top of page

ఉన్నది లేనట్టు.. లేనిదిఉన్నట్టు.. అంతా శ్రీనివాసుడి కనికట్టు!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Sep 18, 2025
  • 3 min read
  • సానివాడలో పనిచేస్తున్నా అన్నిచోట్లా చొరబాటు

  • రెవెన్యూ రికార్డులను అడ్డగోలుగా మార్చేసి గోల్‌మాల్‌

  • వాటిని మళ్లీ సరిదిద్దే నెపంతో బాధితుల నుంచి వసూళ్లు

  • వరదగట్టు వంటి చోట్ల అక్రమణదారులకు వత్తాసు

(సత్యంన్యూస్‌,శ్రీకాకుళం)

పేరుకే అతగాడు సచివాలయ సర్వేయర్‌. కానీ తన తోటి సర్వేయర్లను, చివరికి మండల సర్వేయర్‌నూ గుప్పిట్లో పెట్టుకుని ‘భూ’కంపాలు సృష్టిస్తున్నాడు. తన పరిధి కాకపోయినా చాలా వ్యవహారాల్లో తలదూరుస్తూ మాయ చేస్తున్నాడు. రికార్డులను ఇష్టారాజ్యంగా మార్చేసి.. ఆ మేరకు తనే ఫైల్స్‌ తయారు చేసి వాటిపై సంబంధించి సచివాలయ సర్వేయర్లతో సంతకాలు చేయిస్తూ.. వాటిని అధికారులకు ఫార్వర్డ్‌ చేయిస్తుంటాడు. రికార్డుల్లో చేసిన జిమ్మిక్కుల ఆధారంగా సంబంధిత భూ యజమానులతో బేరాలు కుదుర్చుకుని వ్యవహారాలు సెటిల్‌ చేస్తుంటాడు. చివరికి తను బదిలీ అయినా పాత స్థానమైన బలగ పరిధిలో ఇప్పటికీ అక్రమాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వివాదంలో ఉన్న నాగావళి వరద గట్టు పరిధిలోని కోనేరు భూమిని అక్రమార్కులకు కట్టబెట్టడంలో నిన్నమొన్నటి వరకు బలగ సచివాలయ సర్వేయర్‌గా వెలగబెట్టిన శ్రీనివాసరావుదే కీలకపాత్ర అని తెలిసింది.

