సేవాధీరుడు.. సూర శ్రీనివాసుడు
- Guest Writer
- Aug 22
- 4 min read
సామాన్యుడి నుంచి సేవకుడిగా
సేవల్లో ఘనాపాటి.. లేరు సాటి
నిరంతర శ్రామికుడు.. ప్రజాసేవకుడు
స్నేహశీలి, సౌమ్యుడిగా ప్రజల మనసుల్లో ముద్ర
ఎస్‌ఎస్‌ఆర్ ట్రస్ట్ ద్వారా విస్తృత సేవలు

(సత్యం న్యూస్,శ్రీకాకుళం)
కష్టం మనింటి తలుపు తడితే.. ఆ కష్టం తీరాలంటే ఆ మనిషికి చెప్పుకోవాలి అనేంతలా మారిపోయింది ఆ వ్యక్తి పేరు. గుడికెళ్తే దేవుడు ఆదుకుంటాడో లేదో తెలియదు కానీ.. మన కష్టం ఆయనకు తెలిస్తే మాత్రం వెంటనే స్పందించే తత్వం అతనిది. ప్రతి మనిషికి దేవుడు చేతులిచ్చింది పని చేసుకుని బతకడానికి అనుకుంటాం.. కానీ అతను మాత్రం సాయం చేయడానికి, కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడవడానికి అనుకుంటారు. కష్టంలో ఉంటే ఆదుకునేవారు చాలా తక్కువమంది. ఉన్నంతలో సాయం చేసేవారు ఇంకొంతమంది. కానీ ఉన్న సమస్య గురించి సమాచారం అందిన వెంటనే స్పందించే ఏకైక వ్యక్తి సూర శ్రీనివాసరావు.
కరోనా సృష్టించిన విలయ తాండవంలో రోడ్డున పడిన ఎందరికో బాసటగా నిలిచిన ఎస్‌ఎస్‌ఆర్ ఇంకెందరికో దేవుడు అయిపోయారు. ఇప్పుడు సూర శ్రీనివాసరావు అంటే జిల్లా వాసులకు పేరు కాదు.. బ్రాండ్. తన సేవలను మరింత విస్తృతం చేసేందుకు 2021 ఆగష్టు 23న తన పుట్టిన రోజున ఎస్‌ఎస్‌ఆర్ ఛారిటబుల్ ట్రస్టు ప్రారంభించారు. ఏడాది కాలంలో ఎస్‌ఎస్‌ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, క్రీడలు, పేదలు, ఆధ్యాత్మిక రంగాల్లో అనేక సేవలు అందిస్తున్నారు. ఇలా అనునిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సూర శ్రీనివాసరావు ప్రజల హృదయాల్లో సేవా ధీరుడిగా చెరగని, తరగని ముద్ర వేసుకున్నారు. ఎస్‌ఎస్‌ఆర్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా అనేక గ్రామాల్లో మంచినీటి కుళాయిలు, అనేక పాఠశాలల్లో దేవతల, స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను ఏర్పాటుచేశారు. పలు చోట్ల దేవాలయాలు నిర్మించారు. ఎస్‌ఎస్‌ఆర్ ఛారిటబుల్ ట్రస్టు అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.
ఆయనో అలుపెరగని యోధుడు.. నిస్వార్ధ ప్రజాసేవకుడు.. పేదల మనసుల్లో గుడి కట్టుకున్న భగవంతుడు.. సేవ చేయడమే తప్ప ఫలితం ఆశించే వ్యక్తి కాదు.. అతడే సూర శ్రీనివాసరావు. కరోనా రక్కసి ఊరు, వాడను మింగిస్తున్న వేళ.. మానవత్వం, దాతృత్వం, సేవాతత్వం వంటి లక్షణాలు మనుషుల నుంచి మాయమవుతున్న వేళ.. నేనున్నానంటూ ముందుకు వచ్చారు. ఏకకాలంలో మానవత్వంతో నిండిన మనసుతో సేవాతత్పరతను కలిగి దాతృత్వం వైపు అడుగులు వేశాడు. కరోనా బాధితులకు, వారి సహాయకులకు ఆహారం అందించి వారి పాలిట అన్నార్తుడయ్యారు. పనుల్లేక అర్ధాకలితో అలమటిస్తున్న నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేసి, వారి పాలిట ఆరాధ్యుడయ్యారు. లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడిన రోజువారి కూలీలకు, ప్రైవేటు పాఠశాలల సిబ్బందికి, సినిమా హాల్ కార్మికులకు, విశ్వబ్రాహ్మణ, జర్నలిస్టులకు, పేద కళాకారులకు వేలాదిగా నిత్యవసర సరుకులను పంపిణీ చేసి వారి పాలిట ఆపద్భాంధవుడయ్యారు.. రోగులకు, మృతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందజేసి వారికి సహాయకుడయ్యారు.. అలాగే విద్య, వైద్య, జైలు, ఆధ్యాత్మికత, క్రీడలు అన్ని రంగాల్లోనూ తన సేవలను విస్తృతం చేశారు. అన్నార్తులకు ఆరాధ్యుడిగా, సేవకుడిగా, నాయకుడిగా ప్రజల మనసుల్లో తన స్థానం పదిలం చేసుకున్నారు సూర శ్రీనివాసుడు. తన పుట్టిన రోజున తన పేరులో ట్రస్టు ప్రారంభించి అనతి కాలంలోనే ప్రజలకు అనేక సేవలందించి కలెక్టరు నుంచి సామాన్యుడి వరకు సుపరిచితుడయ్యారు. తాను చేసిన సేవలకు గానూ డాక్టరేట్ పట్టాను కూడా అందుకున్నారు.
వ్యవసాయం నుంచి వ్యాపారం వైపు..

