ఊరిస్తున్న విరాట్ హ్యాట్రిక్.. భారత్ మ్యాజిక్!
- DV RAMANA

- 2 days ago
- 2 min read
విశాఖను ఆవహించిన క్రికెట్ ఫీవర్
కోహ్లి మరో రికార్డు గురించే అంతటా చర్చ
ఈ మ్యాచ్ గెలిస్తేనే భారత్‌కు వన్డే సిరీస్
హాట్‌కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
వరుసగా మూడో సెంచరీ చేసి విరాట్ కోహ్లి మరో హ్యాట్రిక్ ఫీట్ సాధిస్తాడా?.. మూడో మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సౌత్ ఆఫ్రికాపై భారత్ సిరీస్ విజయాన్ని నమోదు చేస్తుందా??.. ఈ రెండు ఫీట్లకు విశాఖ వేదిక కానుందా??? భారత క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. ఈ కారణంగానే విశాఖ.. దాంతోపాటు ఉత్తరాంధ్రను క్రికెట్ ఫీవర్ ఆవరించింది. భారత్`దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్ విశాఖలోని ఏసీఏ`వీడీసీఏ స్టేడియంలో శనివారం జరగనుంది. ఇందుకోసం స్టేడియంలో పూర్తిస్థాయిలో సన్నాహాలు ఒకవైపు జరుగుతుంటే మరోవైపు శుక్రవారమే విశాఖకు చేరుకున్న రెండు జట్లు స్టేడియంలో ముమ్మర సాధనలో నిమగ్నమయ్యాయి. టెస్ట్, వన్డే, టీ20 మ్యాచ్‌లతో కూడిన ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా భారత్‌లో పర్యటిస్తోంది. ఇప్పటికే ముగిసిన టెస్ట్ సరీస్‌ను దక్షిణాఫ్రికాకు కోల్పోయిన భారంతో ఉన్న భారత్ వన్డే, టీ20 సిరీస్‌లపై గురిపెట్టింది. అందుకు తగినట్లే రాంచీలో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో నెగ్గినా రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో ఓటమి పాలవడంతో రెండు జట్లు 1`1తో సమానంగా ఉన్నాయి. దాంతో విశాఖ వన్డే నిర్ణయాత్మకంగా మారింది. విశాఖ వేదికపై నెగ్గి వన్డే సిరీస్‌ను ఎగరేసుకుపోవాలని రెండు జట్లు తహతహలాడుతున్నాయి. దాంతో హోరాహోరీ తప్పదన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. టీమ్ ఇండియా విజయంతోపాటు మాంచి ఊపు మీద ఉన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరో సెంచరీ కొట్టి రెండో హ్యాట్రిక్ సాధిస్తాడా అన్న ఆసక్తి నెలకొంది.
అంతటా విరాట్ జపం
విశాఖ ప్రస్తుత విరాట్ నామస్మరణతో మార్మోగుతోంది. అభిమానుల్లో ఆయనకున్న క్రేజ్ అటువంటిది. అందులోనూ ఆరు నెలలకుపైగా విరామం తర్వాత సౌత్ ఆఫ్రికా సిరీస్‌తోనే కోహ్లి మళ్లీ బ్యాట్ పట్టాడమే కాకుండా.. పరుగుల వరద పారిస్తున్నాడు. పాతరోజులను గుర్తు చేస్తున్నాడు. ఇప్పటికే టెస్ట్, టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసి వన్డే కెరీర్ మాత్రమే కొనసాగిస్తున్న ఈ పరుగుల యంత్రం ప్రస్తుత సిరీస్‌లోనూ ధారాళంగా పరుగులు చేస్తూ టీం ఇండియాకు మూలస్తంభంలా నిలుస్తున్నాడు. ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో వరుస సెంచురీలు కొట్టి జోరు మీద ఉన్న విరాట్ విశాఖలోనూ అదే జోరు కనబరచాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక్కడ కూడా సెంచురీ సాధిస్తే వరుసగా మూడో వన్డేల్లో సెంచురీలతో హ్యాట్రిక్ కొట్టినట్లు అవుతుంది. అది కూడా అతనికి రెండో హ్యాట్రిక్ అవుతుంది. అంతకుముందు 2018లో కూడా వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో కూడా విరాట్ కోహ్లి వరుసగా మూడు మ్యాచుల్లో సెంచురీలో మొదటి హ్యాట్రిక్ చేసి.. ఆ ఘనత సాధించిన అంతర్జాతీయ క్రికెటర్ల జాబితాలో 12వ బ్యాటర్‌గా నిలిచాడు. విశాఖ గ్రౌండులోనూ కోహ్లికి మంచి రికార్డే ఉంది. ఇప్పటివరకు ఏసీఏ`వీడీసీఏ మైదానంలో ఏడు అంతర్జాతీయ వన్డేలు ఆడిన విరాట్ ఏకంగా 97.83 స్ట్రైక్‌రేటుతో 587 పరుగులు చేశాడు. వీటిలో మూడు సెంచురీలు, రెండు అర్ధ సెంచురీలు ఉన్నాయి. ఈ గణాంకాలను కోహ్లి శనివారంనాటి మ్యాచ్‌లో మరింతగా మెరుగుపర్చుకునే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2027 అక్టోబర్`నవంబర్ నెలల్లో దక్షిణాఫ్రికాలో వన్డే వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. ఆ టోర్నీ తర్వాత వన్డే క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పాలన్న ఆలోచనలో ఉన్న కోహ్లి భారత తుది జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఇప్పటినుంచే ప్రయత్నిస్తున్నాడు. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ క్రమం తప్పకుండా జట్టుకు ఎంపికైతే వరల్డ్ కప్‌కు ముందు కోహ్లీకి మరో 25 వన్డేలు ఆడే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే వన్డేల్లో క్రికెట్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ సాధించిన సెంచురీల రికార్డును బ్రేక్ చేసిన కోహ్లిని సచిన్ నెలకొల్పిన మరో రికార్డు కూడా ఊరిస్తోంది. అన్ని క్రికెట్ ఫార్మట్లలో కలిపి మొత్తం వంద సెంచురీలు చేసిన రికార్డు సచిన్ పేరుతో ఉంది. మరో 20కిపైగా సెంచురీలు సాధిస్తే ఆ రికార్డు కోహ్లీ పరమవుతుంది. వన్డే వరల్డ్ కప్ వరకు నిలకడగా ఆడగలిగితే దాన్ని కూడా విరాట్ సాధించే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో పెద్దగా క్రికెట్ ఆడని విరాట్‌కు సఫారీ జట్టుపై చేసిన వరుస రెండు సెంచరీలు ఆత్మవిశ్వాసాన్ని చ్చాయనడంలో సందేహం లేదు.
స్టేడియం హౌస్‌ఫుల్
విశాఖ మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. టికెట్లు దొరక్క చాలామంది నిరాశ చెందుతున్నా.. వాటికోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. నవంబర్ 28న మ్యాచ్ టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. మొదట ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన నిర్వాహకులు తర్వాత ఆఫ్‌లైన్‌లో విక్రయాలకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. అయితే పెద్దగా స్పందన కనిపించలేదు. అయితే విరాట్ కోహ్లి రాంచీలో జరిగిన మొదటి వన్డేలో సూపర్ సెంచరీ (135) సాధించడంతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. టికెట్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. స్టేడియంలో 25 వేల మంది కూర్చునే సామర్థ్యం ఉండగా ఆ టికెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే అమ్ముడైపోయాయి. ‘మొదట్లో అభిమానుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. కానీ కోహ్లీ రాంచీలో సెంచురీ చేసిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి’ అని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీడియా అండ్ ఆపరేషన్స్ టీమ్ పేర్కొంది. ఆన్‌లైన్‌లో కూడా ఫోన్లు పట్టుకుని గంటల తరబడి నిరీక్షిస్తే తప్ప.. టికెట్లు లభించలేదని పలువురు పేర్కొన్నారు.










Comments