ఉప రాష్ట్రపతి ఎన్నికలోనూ కుల రాజకీయమా?
- DV RAMANA
- 1 day ago
- 2 min read

ఉపరాష్ట్రపతి ఎన్నిక జాతీయ అంశం. అన్ని రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఆయన్ను ఎన్నుకుంటుంది. అంతకుమించి అందులో రాజకీయాలు, రాష్ట్రా ల ప్రాధాన్యత వంటివి పెద్దగా పరిగణనలోకి రావు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అభ్యర్థుల రాష్ట్రీయత, భాష వంటివి ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నాయి. వాటి మాటున రాజకీయాలు చొరబడుతున్నాయి. రాజ్యాంగ పదవులైన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులను పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఎన్నుకునే గత సంప్రదాయం మరుగున పడిపో యింది. అదే క్రమంలో ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీయే కూటమి తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ ను బరిలోకి దింపితే.. ప్రతిపక్ష ఇండియా కూటమి తెలంగాణకు చెందిన రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఆయనకు పోటీగా నిలబెట్టింది. ఎలక్టోరల్ కాలేజీలో బలాబలాలను చూస్తే గెలుపు ఎన్డీయేదేనని స్పష్టమవుతున్నా.. ఎన్నిక అనివార్యం. ఆ మేరకు రెండు కూటములు తమ అభ్యర్థులకు మద్దతు కూడగట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో రాజకీయాలు ప్రస్ఫుటమవుతు న్నాయి. ఎవరి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వారు పావులు కదుపుతున్నారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని సూచించారని చెబుతున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. తెలుగువాడు, తెలంగాణవాసి అయినందున ఇండీ కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి తెలుగు రాష్ట్రాలకు చెందిన చంద్రబాబు, కేసీఆర్ తమ పార్టీలపరంగా మద్దతు ఇవ్వాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. దీనిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ అభ్యర్థి విషయంలో తమను ఏ పార్టీ సంప్రదించలేదని, అలాంటప్పుడు మద్దతు ఎలా అడుగుతారని ఘాటుగా ప్రశ్నించారు. కేటీఆర్ స్పందన రాజకీయంగా కరెక్టే. అధికార పార్టీ అభ్యర్థనపై ప్రతిపక్ష నేతగా అలా స్పందించ డంలో తప్పులేదు. కానీ దానికి కొనసాగింపుగా ప్రస్తావించిన అంశాలపైనే అభ్యంతరాలు ఉన్నాయి. ‘ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయించడానికి తెలంగాణ మొత్తంలో ఒక్క బీసీ అభ్యర్ధి కూడా దొరక లేదా?’ అని కేటీఆర్ ఆవేశంగా ప్రశ్నించారు. అదే ఊపులో కంచె ఐలయ్యను అభ్యర్ధిగా ప్రకటించి ఉండాల్సిందని కూడా ఆయన అన్నారు. ఇది రాజకీయంగా బీసీ సామాజిక వర్గాన్ని ఆకర్షించటానికి పనికొస్తుందేమో కానీ అన్ని వర్గాలను సంతృప్తిపరచలేదు. మరోవైపు రేవంత్ రెడ్డి తన అభ్యర్థనలో ‘తెలుగువాడైన పీవీ నరసింహారావును గెలిపించుకోవడానికి గతంలో ఎన్టీఆర్ తమ పార్టీ తరఫున ఎవరినీ పోటీకి దింపని విషయాన్ని ఉదాహరణగా ఉటంకించినా కూడా కేటీఆర్ బీసీ పల్లవి ఎత్తుకో వడం పూర్తిగా రాజకీయ దృక్కోణంగానే పరిగణించాలి. ఇదే వాదాన్ని ఆరోజు ఎన్టీఆర్ కూడా విని పించి ఉంటే ఒక తెలుగువాడు దేశంలో చక్రం తిప్పే పరిస్థితులు వచ్చేవి కావేమో? ‘ఎన్నికలు వచ్చే సరికి బీసీలను మర్చిపోయారా?’ అని కూడా చివరాఖర్లో కేటీఆర్ ప్రశ్నించారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తానని అప్పట్లో కేసీఆర్ వాగ్దానం చేశారు. కానీ అధికారం అందిన తర్వాత ఆ హామీని విస్మరించి తానే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఒకపక్క తెలం గాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి అభ్యర్ధిని బరిలోకి దింపటానికి ఇండీ కూటమిని ఒప్పించి దేశ రాజకీయాల్లో మెరుస్తున్న తరుణంలో బీసీలు, ఓసీలంటూ ప్రజలను విభజించి రాజకీయాలు చేస్తే లోకువ కావడం తప్ప ప్రయోజనం ఉండదు. పార్టీ పేరులో తెలంగాణను తీసి పక్కన పెట్టినప్పుడే ప్రజలు కూడా బీఆర్‌ఎస్ పార్టీని పక్కన పెట్టారు. గెలుపు ఓటములను పక్కన పెడితే.. మళ్లీ తెలంగాణ వాదాన్ని ఢల్లీి వీధుల్లో బలంగా వినిపించే అవకాశం ఉప రాష్ట్రపతి ఎన్నిక రూపంలో వచ్చింది. ఈ అవకాశాన్ని రేవంత్ అందిపుచ్చుకుంటే.. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లమని చెప్పుకొనే బీఆర్‌ఎస్ కుల రాజకీయం చేస్తోంది. రేవంత్‌రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణా వాదంతో పాటు తెలుగు భాషావాదాన్ని వాడుకుని చంద్రబాబుని కూడా ముగ్గులోకి లాగారు. అవహేళనల జోలికి పోకుండా సాటి తెలుగువాడిగా తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వమని అటు ఏపీని.. సాటి తెలంగాణా వాడికి మద్దతు ఇవ్వమని ఇటు తెలంగాణావాదులను అభర్ధించి తన అమ్ముల పొదిలోని రెండు బాణాలను ఒకేసారి సంధించారు. ఇది చాలా తెలివైన వ్యూహం. సాటి తెలంగాణావాదిగా బలపరచవచ్చు లేదా వ్యూహా త్మక మౌనం పాటించవచ్చు. కానీ అందులోనూ రాజకీయం చేయడం మాత్రం తగదు.
Comments