ఎక్కడో మాడుతున్న వాసన వస్తోంది..!
- Prasad Satyam
- Oct 23
- 3 min read
పేకాటపై నిషేధాన్ని తొలగించాలేమో!
రాష్ట్ర క్రీడగా గుర్తించకపోతే కూటమి విడిపోయేటట్టుంది
పక్క శాఖలపై పవన్ చూపు ఇస్తున్న సంకేతాలేమిటి?

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
కూటమి ప్రభుత్వంలో ఎక్కడో మాడుతున్న వాసన వస్తోంది. గోదావరి నీళ్లు తాగినోళ్లకు కొద్దిగ ఎటకారం ఎక్కువే. కాదనలేం. ఈ మాట గతంలో ఓ ఇంటర్వ్యూలో హాస్యనటుడు కృష్ణభగవాన్ అన్నట్టు గుర్తు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాటలు కూడా ఎటకారంగానే భావించాల్సివుంది. ఎందుకంటే.. ఆయన భీమవరంలో ఆ గోదావరి నీళ్లే తాగుతున్నారు. ‘ఇతర శాఖలను కూడా పవన్ పట్టించుకోవడం సంతోషించదగ్గ విషయం. భీమవరం డీఎస్పీ జయసూర్యకు మంచి ట్రాక్‌రికార్డు ఉంది.’ ఇది డీఎస్పీ జయసూర్య మీద పవన్ చేసిన వ్యాఖ్యలపై ట్రిపుల్ ఆర్ స్పందించిన విధం. ఇది చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతున్నట్లు అర్థమవుతుంది. కాకపోతే చంద్రబాబు ఇటువంటి వాటిని డీల్ చేయడంలో సిద్ధహస్తులు కాబట్టి ప్రస్తుతానికి ఏమీ లేనట్టే కనిపిస్తుంది గానీ ఎక్కడో మాడువాసన మొదలైంది. గోదావరి జిల్లాల్లో పేకాట, పందాలాడటం పెద్ద విషయం కాదు. ఇది వారి సంస్కృతిలో ఒక భాగం. రఘురామకృష్ణంరాజు కూడా ఇదే విషయం చెప్పారు. కాకపోతే రాష్ట్రంలో పేకాట మీద నిషేధం ఉంది. అసలే రాజులు.. ఆపై గోదావరివాసులు. పశ్చిమగోదావరి ప్రాంతమంతా పేకాడకపోతే చేతులు పీకేస్తుందనేవారే ఎక్కువ. ఇలాంటి చోట పోలీస్ రైడ్‌లు జరగడంలేదని డీఎస్పీ జయసూర్య మీద పవన్ సీరియస్ అవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గోదావరి జిల్లాల్లోనే కాదు.. భారతీయ సనాతన ధర్మంలో భాగమైన పురాణాల్లో కూడా జూదమాడారు. ఇప్పుడు ఈ వ్యవహారానికి పవన్ పుల్‌స్టాప్ పెట్టకపోతే నలుడు ఆడలేదా? కౌరవులు, పాండవులు కలిసి ఆడలేదా? అని గోదావరి వాసులు రోడ్డెక్కినా ఆశ్చర్యం లేదు. సంక్రాంతి సమయంలో రకరకాల నిషేధిత పందాలు రాష్ట్రమంతా ఎలా జరుగుతాయో అందరికీ తెలుసు. ఏది నేరం, ఏది నేరంకాదు.. అనేది ప్రభుత్వం బట్టే ఉంటుంది, చట్టం నిర్ణయిస్తుంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు (1995) మద్యనిషేదం పకడ్బంధీగా అమలుజరుగుతున్న రోజుల్లో మందు తాగడం నేరం. అలాంటిది వెంటనే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే మద్య నిషేదం ఎత్తేస్తే మందు తాగాలని ఆబ్కారీ శాఖే ప్రోత్సహించింది. అలాగే గుర్రప్పందాలు నిషేదిస్తే నేరం, అనుమతిస్తే నేరం కాదు. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రశ్న పేకాటను చట్టబద్ధం చేయడమా? లేక నేరమే అని తేల్చడమా? ఈ రెండిరటి మధ్య విభజన గీత అంత సులువు కాదు. ఎందుకంటే.. ఈ రేఖకు ఒకవైపు పవన్, మరోవైపు ట్రిపుల్ ఆర్ ఉన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుంటూరు, పాలకొల్లు వంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద క్లబ్బుల్లో సైతం పేకాడటానికి భయపడేవారు. ఇప్పటికీ అన్ని జిల్లాల్లోనూ పోలీసులనో, ప్రెస్‌నో మేనేజ్ చేసి పేకాడుతున్నవారు ఉన్నారు. శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి దెబ్బకు జడిసి శ్రీకాకుళం సరిహద్దు జిల్లా ఒడిశాకు చెందిన పర్లాకిమిడిలో ఇప్పుడు బహిరంగంగా ఆడుతున్నవారు జిల్లావాసులే. 13 ముక్కల రమ్మీ అయితే ఓకే అంటారు. మూడు ముక్కలాట, లోన, బయట తప్పు అంటారు. రమ్మీ ఆడినా, కేసు మాత్రం కోత ముక్కగా పెడతారు. మద్యపానం లాగ పేకాటను కూడా చట్టబద్ధం చేయడం, లేదూ అంటే పూర్తిగా నిషేదించడం ఒక్కటే ప్రభుత్వం ముందున్న మార్గం. పేకాట, జూదాలకు జయసూర్య ప్రోత్సహిస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీతో, ఆ తర్వాత డీజీపీతో పవన్‌కల్యాణ్ మాట్లాడారు. వెంటనే పేకాట ఆడటం పెద్ద నేరం కాదని ట్రిపుల్ ఆర్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీనిమీద సహజంగానే జనసైనికులు మండిపడుతున్నారు.