అంతటా ఆయనగారే

బలగ సచివాలయంలో సుదీర్ఘకాలం పనిచేసిన సర్వేయర్‌ శ్రీనివాసరావు బలగతో సహా శ్రీకాకుళం రూరల్‌ మండలంలోని ఎక్కడి వ్యవహారాన్నయినా చక్కదిద్దే పనిలో సిద్ధహస్తుడన్న ఆరోపణలు ఉన్నాయి. బలగలో పనిచేస్తున్న కాలంలోనే చాపురం పరిధిలో ఎన్నో వివాదాస్పద వ్యవహారాల్లో జోక్యం చేసుకొని భూ వ్యవహారాలను చక్కబెట్టారని తెలిసింది. ఇటీవల సాధారణ బదిలీల్లో సానివాడ సచివాలయానికి వెళ్లినా బలగ, చాపురం పరిధిలోని భూ వ్యవహారాలన్నింటినీ ఇప్పటికీ శ్రీనివాసరావే చూస్తున్నారు. ఈ సచివాలయాల్లో పనిచేస్తున్న సర్వేయర్లను డమ్మీలుగా మార్చేశారని తెలిసింది. భూ లావాదేవీలకు సంబంధించి ఫైల్స్‌పై ఆ ఇద్దరు సర్వేయర్లు సంతకాలు చేస్తే చాలు.. మిగతా వ్యవహారమంతా శ్రీనివాసరావు నడిపిస్తున్నాడు. బలగలో పని చేస్తున్న సమయంలో బలగ, చాపరం పరిధిలో నిర్వహించిన రీ సర్వేలో అప్పటి రెవెన్యూ అధికారులతో కలిసి శ్రీనివాసరావు అనేక అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూమి లేనివారికి ఉన్నట్టు చూపించడం, ఉన్నవారి భూ విస్తీర్ణం తగ్గించి కొత్త ఎల్‌పీఎంలు సృష్టించారు. ఇప్పుడు వాటిని సరిచేయడానికి బాధితులకు రూ.లక్షల్లో డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములు, లే అవుట్లను రీసర్వే చేసే అవకాశం లేదు. కానీ శ్రీకాకుళం రెవెన్యూ అధికారులు మాత్రం కొన్ని వివాదాస్పద, ప్రభుత్వ భూములను రీసర్వే చేసి ఎల్‌పీఎం నెంబర్లు కేటాయించారు. ఎస్‌ఎల్‌ఆర్‌ ప్రకారమే రీసర్వే చేయాల్సి ఉండగా, అలాకాకుండా ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములు, కాలువలు, గట్లు, చెరువుల విస్తీర్ణం తగ్గించి నివాస స్థలాలుగా చూపించి ఎల్‌పీఎం నెంబర్లు కేటాయించిన దాఖలాలు ఉన్నాయి. అదే రీతిలో బలగ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్‌ ఒకటిలోని 4, 5 సబ్‌ డివిజన్లలో ఉన్న కోనేరు, వివాదాస్పద భూములకు ఎల్‌పీఎం నెంబర్లు కేటాయించారు. వీటికి సంబంధించిన ఒరిజినల్‌ రికార్డులు మాయం చేసి కొత్త రికార్డులు సృష్టించి వాటి ఆధారంగా రీసర్వే చేశారు. ఆ తర్వాతే ఈ భూమికి వందేళ్లుగా కనిపించని భూ యజమానులు పుట్టుకొచ్చారు. ఈ వ్యవహారంలో సర్వేయర్‌ శ్రీనివాస్‌రావు పాత్రపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వరదగట్టు అక్రమాల్లోనూ కీలకం

ఆదివారంపేట వద్ద ఆమదాలవలస` శ్రీకాకుళం రోడ్డుకు ఆనుకుని ఉన్న నాగావళి వరద గట్టు సర్వే నెంబర్‌ 1/4లో 1.05 ఎకరాలు కోనేరుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. అలాగే సర్వే నెంబర్‌ 1/5లో ఉన్న 74 సెంట్లను జిరాయితీగా చూపించారు. కానీ ప్రస్తుతం 1/5లో 2.10 ఎకారాలకు పైగా భూమి ఉన్నట్లు చెబుతున్నారు. సర్వే నెంబరు 1/4లోని 1.05 ఎకరాల్లో కోనేరు (వరదగట్టు)ను సగానికి పైగా తొలగించి సర్వే నెంబర్‌ 1/5లో కలిపేశారు. ఇక్కడ ప్రభుత్వ భూమి అనే హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేయాలని రెవెన్యూ అధికారులు ఆదేశించినా వీఆర్వో పట్టించుకోలేదు. దీనిపై ఉన్నతాధికారులకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో వీఆర్వో లీలారాణి మెడికల్‌ లీవ్‌ పెట్టి వెళ్లిపోయారు. ఈ దురాక్రమణ దందా శ్రీనివాసరావు బలగ సర్వేయర్‌గా ఉన్నప్పుడే జరిగిందంటున్నారు. వరదగట్టును యంత్రాలతో చదును చేసి స్థానికంగా పెద్దమనుషులుగా వ్యవహరిస్తున్న వారితో కలిసి చక్కబెట్టినట్టు శ్రీనివాసరావుపై ఆరోపణలు ఉన్నాయి. రీసర్వే సమయంలో సర్వే నెంబర్‌ 1/4లోని కోనేరు (వరదగట్టు)ను 99 సెంట్లుగా చూపించారు. సర్వే నెంబర్‌ 1/5లో 59 సెంట్లుగా చూపించారు. వెబ్‌ల్యాండ్‌లో మాత్రం 1/4లో 1.05 ఎకరాలు, 1/5లో 74 సెంట్లుగా నమోదై ఉంది. క్షేత్రస్థాయిలో మాత్రం 1/5లో 2.10 ఎకరాలకు పైగా ఉంది. దీన్ని బలగకు చెందిన కొందరు పెద్దమనుషులు పంచుకున్నారు. ప్రభుత్వ భూమిగా గుర్తించి లెక్క చేయకుండా ఆక్రమణదారులతో కలిసి ఈ వ్యవహారాన్ని చక్కబెట్టడానికి ప్రస్తుతం సానివాడలో పనిచేస్తున్న శ్రీనివాసరావు ప్రయత్నిస్తున్నారు.

