ట్రంప్ తాటాకు చప్పుళ్లుI పిచాయ్ భారతీయత!
- DV RAMANA

- Sep 19, 2025
- 2 min read

తన మాట వినని.. తన గుప్పిట్లో ఇమడని దేశాలపై కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు ద్వారా వాణిజ్య యుద్ధం చేస్తున్నారు. తన దారిలోకి రాకపోతే మరింతగా సుంకాలు పెంచుకుంటూపోతామని బెదిరించడంతోపాటు ఇతరత్రా ఉన్న అన్ని మార్గాల్లోనూ భారత్ వంటి కొరుకుడుపడని దేశాలను ఏదో విధంగా తన దారిలోకి తెచ్చుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. తనలాగే భారత్‌పై సుంకాల భారం మోపమని తన పంచన ఉన్న ఈయూ, నాటో కూటమి దేశాలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాకుండా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించవద్దని, భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకోవద్దని గూగుల్, మెటా, తదితర అమెరికన్ కంపెనీలను హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయంలో ట్రంప్ మహాశయుడికి గూగుల్ సీఈవో నుంచి చెంపపెట్టులాంటి తిరస్కారం ఎదురైంది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రవాస భారతీయుడన్నది తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవల జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ట్రంప్ సుందర్ పిచాయ్‌ని ఉద్దేశించి ‘గూగుల్ అమెరికా కంపెనీయా? భారతీయ కంపెనీయా?? అని ప్రశ్నించారు. భారతదేశం సాంకేతికత, ప్రజాస్వామ్యం, ఆర్థిక వృద్ధి గురించి గొప్పగా చెప్పుకుంటోంది. కానీ అమెరికన్ సంస్థలు, అమెరికన్ వ్యవస్థలు లేకుండా ఆ దేశంలో ఈ పురోగతి సాధ్యమవుతుందా? అంటూ ప్రపంచ వేదికపై భారత్‌ను ఎగతాళి చేసి చిన్నబుచ్చడానికి ప్రయత్నించారు. అ సదస్సులో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విదేశాంగ మంత్రి జైశంకర్ పక్కనే సుందర్ పిచాయ్ కూర్చున్నారు. కాసేపు నిశ్శబ్దంగా ట్రంప్ ప్రసంగాన్ని విన్న పిచాయ్ మంత్రి జైశంకర్ వైపు ‘ఏం చేద్దాం’ అన్నట్లు చూశారు. ఆయన కనుసైగలను అర్థం చేసుకుని వెంటనే లేచి మాట్లాడటం ప్రారంభించారు. ఆయన మాటల్లో వినయం ఉట్టిపడినా.. దానికి మించిన సంకల్పం, కాఠిన్యం స్పష్టంగా కనిపించాయి. పిచాయ్ తన ప్రసంగాన్ని మొదలుపెడుతూ.. ‘అయ్యా నేను భారతదేశంలో పుట్టాను. నా దేశమే నాకు విద్య ఇచ్చింది, విలువలు నేర్పింది. భారతీయ ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, భారతీయ కుటుంబాలు చేసిన త్యాగమే నా ప్రయాణానికి పునాది. జ్ఞానానికి, సాంకేతికతకు పాస్‌పోర్టు ఉండదు. నేను అమెరికాకు సేవ చేయడంలేదు. మానవాళికి చేస్తున్నాను’ అని ధీటుగా సమాధానమిస్తూ బెదరింపులకు తలొగ్గేది లేదని చెప్పకనే చెప్పేశారు. చాలా ప్రశాంతంగా.. అదే సమయంలో శక్తివంతంగా పిచాయ్ చేసిన ప్రసంగం అంతర్జాతీయ వేదికపై ప్రకంపనలు సృష్టించింది. ఆమెరికా అధ్యక్షుడినే అవాక్కయ్యేలా చేసిన ఈ ప్రసంగానికి పలుమారు చప్పట్లతో సభాసదులు హర్షామోదాలు ప్రకటించడం విశేషం. కొద్దిసేపటి తర్వాత ప్రసంగించి జైశంకర్ ‘సహకారం బలహీనత కాదు, అది బలం’ అని చెప్పి భారతదేశ గౌరవాన్ని ఇనుమడిరపజేశారు. ఆయన ప్రసంగానికి సభ మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. అయితే రెండో రోజు కూడా ట్రంప్ అధికార మదంతో మళ్లీ భారత్‌ను బెదిరించడానికి ప్రయత్నించారు. ‘భారతదేశం అమెరికా నిబంధనలను ఉల్లంఘిస్తే వాణిజ్య ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గూగుల్ అమెరికాతోనా లేక భారతదేశంతోనా?’’ అని సుందర్ పిచాయ్‌ని నేరుగా ప్రశ్నించారు. కొద్దిసేపు మౌనం వహించిన పిచాయ్ తర్వాత స్పందిస్తూ ‘అమెరికా నాకు అవకాశాలు ఇచ్చింది.. భారతదేశం నాకు మూలాలను ఇచ్చింది. నేను ఒకదాన్ని గౌరవించడానికి మరొకటి వదులుకోవాల్సిన అవసరం లేదు. నేను రెండు దేశాలకు సేవ చేస్తాను. అందరికీ సేవ చేస్తాను’ అని స్థిరగంభీరంగా స్పష్టం చేశారు. మరోమారు చప్పట్ల రూపంలో ప్రశంసలు అందుకున్నారు. సదస్సు చివరి రోజు ట్రంప్ మరింతగా బయటపడ్డారు. ‘భారతదేశం ఈ రాత్రిలోగా అమెరికాకు తన మార్కెట్‌ను పూర్తిగా తెరవాలి. లేకపోతే ఆంక్షలు ఎదుర్కోకతప్పదు. గూగుల్ అమెరికాతోనా లేక భారతదేశంతోనా అనేది ఇప్పుడే చెప్పాలి’ అని హెచ్చరించారు. కానీ పిచాయ్ ఏమాత్రం తొణక్కుండా సమాధానం ఇచ్చారు. ‘బెదిరింపులకు, ఒత్తిళ్లకు లొంగిపోవడానికి నేను భయపడను. గౌరవానికి మాత్రమే లొంగిపోతాను’.. అని దృఢంగా చెప్పారు. సుందర్ పిచాయ్ మానసిక దృఢత్వం, ట్రంప్‌ను ఆయన ఎదుర్కొన్న తీరు కోట్లాది భారతీయ యువతలో ఆత్మవిశ్వాసాన్ని మరియు గర్వాన్ని ప్రోది చేస్తాయనడంలో సందేహం లేదు. ఈ సంఘటన ప్రపంచంలో ఎక్కడైనా అధికారం కంటే నైతిక సూత్రాలే బలమైనవని గట్టిగా చాటి చెప్పింది.










Comments