ఎచ్చెర్ల మండలం కుశాలపురం గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సూర శ్రీనివాసరావు ఎచ్చెర్ల, శ్రీకాకుళం నగరాల్లో వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ పచ్చారు. శ్రమ పెట్టుబడి అయితే విజయం నీకు బానిస అవుతుందని ఓ మహనీయుడు చెప్పిన మాట సూర శ్రీనివాసరావులో స్ఫూర్తిని నింపింది. ఆ మాటే ఆయనను బాసటగా మలిచింది. సిక్కోలు జిల్లాలో ఎందరో లక్షలాధికారులు, కోటీశ్వరులు ఉన్నా మానవత్వం, దాతృత్వం ఉన్న మనిషిగా శ్రీనివాసరావు మాత్రమే జనం ముందుకొచ్చి కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకొనేందుకు సిద్ధమవుతుంటారు. కరోనా కాలంలో అందరివాడిగా మన్ననలు అందుకున్న శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఉన్నతాధికారులు, మేధావులు, సామాన్య పౌరులందరికీ ఇప్పుడు సుపరిచిరితుడు. అందరి ప్రశంసలు అందుకున్న వ్యక్తి కూడా.
సూర శ్రీనివాసరావు కుశాలపురం గ్రామంలోని రైతు కుటుంబంలో 1984 ఆగస్టు 23న జన్మించారు. తల్లిదండ్రులు వైకుంఠమ్మ, గన్నయ్యలకు ముగ్గురు పుత్రులు, నలుగురు పుత్రికలతో సహా 8వ సంతానమైన శ్రీనివాసరావు డిగ్రీ పూర్తి చేసి, అనంతరం వ్యాపార రంగంలో ఇంతింతై వటుడిరతై చందంగా ఎదిగారు. ఒకవైపు వ్యాపారం చేస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చారు. రెండు రంగాల్లోనూ ఈయన తనకంటూ ప్రత్యేక స్థానం ఉందని నిరూపించుకోగలుగుతున్నారు.
పారిశ్రామికవేత్త.. సామాజికవేత్త..

సమాజంలో పదిమందికి సహాయపడాలంటే డబ్బు కచ్చితంగా ఉండాలి. డబ్బుంటే సరిపోదు.. పదిమందికి సహాయం చేయాలన్న తపన కూడా ఉండాలి. వ్యవసాయ రంగం నుంచి వచ్చిన శ్రీనివాసరావు పారిశ్రామికవేత్తగా క్రమక్రమంగా ఎదుగుతూ తాను సంపాదించిన డబ్బు జనానికి కూడా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో సామాజికవేత్తగా కూడా ఎదిగారు.
పెద్దల మన్ననలు.. ప్రముఖ సంస్థల పురస్కారాలు..

కష్టపడి పని చేయడమే కాదు.. ఇష్టపడి పని చేయడం సూర శ్రీనివాస్‌కు సహజ లక్షణం. తాను చేయాలన్నది ఏదైనా కచ్చితంగా చేసి తీరుతారు. వ్యాపారం, వ్యవహారంలో కూడా ఈయనంటేనే ఎందరికో నమ్మకం. పారిశ్రామికవేత్తగా, సామాజికవేత్తగా ఎదుగుతున్న క్రమంలో సూర శ్రీనివాసరావు అత్యున్నత స్థాయిలో ఉండే నేతలు మొదలు పార్టీలకతీతంగా నాయకులు, పౌర సంఘాల నుంచి మన్ననలు అందుకుంటూనే ఉన్నారు. ఇక ప్రముఖ సంస్థల నుంచి కూడా సూర శ్రీనివాసరావు అందుకున్న అవార్డులు, సన్మానాల సంఖ్య తక్కువేమీ కాదు.
ఆలయాల నిర్మాణం.. పునర్నిర్మాణంలో..
వ్యాపార రంగంలో తాను సంపాదించే డబ్బులో కొంతమేరకు దేవుడికి, మరికొంత మేరకు దేవుడి లాంటి మనిషికి ఇవ్వాలని శ్రీనివాస్ తపన పడుతూ ఉంటారు. దశాబ్దకాలంగా జిల్లాలో ఎన్నో దేవాలయాల నిర్మాణంలోనూ, పలు దేవాలయాల పునర్నిర్మాణంలోనూ ప్రముఖమైన పాత్ర ఈయన పోషించారు.
సాయమందించే హస్తం..

