top of page

ఊరు మనదే దోచేయ్‌!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jun 2
  • 2 min read
  • రోడ్డు మీదుగా వెళితే ఛార్జీలట

  • గెజిట్‌ను కాదని ధరలు

  • కళ్లముందే వసూలుచేస్తున్నా పట్టించుకోని పంచాయతీ అధికారులు

  • శ్రీకూర్మంలో ఆశీల కాంట్రాక్టర్‌ నిలువుదోపిడీ

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ree

జాతీయ రహదారిపైన కార్లు, బస్సులు, లారీల మీద వెళ్తే టోల్‌ఫీజు వసూలు చేయడం మనకు తెలుసు. నేషనల్‌ పర్మిట్‌ లేని లారీలు రాష్ట్ర బోర్డర్‌ దాటినప్పుడు వసూలుచేసే టాక్స్‌ తెలుసు. అంతెందుకు.. మార్కెట్‌కు వచ్చే వాహనాల నుంచి కిస్తీ వసూలు చేయడం అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో కామన్‌. ఎందుకంటే.. ఇవన్నీ ఆదాయ వనరులే. కానీ ఒక పంచాయతీ రోడ్డు మీద నుంచి వెళ్తున్న పాపానికే ఆశీలు కట్టాలనడం కచ్చితంగా విడ్డూరమే. ఇదెక్కడో కాదు.. శ్రీకాకుళం నియోజకవర్గంలోనే శ్రీకూర్మం పుణ్యక్షేత్రం ఉన్న పంచాయతీలో జరుగుతోంది. శ్రీకూర్మనాథ ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలకు ఎటువంటి పార్కింగ్‌ సౌకర్యం కల్పించకపోయినా ఎప్పట్నుంచో పార్కింగ్‌ ఛార్జీలు పంచాయతీ వసూలు చేస్తుంది. పోనీ ఆదాయం పంచాయతీ అభివృద్ధికి ఖర్చుపెడతారు కదాన్న కోణంలో చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఇప్పుడు ఏకంగా శ్రీకూర్మం రోడ్డు మీదుగా వాహనం వెళ్తే చాలు.. అడ్డంపడిపోయి మరీ దోచేస్తున్నారు. ఇదేంటంటే.. ఆశీలు వసూలు చేసుకోడానికి పంచాయతీ తమకు పర్మిషన్‌ ఇచ్చిందంటున్నారు. అసలు పంచాయతీ అనుమతులు దేనికి ఇచ్చింది, వీరు దేనికి వసూలు చేస్తున్నారన్న సమాధానం చెప్పడానికి కూడా శ్రీకూర్మం పంచాయతీ అధికారులు ఇష్టపడటంలేదు. వాస్తవానికి ఇక్కడ మార్కెట్‌ అవసరాల కోసం వచ్చే వాహనాల నుంచి మాత్రమే ఆశీలు వసూలు చేయాలి. అది కూడా పంచాయతీ నిర్దేశించిన మొత్తానికి. మరోవైపు శ్రీకూర్మం దేవస్థానం ఎదురుగా వాహనాలు పార్క్‌ చేస్తే, పార్కింగ్‌ ఛార్జీలు వసూలు చేయొచ్చు. కానీ వీరు చేస్తున్నదేమిటి?

రోడ్డు మీదకు వాహనం వస్తే చాలు.. పార్కింగ్‌ పేరుతో శ్రీకూర్మంలో అడ్డగోలుగా ఆశీలు వసూలు చేస్తున్నారు. గార` కళింగపట్నం రోడ్డులో శ్రీకూర్మం జంక్షన్‌ దాటి వెళ్లే ఆటో, కార్లు, బస్సులను రోడ్డుపై ఆపేసి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. శ్రీకూర్మం దర్శనానికి, కర్మకాండలు నిర్వహించడానికి వచ్చే వాహనాల నుంచి పంచాయతీ గెజిట్‌ ప్రకారం ఆశీలు వసూలు చేయాలన్నది నిబంధన. ఇప్పుడు ఆ ఆదేశాలను పట్టుకొని కార్లు, బస్సులు, ఆటోల పార్కింగ్‌కు అవకాశమే లేకపోయినా పార్కింగ్‌ పేరుతో ఆశీలు వసూలు చేస్తున్నారు. దేవస్థానానికి వచ్చేవారంతా రోడ్డుకు ఇరువైపులా వాహనాలు పార్కింగ్‌ చేస్తుండటంతో, అలాంటి వారి నుంచి పార్కింగ్‌ పేరుతో ఆశీలు వసూలుచేయాలని పంచాయతీ గెజిట్‌లో పేర్కొన్నారు. అయితే శ్రీకూర్మం వెంబడి వెళ్లే అన్నిరకాల వాహనాలకు డబ్బులు వసూలు చేసేస్తున్నారు. శ్రీకూర్మం రోడ్డు మీదుగా సుమారు 15 గ్రామాలకు రాకపోకలు సాగుతున్నాయి. ఈ గ్రామాల్లో చుట్టం చూపునకు వచ్చినా, శుభకార్యాలకు వెళ్లినా కార్లు, ఆటోల నుంచి దౌర్జన్యంగా గెజిట్‌లో పెర్కొన్న మొత్తం కంటే రెండు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. దేవస్థానానికి తాము వెళ్లడం లేదని, చుట్టాల ఇంటికి వెళుతున్నామని, దీనికి ఆశీలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించేవారిపై ఆశీల వసూలుదారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు చెబుతున్నారు.

