్‌ వర్గాల సమాచారం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page