కోవిడ్ కాలంలో ఇళ్ల నుంచి బయట వచ్చేందుకు జనం భయపడేవారు. ఆసుపత్రుల్లో వందలాది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తొలి విడత కోవిడ్ సమయంలోనే జనానికి ఆదుకోవాలని శ్రీనివాస్‌కు అనిపించింది. ఆలోచన వచ్చిందే తడవుగా మూడు విడతల కోవిడ్ సమయంలోనూ బాధిత జనానికి బాసటగా నిలిచారు. లాక్‌డౌన్ రెండు దశల్లో శ్రీనివాస్ చేపట్టిన సేవా కార్యక్రమాలు వేలాది మంది బాధిత జనానికి ప్రయోజనం చేకూర్చాయనడంలో సందేహం లేదు. కోవిడ్ సమయంలో శ్రీనివాస్ ఆదుకొనేతత్వం జిల్లా వ్యాప్తంగా ఎంతో గుర్తింపును, గౌరవాన్ని తీసుకొచ్చేలా హృదయం చేసింది. మానవత అంటే శ్రీనివాసే అని జనం కూడా ప్రశంసిస్తూ వచ్చారు. రాష్ట్రస్థాయి ప్రముఖ నేతలు, ఉన్నతాధికారుల ప్రశంసలతో పాటు ప్రముఖ సంస్థల నుంచి పురస్కారాలు అందుకున్నారు. 41 రోజుల పాటు కోవిడ్ బాధితులకు పెద్ద ఎత్తున ఆహారం సరఫరా చేశారు. ప్రతీ ఏడాది పరీక్ష సమయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అట్టలు, పెన్నులు, పరీక్షా సామగ్రి అందజేస్తున్నారు.
‘ఆయన’ సేవల వెంట ‘ఆమె’

సంపాదించే పురుషులు విపరీతంగా ఖర్చు చేస్తుంటారు. మహిళలు మాత్రం పొదుపు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. సూర శ్రీనివాస్ సమాజం కోసం ఏదో చేయాలన్న తపన పడుతున్నప్పుడు స్పందించే మొట్టమొదటి వ్యక్తి ఆయన సతీమణి సరితారాణి. జిల్లాలోని అనేక దేవాలయాలు, పలు పాఠశాలల్లో విగ్రహాల ఏర్పాటులో ఆయన సతీమణి సరితారాణి సహకారం ఎంతో ఉంది. మంచి కోసం ఎంతైనా ఖర్చు చేయడం తప్పుకాదని, అది ఉపయోగిస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుందని ఆమె అంటుంటారు. 2015లో ఏప్రిల్ 2న కింతలి గ్రామానికి చెందిన త్రినాథరావు, హైమావతిల ఏకైక కుమార్తె సరితారాణితో వివాహం అయిన నాటి నుంచి ఇటు వ్యాపార రంగంలోనూ, ఇటు సేవా రంగంలోనూ సూర శ్రీనివాస్ దూసుకుపోతున్నారు. తన భర్త చేసే సామాజిక సేవా కార్యక్రమాలు తమ పిల్లలు జ్యోతిప్రియ, జస్మితకు పెద్దల దీవెనలుగా ఆమె భావిస్తూ ఉంటారు. సమాజం కోసం చేసిన ఏ ఒక్క సహాయం వృధా కాదని ఆమె బలంగా నమ్ముతారు. పేద విద్యార్థుల సహాయంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పేదరికం గురించి ఎక్కువగా తెలుస్తోంది. అలా గ్రామీణ నేపథ్యం ఉన్న సూర శ్రీనివాస్‌కు చదువుకున్న రోజుల్లో సమస్యల్లో ఉన్న పేదవారిని చూసి, వారి కోసం ఏదో చేయాలన్న తపన ఉండేది. చదువు పూర్తయి వ్యాపార రంగంలోకి వచ్చాక తన సంపాదనలో పేద విద్యార్థులను చదివించేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతీ ఏటా పుస్తకాలు, యూనిఫారాలు సూర శ్రీనివాస్ అందిస్తూ ఉంటారు. పేదరికం వల్ల ఉన్నత విద్యకు అవకాశం లేని ఎందరికో ఆర్థికంగా ఆయన సహాయం అందిస్తున్నారు. దశాబ్ద కాలంగా ఈయనకి ఆధ్యాత్మిక, సామాజిక, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ పేదలకు సహాయం చేస్తూనే ఉన్నారు. ప్రతీ సేవలోనూ ఆయన వెంట ఆమె ఉన్నారు. అందుకే సరితారాణి తన సతీమణి అనడం కన్నా సహధర్మచారిణి అనేందుకే ఇష్టపడతానని సూర శ్రీనివాస్ చిరునవ్వులు చిందించారు.
పుట్టినరోజు సందర్భంగా సూర శ్రీనివాసరావు అభిమానులు రక్తదాన, వస్త్ర, పుస్తకాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, ఆటో డ్రైవర్లకు దుస్తులు పంపిణీ కార్యక్రమాలు, ఉదయం నుంచి పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు.










Comments