పంచాయతీ గెజిట్‌ ప్రకారం ఈ ఆర్ధిక సంత్సరంలో ఏప్రిల్‌ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు శ్రీకూర్మంకు వచ్చే వాహనాలు, మార్కెట్‌, చిల్లర దుకాణాలు, షాపులు, గూడ్స్‌ నుంచి ఆశీలు వసూలుకు గ్రామానికి చెందిన లక్ష్మణరావు రూ.12.60 లక్షలకు వేలంలో దక్కించుకున్నారు. దీన్ని అదే గ్రామానికి చెందిన నగిరెడ్డి తాతారావుకు సబ్‌కాంట్రాక్ట్‌కు అప్పగించేశారు. సబ్‌ కాంట్రాక్ట్‌కు అప్పగించడానికి గెజిట్‌ ప్రకారం దక్కించుకున్న రూ.12.60 లక్షలకు అదనంగా రూ.50వేలు తీసుకున్నారు. అయినప్పటికీ ఆశీలు వసూలు మాత్రం లక్ష్మణరావు పేరుతోనే శ్రీకూర్మంలో సాగుతుంది. గెజిట్‌ ప్రకారం ఆటోకు రూ.10, కారుకు రూ.20, బస్సుకు రూ.50 వసూలు చేయాలి. అయితే ఆటోకు రూ.20, కారుకు రూ.50, బస్సుకు రూ.100 వసూలు చేస్తున్నారు. శ్రీకూర్మం దర్శనానికి వచ్చే వాహనాలకు మాత్రమే పార్కింగ్‌ చార్జీలు వసూలు చేయాలి. అలా కాకుండా రోడ్డులో వస్తే చాలు.. వాళ్లు ఎక్కడకు వెళుతున్నది పట్టించుకోకుండా రశీదు చేతిలో పెట్టి ఆశీలు వసూలు చేస్తున్నారు. దీనిపై పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాహనదారులు చెబుతున్నారు. గెజిట్‌ విడుదల చేసినప్పుడు మూడు కేటగిరిల్లో వాహనాలకు నిర్దేశించిన ఆశీలను మాత్రమే వసూలుచేయాలి. ఆ మేరకు ఆశీలు దక్కించుకున్నవారు గెజిట్‌కు భిన్నంగా వసూలు చేస్తున్నా పంచాయతీ అధికారులు చోద్యం చూస్తున్నారు. రూ.20 వసూలు చేయాల్సిన చోట రూ.50, రూ.50 వసూలు చేయాల్సిన చోట రూ.100 వసూలు చేస్తూ ఆశీలు కాంట్రాక్టర్‌ జేబు నింపుకుంటున్నారని గ్రామస్తులే ఆరోపిస్తున్నారు. పార్కింగ్‌ చేయకుండా రోడ్డుపై వాహనాలు ఆపేసి పార్కింగ్‌ పేరుతో వసూలు చేయడంపై శ్రీకూర్మం పరిసర ప్రాంతాలకు వచ్చే బంధువులు, స్థానికులు ఆశీలు వసూలుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2023`24 ఆర్ధిక సంత్సరంలో ఆశీల పాటను రూ.11 లక్షలకు దక్కించుకున్న వ్యక్తి గెజిట్‌ నిబంధనల మేరకు ఆశీలు వసూలుచేసినా, గిట్టుబాటు అయిందని, ఇప్పుడు కొత్తవారు ఎందుకు ధరలు పెంచాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఆశీలపై అధిక ధరలను ముద్రించి అక్రమ వసూలుకు పాల్పడుతున్నా కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అదనపు వసూలుతో పాటు శ్రీకూర్మం రోడ్డు వెంబడి వచ్చే వాహనాల నుంచి ఆశీలు వసూలు చేయడం నిలుపుదల చేయాలని వాహనదారులు అధికారులను కోరుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page