ఉప రాష్ట్రపతి రేసులో తెలుగు నేతలు!
- NVS PRASAD

- Jul 22, 2025
- 2 min read
జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో తలుపు తట్టనున్న అవకాశం
అయితే ఏపీ లేదా బీహార్ ఎన్డీయే మిత్రులకు ఛాన్స్
ఢల్లీి నుంచి కబురు అందినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ
బీహార్ నుంచైతే హరివంశ్ నారాయణ్ సింగ్.. ఏపీ నుంచైతే ప్రతిభ లేదా యనమల

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పదవీకాలం పూర్తి కాకముందే రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేసినా లేదా మరణించిన సందర్భాల్లో కొత్త రాష్ట్రపతిని ఎన్నుకునే వరకు ఉప రాష్ట్రపతే రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చని రాజ్యాంగంలో నిర్దేశించారు. కానీ ఉప రాష్ట్రపతి పదవే ఖాళీ అయితే.. మళ్లీ కొత్త ఉప రాష్ట్రపతిను ఎన్నుకునే వరకు ఆ బాధ్యతలను ఎవరు నిర్వర్తించాలన్నది రాజ్యాంగంలో అసలు ప్రస్తావించలేదు. ఎందుకంటే.. భారత పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పదవీ కాలం పూర్తికాకముందే ఉప రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయడం, తద్వారా ఆ పదవి ఖాళీ అయిన సందర్భాలు ఇది మూడోసారి మాత్రమే. అందుకే ఈ పదవిని వీలైనంత త్వరగా భర్తీ చేయడానికి ఎలక్టోరల్ అధికారులు ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయ్యింది. నిబంధనల ప్రకారం 60 రోజుల్లోపు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంది. దాంతో అభ్యర్థి ఎంపిక దిశగా ఎన్డీయే సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. వాస్తవానికి 2027 వరకు ధన్‌ఖడ్ పదవీకాలం ఉన్నా.. అనారోగ్య కారణాలు చూపి సోమవారం రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపించారు. దాంతో ఆయన స్థానంలో కొత్త ఉప రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడిరది.
ఆ రెండు పార్టీల్లో ఒకదానికి అవకాశం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బీజేపీ నుంచి వచ్చారు. ఆమె పదవీకాలం పూర్తయిన తర్వాత కూడా ఆ స్థానంలో బీజేపీకి చెందిన నేతనే ఎన్నుకుని కూర్చోబెట్టే అవకాశం ఉంది. అందువల్ల ఉప రాష్ట్రపతి పదవిని ఎన్డీయే కూటమికి చెందిన ఏదో ఒక పార్టీకి ఇవ్వాలనే యోచనలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లోని ఎన్డీయే ప్రధాన భాగస్వామ్య పార్టీ తోపాటు.. బీహార్‌లో అధికారంలో ఉన్న ఎన్డీయే భాగస్వామి జేడీయూ నేత, సిటింగ్ ఎంపీకి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఢల్లీి వర్గాల ద్వారా తెలిసింది. పేరుకు తెలుగు రాష్ట్రాలు అన్నా.. ఈ రెండుచోట్లా టీడీపీకి చెందిన నేతకే అవకాశం ఇవ్వడానికే ప్రధాని మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఉప రాష్ట్రపతి పదవి దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి మాత్రమే కాకుండా రాజ్యసభకు చైర్మన్ కూడా ఉప రాష్ట్రపతి వ్యవహరించడం వల్ల ఈ పదవికి మంచి ప్రాధాన్యతే ఉంది. హిందీ, ఇంగ్లిష్‌తో పాటు ప్రాంతీయ భాషల మీద పట్టు కలిగిన నేతలు తెలుగుదేశంలో ఉంటే కచ్చితంగా ఈ పదవి తెలుగు రాష్ట్రాలకు దక్కే అవకాశం లేకపోలేదు. ఈ మేరకు కేంద్రం నుంచి టీడీపీ అధినేతకు సూచనప్రాయంగా కబురు అందినట్టు తెలిసింది. గతంలో మన రాష్ట్రానికే చెందిన వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా పని చేసినందున ఇప్పుడు ఆయన స్థాయికి తగ్గ వ్యక్తిని ఎంపిక చేయాలని టీడీపీ భావిస్తోందట.
టీడీపీలో అప్పుడే పోటీ
ఈ నేపథ్యంలో టీడీపీలో అప్పుడే పోటీ నెలకొంది. మాజీ స్పీకర్లు కావలి ప్రతిభాభారతి, యనమల రామకృష్ణుడు వంటి నేతలు అధిష్టానం నుంచి కబురొస్తే ఉప రాష్ట్రపతి పదవికి సిద్ధమన్న సంకేతాలను పార్టీకి పరోక్షంగా పంపించారు. ముఖ్యమంత్రి తరఫున నారా లోకేష్ రెండు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు నేతలతో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిసింది. రెండు రోజుల్లో ఎవరు సరైన అభ్యర్థులో తేల్చుకొని అన్ని సమీకరణాలు తేలిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఈ రేసులో ప్రస్తుతానికి ప్రతిభాభారతి ఒకడుగు ముందున్నారు. రాజకీయాలకు దాదాపు దూరం అనుకున్న సందర్భంలో ఆమె కుమార్తె కావలి గ్రీష్మకు పార్టీ పిలిచి మరీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఆ సమయంలోనే ప్రతిభాభారతి కోటా వేరేగా ఉందంటూ లోకేష్ వ్యాఖ్యానించడం గమనార్హం. జస్టిస్ పున్నయ్య కుమార్తెగా, మాజీ స్పీకర్‌గా, మంత్రిగా సుదీర్థకాలం పని చేసిన ప్రతిభాభారతి గత ఐదేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఉప రాష్ట్రపతి పదవికి కావాల్సింది కూడా ఇదే. త్వరలో బీహార్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాల రీత్యా ఆ రాష్ట్రానికి ఉప రాష్ట్రపతి పదవి కేటాయించే అవకాశం ఉంది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి కీలక భాగస్వామి జేడీయూ(జనతాదళ్ యునైటెడ్)కు చెందిన ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్‌ను ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసే అవకాశం ఉంది. హరివంశ్ ప్రస్తుతం రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఆ పదవిని బీహార్‌కు కేటాయించకపోతే అశోక్‌గజపతి రాజును ఆకస్మికంగా గోవా గవర్నర్‌గా పంపినట్టే, అదే బ్యాచ్‌కు చెందిన ప్రతిభాభారతిని ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయడానికి రమ్మని కేంద్రం పెద్దల నుంచి కబురొచ్చినా ఆశ్చర్యం లేదు.










Comments