రికార్డులు మార్చి.. యజమానులతో బేరాలు

రీసర్వే తర్వాత సర్వే నెంబర్‌ 1/5కు ఎల్‌పీఎం నెంబర్‌ 5 కేటాయించారు. ఇందులో 59 సెంట్లు మాత్రమే ఉన్నట్టు నమోదు చేశారు. దీన్ని 74 సెంట్లు మార్పించేందుకు నాగావళి గట్టు ఆక్రమణదారులు శ్రీనివాసరావును ఆశ్రయించారు. దానికి ఆయన రూ.9 లక్షలు డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. అయితే రూ.6 లక్షలు ఇవ్వడానికి ఆక్రమణదారులు ముందుకు వచ్చారని సమాచారం. దానికి అంగీకరించిన సర్వేయర్‌ శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. రీసర్వేలో భూ విస్తీర్ణం తప్పుగా నమోదైందని, దాన్ని రివైజ్‌ చేయాలని ప్రతిపాదిస్తూ ఫైలు తయారు చేసి బలగలో పని చేస్తున్న మహిళా సర్వేయర్‌తో సంతకం పెట్టించి అధికారులకు పంపినట్లు విశ్వసనీయ ంగా తెలిసింది. అయితే దీన్ని తహసీల్దార్‌ తిరస్కరించినట్టు తెలిసింది. అలాగే ఎల్‌పీఎం నెంబర్‌ 4 కేటాయించిన సర్వే నెంబర్‌ 1/4లో 1.05 ఎకరాలు ఉండాల్సిన చోట 0.99 సెంట్లుగా చూపించారు. దీన్ని 0.997 సెంట్లుగా రివైజ్‌ చేయాలని ఫైల్‌లో పేర్కొన్నారు. మిగతా ఆరు సెంట్లను ఆక్రమణదారులు ఖాతాలో కలిపేశారు. ఇవే కాకుండా బలగ పరిధిలో సుమారు 20 సర్వే నెంబర్లలో భూ విస్తీర్ణాలను రివైైజ్‌ చేయాలని శ్రీనివాసరావు ఫైల్‌ పెట్టినట్టు తెలిసింది. దీనికోసం పట్టాదారుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు రెవెన్యూ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొన్ని సర్వే నెంబర్లలో 10 నుంచి 30 సెంట్లు, మరికొన్నింట్లో 50 సెంట్లకు మించి విస్తీర్ణాన్ని రివైజ్‌ చేయాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇందులో వరదగట్టుకు సంబంధించిన సర్వే నెంబర్లు కూడా ఉన్నాయి. వరదగట్టు భూమిని పంచుకోవడానికి మూడేళ్లుగా ఆక్రమణదారులు ప్రయత్నిస్తున్నారు. వీరికి సానివాడ సర్వేయర్‌ శ్రీనివాసరావు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ మార్పులను రెవెన్యూ అధికారులు తిరస్కరించినట్టు తెలిసింది. వరదగట్టు ఆక్రమణలపై గ్రీవెన్స్‌లో స్థానికులు ఫిర్యాదులు ఇవ్వడంతో తహసీల్దారు విచారణ జరుపుతున్నారని తెలిసింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page