ఊరంతా వణికిపోతోంది!
- NVS PRASAD
- Aug 16
- 1 min read
శుక్రవారం అర్థరాత్రి మూడు ద్విచక్ర వాహనాలు దహనం చేసిన దుండగుడు
టీకే రాజపురంలో తాజాగా మరో దొంగతనం
వంగరలో పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుడిపైనే అనుమానం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పార్వతీపురం మన్యం జిల్లా అనేకంటే మన పక్కనే ఉన్న పాలకొండ అంటే మనకు కాస్త తగ్గరగా ఉంటుంది. ఈ పోలీస్‌స్టేషన్ దగ్గరలో ఉన్న టీకే రాజపురం అంటే స్టేషన్‌లో చాలామందికి తెలియదు. ఎందుకంటే అంత ప్రశాంతమైన ఊరు అది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో గ్రామంలో ఒక్కో సామాజికవర్గం ప్రధానంగా ఉంటుంది. కానీ టీకే రాజపురంలో లేని కులమంటూ ఉండదు. చివరకు పార్వతీపురంలో మాత్రమే కనిపించి దాసరి సామాజికవర్గానికి చెందినవారు కూడా ఈ ఊరిలో కనిపిస్తారు. ఇంత ప్రశాంతమైన ఊరు గత మూడు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా కాలం వెల్లదీస్తోంది. ఈ గ్రామంలో ఇంటి ముందు పార్క్ చేసివున్న వాహనాలను రాత్రి సమయంలో ఎవరో తగులబెట్టేస్తున్నారు. అదే సమయంలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
2023లో వాలంటీర్‌గా పని చేసిన ఒక యువకుడు స్థానికంగా ఉన్న మరో యువతిని టీజ్ చేశాడని పాలకొండ పోలీస్‌స్టేషన్‌లో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. కానీ చదువుకున్న యువకుడు కాబట్టి భవిష్యత్తు పోతుందని మందలించి పంపించేశారు. సీన్ కట్ చేస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ ఉద్యోగాలు పోయాయి. ఇటీవల వంగర మండలంలో 20 తులాల బంగారం చోరీ కేసులో ఇదే యువకుడ్ని ఎ`3గా పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన ఈ యువకుడు ఇందులో తన ప్రమేయం లేదని, అందుకే బయట తిరగగలుగుతున్నానని, గ్రామంలో కొందరు తనను కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని, తనకేదైనా జరిగితే వారిదే బాధ్యతంటూ పోలీసులనుద్దేశిస్తూ ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. అదే సమయంలో టీకే రాజపురంలో ఇటీవల ఒక ఇంటిలో దొంగతనం జరిగింది. దీనికి, వంగరలో బంగారం చోరీకి సంబంధించిన నిందితులకు సంబంధం ఉందని గ్రామస్తుల భావన. శుక్రవారం రాత్రి కూడా మూడు ద్విచక్ర వాహనాలను కాల్చేయడంతో తమ వాహనాలను పోలీస్‌స్టేషన్‌లోనే పార్క్ చేసుకుంటామంటూ శనివారం గ్రామస్తులంతా పాలకొండ స్టేషన్‌కు వెళ్లారు. ప్రస్తుతానికి టీకే రాజపురంలో జరిగిన చోరీ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Comentários