హోంశాఖపై కన్నుపడి0దా?
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కన్ను హోంశాఖపై పడిరదా? అంటే అవుననేవారే ఎక్కువమంది ఉన్నారు. అప్పుడప్పుడు హోంశాఖ వైఫల్యాలను పవన్‌కల్యాణ్ ఎత్తిచూపుతున్నారు. గతంలో సోషల్ మీడియాలో కొందరు పెట్టిన పోస్టులు తన కుమార్తెలు బాధపడేలా చేశాయని ఆవేశంగా మాట్లాడటమే కాకుండా, నేను హోంశాఖను తీసుకొని ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని వ్యాఖ్యానించారు. దీనికి ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురం వేదికైంది. సరిగ్గా ఆ తర్వాత రోజు నుంచే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, హోం మంత్రికి, పవన్‌కు, లోకేష్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారిపై కేసులు నమోదు చేయడం మొదలైంది. పేరుకు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వద్ద ఉంది కానీ, పగ్గాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంటాయని అందరీకీ తెలుసు. గత ప్రభుత్వంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళా హోంమంత్రి అన్నప్పుడు ఇదే పరిస్థితి. అప్పుడప్పుడు ముఖ్యమంత్రి ఆదేశించడం, తర్వాత హోంమంత్రి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించడం పరిపాటైంది. ముఖ్యమంత్రి చెబితే గాని అడుగేసే పరిస్థితి హోంమంత్రికి లేదు. గుడ్లూరు మండలం లక్ష్మీనాయుడు హత్య తర్వాత సీఎం చెబితే గానీ హోంమంత్రి స్పందించకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యపై ఉపముఖ్యమంత్రికి ఫిర్యాదులందాయి. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో జూదం, పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నట్టు పవన్‌కల్యాణ్ డీజీపీతో చెప్పారు. విచారించి నివేదిక ఇవ్వాలని కోరారు. ఇవన్నీ చూస్తుంటే.. హోంశాఖపై ఉపముఖ్యమంత్రి కన్ను పడిరదనే చర్చ కూడా మొదలైంది. ఈ వివాదంలో ఆసక్తికరమైన అంశమేమిటంటే.. హోం శాఖకు సంబంధించిన ఫిర్యాదులు వంగలపూడి అనితకు ఎందుకు రాలేదు. అంటే.. హోంమంత్రి పనితీరుపై ప్రజలకు నమ్మకం లేదా? లేదూ అంటే.. కూటమి ప్రభుత్వంలోని అంతర్గత రాజకీయమా? కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొత్తలో పిఠాపురం నుంచి చేసిన వ్యాఖ్యలతో పాటు తిరుపతిలో ఒక ప్రాంతంలో నివాసముంటున్న ఒక మహిళ పవన్‌కల్యాణ్‌కు లేఖ రాస్తూ, తమ ఏరియాలో ముగ్గురు యువకులు నిత్యం తనను వేధిస్తున్నారని, వారిని కట్టడి చేయాలని పేర్కొన్నారు. దీనిపై అలర్టయిన పవన్‌కల్యాణ్ ఎస్పీకి ఫోన్ చేసి సీఐని స్పాట్‌కు పంపించారు. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇలా పోలీసు విషయం వచ్చేసరికి పవన్ కల్యాణే నేరుగా రంగంలోకి దిగుతున్నారు. వచ్చిన ఫిర్యాదును హోంమంత్రికి పంపడంలేదు. అసలిలా ఎందుకు జరుగుతుందనేదే చర్చ.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పవన్ కల్యాణ్ జనసేన పార్టీని బలోపేతం చేసుకోడానికి, కూటమి ప్రభుత్వంలో తన పాత్రను హైలెట్ చేయడానికి ఇలా ప్రవర్తిస్తున్నారని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో జనసేన కీలక పాత్ర ఉన్నా, హోం శాఖ వంటి ముఖ్యమైన శాఖ టీడీపీ చేతిలో ఉండటం వల్ల పవన్ అసంతృప్తితో ఉన్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కేవలం అనుమానాలే. ఒకవేళ పవన్‌ను సంతృప్తిపర్చడం కోసం హోంమంత్రిని మార్చాల్సివస్తే వేరే వ్యక్తికి ఇస్తారు తప్ప, పవన్ కల్యాణ్‌కు ఈ పోస్టును చంద్రబాబు ఇవ్వరు. ఎందుకంటే రాజకీయం ఎవరితో నడపాలో చంద్రబాబుకు తెలిసినంతగా వేరే వ్యక్తికి తెలియదు.










Comments