ఎట్టకేలకు ఖలిస్థానీ సంస్థలపై కెనడా కొరడా
- DV RAMANA

- Oct 9, 2025
- 2 min read

ఎట్టకేలకు కెనడా కళ్లు తెరిచింది. ప్రభుత్వం మారిన తర్వాతే కెనడా గెడ్డపై దశాబ్దాలుగా పాతుకుపోయి ఇండియాలో ఖలిస్థానీ తీవ్రవాదానికి ఊపిరులూదుతున్న ముష్కర ముఠాల గుట్టు బయటపడిరది. వాస్తవానికి ఇదేమీ కొత్త సమస్య కాదు. రహస్యంగా సాగుతున్న కార్యకలాపాలు అంతకంటే కాదు. ఖలిస్థానీవాదులు కెనడాను అడ్డాగా మార్చుకుని బహిరంగంగానే భారత వ్యతిరేక చర్యలకు ఒగిగడుతున్నారు. భారత్ ఎంతగా నిరసనలు వ్యక్తం చేసినా.. పట్టించుకోకుండా దశాబ్దాలుగా ఉపేక్షించిన కెనడా ఎట్టకేలకు కొత్త ప్రధాని మార్క్ కెయిర్న్ వచ్చాక ఈ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో ఆ దేశ ఆర్థిక శాఖ విడుదల చేసిన ఒక నివేదికలో ఖలిస్థాన్‌తోపాటు పలు ఉగ్రవాద సంస్థలకు కెనడా నుంచే వివిధ రూపాల్లో నిధులు మరలుతున్నట్లు పేర్కొనడంతో కొత్త ప్రభుత్వం ఉలిక్కిపడిరది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ దేశంలో పాతుకుపోయిన ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థల ఆర్థిక మూలాలపై కెనడా నిఘా సంస్థలు దృష్టి సారించి కఠినంగా వ్యవహరిస్తున్నాయి. సిక్స్ ఫర్ జస్టిస్, బబ్బర్‌ఖల్సా ఇంటర్నేషనల్, వరల్డ్ సిక్ ఆర్గనైజేషన్ వంటి ఖలిస్థానీ అనుకూల సంస్థలు కెనడాలో స్థిరపడిన సిక్కుల సంక్షేమానికి పని చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. ఆ ముసుగులో ప్రత్యేక ఖలిస్థాన్ డిమాండ్‌ను ప్రచారం చేస్తున్నాయి. సేవ పేరుతోనే నిధులు సేకరిస్తూ వాటిని భారత్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఉగ్ర కార్యకలాపాలకు మళ్లిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కెనడా దేశంలోని బ్రిటీష్ కొలంబియా, ఒంటారియో తదితర ప్రావిన్సుల్లో పంజాబ్ నుంచి వెళ్లి స్థిరపడిన సిక్కు జనాభా అధికంగా ఉంది. కెనడా జనాభాలో రెండు శాతం వరకు ఉన్న వీరు అక్కడి రాజకీయాల్లోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతూ ప్రభుత్వాల్లోనూ భాగస్వాములవుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. దీన్నే అవకాశంగా తీసుకున్న బబ్బర్‌ఖల్సా, సిక్స్ ఫర్ జస్టిస్ వంటి అతివాద సిక్కు సంస్థలు చాప కింద నీరులా ఖలిస్థానీవాదాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. పంజాబ్‌ను భారత్ నుంచి విడదీసి ప్రత్యేక ఖలిస్థాన్ దేశం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ స్వాతంత్య్రానికి ముందు నుంచీ ఉంది. 1980 దశకంలో ఈ డిమాండ్‌తో సాగిన ఉద్యమం పూర్తి హింసాత్మకంగా మారింది. దానికి నాయకత్వం వహించిన సంత్ జర్నాయిల్ సింగ్ బింద్రన్‌వాలేతో సహా సిక్కు అతివాద ముఠాలన్నింటినీ స్వర్ణదేవాలయంలో 1983లో నిర్వహించిన ఆపరేషన్ బ్లూస్టార్ ద్వారా భారత సైన్యం మట్టుబెట్టింది. దాంతో పంజాబ్ శాంతి నెలకొంది. అయితే అతివాద సంస్థలకు చెందిన పలువురు కెనడాకు పారిపోయి తలదాచుకున్నారు. వారి ద్వారా అక్కడ నెమ్మదిగా ఖలిస్థానీవాదం మళ్లీ తలెత్తడం మొదలైంది. కెనడా గడ్డపైనే ఖలిస్థానీ తీవ్రవాదులు 1985లో ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చివేసి 329 మంది ప్రయాణికులు మరణానికి కారణమయ్యారు. ఆ తర్వాత కూడా అక్కడి భారతీయ సంస్థలు, హిందూ దేవాలయాలు, గాంధీ విగ్రహాలు, ప్రముఖ వ్యక్తులపై సిక్కు తీవ్రవాదులు దాడులకు పాల్పడుతూ వచ్చారు. ఇక ఈ ఏడాది మొదటి వరకు అక్కడ ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడో అయితే ఖలిస్థానీ ఉగ్రవాదులనే వెనకేసుకొస్తూ భారత్‌ను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నించారు. దీనివల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు కూడా దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో అక్కడ కొలువుదీరిన కొత్త ప్రభుత్వం వాస్తవాలను గ్రహించి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆర్థిక శాఖ నివేదికను పరిగణనలోకి తీసుకుని ఉగ్రవాద నెట్‌వర్క్‌లను కూకటివేళ్లతో పెకిలించేందుకు చర్యలు తీసుకుంటోంది. అసెస్‌మెంట్ ఆఫ్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిస్క్స్ ఇన్ కెనడా`2025’ పేరుతో రూపొందించిన నివేదికలో దిగ్భ్రాంతికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఖలిస్థానీ అతివాద సంస్థలతో పాటు హమాస్, హిజ్‌బుల్లా వంటి అంతర్జాతీయ ముస్లిం ఉగ్ర సంస్థలు కూడా కెనడాలోని వ్యక్తులు, సేవా సంస్థల ద్వారా ఆర్థిక సాయం పొందుతున్నాయని ఇందులో పేర్కొన్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు తమకు అందే విరాళాల్లో కొంత వాటాను ఉగ్రవాద సంబంధిత కార్యక్రమాలకు మళ్లిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక రేడియో స్టేషన్ అధిపతి మణీందర్ దీనిపై ప్రధాని మార్క్ కార్నీ సహా పలువురు ప్రముఖ నాయకులకు రాసిన లేఖల్లో గత ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కారంలో విఫలమయ్యాయని ఆరోపించారు. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ మాజీ నేత తల్వీందర్ సింగ్ పర్మర్ కుమారుడు నురిందర్ సింగ్ పర్మర్ కేసు దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అతడు తన గుర్తింపును దాచిపెట్టి కెనడాలోని ఓ సేవా సంస్థలో పనిచేస్తున్నట్టు విచారణలో తేలింది. ఇతనికి కూడా ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నట్లు ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం సేవా సంస్థలకు అందే నిధులు, వాటి వినియోగంపై నిఘా పెట్టాలని యోచిస్తోంది. మరోవైపు భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను కెనడా ఉగ్ర సంస్థగా గుర్తించింది. ఖలిస్థానీ వేర్పాటువాదులకు తమ దేశం నుంచే ఆర్థిక సహాయం అందుతోందని కెనడా తొలిసారిగా అంగీకరించడం విశేషం. ఇది భవిష్యత్తులో కెనడా-భారత్‌ల మధ్య భద్రతా సహకారానికి, ఉగ్రవాద నిధులకు అడ్డుకట్ట వేయడానికి మార్గం సుగమం చేసే అవకాశం ఉంది. సేవా సంస్థల ముసుగులో ఉన్న ఉన్న ఉగ్ర ఆర్థిక లింకులను తెగ్గొడితేనే ఫలితం దక్కుతుంది.










Comments