top of page

ఎన్డీయే చూరుకు ఈ20 మంటలు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 2 min read

ఇథనాల్ మంటలు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయా? ఈ20 పెట్రోల్ వద్దు మొర్రో అంటున్నా వినిపించుకోకుండా కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ఇథనాల్ ప్రయోగాలతోనే ముందుకుకెళ్తున్న ఎన్డీయే ప్రభుత్వంపై ఆ కూటమి మద్దతుదారులే అసంతృప్తితో రగిలిపోతున్నారా?? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నది సీ`ఓటర్ అనే సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే నివేదిక. ప్రస్తుతం దేశంలో విక్రయిస్తున్న ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోలుపై ప్రజలు వ్యక్తం చేస్తున్న రకరకాల అభిప్రాయాలు, విశ్లేషణలు.. ఈ20 వల్ల వాహనాలకు నష్టం వాటిల్లుతున్నదని వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వవర్గాలే భిన్న వివరణలు ఇస్తున్న నేపథ్యంలో అసలు క్షేత్రస్థాయిలో ఈ20 పెట్రోల్‌పై ప్రజాభిప్రాయం ఎలా ఉందన్నది తెలుసుకునేందుకు ఎన్నికల సర్వేలు నిర్వహించడంలో పేరెన్నికగన్న సీ`ఓటరు సంస్థ ప్రత్యేక సర్వే నిర్వహించింది. ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకునే నెపంతో ప్రజల ప్రయోజనాలను పట్టించుకోకుండా కేంద్ర ఏకపక్షంగా ఇథనాల్ పెట్రోల్ అమ్మకాలు ప్రారంభించడం, ప్యూర్ పెట్రోల్ అందుబాటులో లేకుండా చేయడంపై దేశప్రజలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారని తేటతెల్లమైంది. ఈ సర్వే ప్రకారం సర్వేలో పాల్గొన్నవారిలో 55.1 శాతం మంది ఈ20 పెట్రోల్‌ను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఇందులో మరో విశేషమేంటంటే.. వ్యతిరేకించిన వారిలో 51.20 శాతం మంది ఎన్డీయే మద్దతుదారులే ఉండగా, ప్రతిపక్షాల మద్దతుదారులు 55.4 శాతం ఉన్నారని వెల్లడైంది. మంచైనా చెడైనా తమ ప్రభుత్వ విధానాలను బహిరంగంగా వ్యతిరేకించడానికి ఆయా పార్టీల అభిమానులు ఇష్టపడరు. కానీ దానికి విరుద్ధంగా ఎన్డీయే మద్దతుదారులే ఈ20 పెట్రోల్‌ను వ్యతిరేకించడం కంటే పెద్ద ప్రజాభిప్రాయం ఇంకేమీ ఉండదేమో! ఇక 18.1 శాతం మందే కొత్త ఇంధన వినియోగానికి అభ్యంతరం లేదని చెప్పగా 29.5 శాతం మంది దీనిపై కచ్చితమైన అభిప్రాయాన్ని చెప్పలేకపోయారు. కాగా దీనిపై ప్రభుత్వ వర్గాల నుంచి భిన్న వివరణలు రావడం ప్రజల్లో ప్రభుత్వాన్ని మరింత పలుచన చేసింది. ఈ20 పెట్రోల్ వాడకాన్ని తప్పనిసరి చేయడంపై ప్రజల్లో రేగుతున్న ఆందోళనలు, దాన్ని వినియోగించడం వల్ల తమ వాహనాలు దెబ్బతిన్నాయంటూ అనేకమంది సోషల్ మీడియాలో వీడియోలతో సహా అసంతృప్తి వ్యక్తం చేయడంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వినియోగం వల్ల వాహనాల మైలేజీ ఐదు శాతం వరకు తగ్గుతుంది అంగీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే వాహనాలు దెబ్బతింటాన్న వాదనను తిరస్కరించింది. ఈ విషయాన్ని ఆటోమొబైల్ కంపెనీలు ధ్రువీకరించలేదని చెప్పుకొచ్చింది. మరోవైపు ఇథనాల్ పెట్రోల్ విషయంలో మొదటినుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాత్రం ఇప్పటికీ పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని సమర్థించుకొస్తున్నారు. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, ఈ ఇంధనం వల్ల నష్టపోయిన ఒక్క వ్యక్తినైనా చూపించండి అని సవాల్ చేస్తున్నారు. తద్వారా సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల్లో ఇథనాల్ పెట్రోల్ వల్ల నష్టం గురించి వస్తున్న వార్తలు, వీడియోలను ఆయన పట్టించుకోవడంలేదని అర్థమవుతోంది. అంతేకాకుండా ఇదే అంశంపై ఒక మహిళా జర్నలిస్టు నిర్వహించిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న గడ్కరీ ఇదే వైఖరి కనబర్చారు. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వల్ల తన కారు మైలేజీ కూడా దారుణంగా పడిపోయిందని ఆమె ప్రస్తావించగా, ఎవరికివారు ఏదో స్పీడో మీటరు చూసి మైలేజీ నిర్ణయించడం సరైన విధానం కాదని, ఆటోమొబైల్ అధీకృత డీలరు వద్దే తగిన పరికరాలు, పద్ధతులతో మైలేజీ టెస్ట్ చేయాల్సి ఉంటుందంటూ ఆమెకే చిన్నపాటి క్లాస్ పీకారు. కాగా నష్టపోయిన వారిని చూపించాలంటూ గడ్కరీ విసిరిన సవాల్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా కొందరు స్పందించారు. ఈ20 పెట్రోల్ వాడిన ఆరుగురు వాహనదారులను గడ్కరీ వద్దకు తీసుకెళ్లడానికి సిద్ధమని ప్రకటించారు. ఇలాంటి వాదోపవాదాల నడుమ సీ ఓటరు సంస్థ సర్వే నిర్వహించింది. జూలై 8`9 తేదీల్లో నిర్వహించిన ఈ సర్వేలో కంప్యూటర్, టెలిఫోన్ ఇంటర్వ్యూల ద్వారా దేశావ్యాప్తంగా 1641 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ20 వల్ల వాహనాల మైలేజీ తగ్గిపోతుందని 52.8 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. కాగా వాహనాల ఇంజిన్ భాగాలు దెబ్బతింటాయని 54.2 శాతం మంది అభిప్రాయపడ్డారు. కొత్త వాహనాల వరకు ఫర్వాలేదు కానీ ఇప్పటికే రోడ్లపై ఉన్న కోట్లాది పాత వాహనాల పరిస్థితి ఏమిటని, ప్రభుత్వ నిర్ణయం వల్ల వాటి యజమానులకు అన్యాయం చేయడమే అవుతుందని 56.3 శాతం మంది తేల్చిచెప్పారు. ఈ20 పెట్రోల్ అమ్మకాలు ప్రారంభించినా.. ప్యూర్ పెట్రోల్ అందుబాటులో లేకుండా చేయడం వినియోగదారులకు తమకు నచ్చిన ఇంధనాన్ని ఎంచుకునే స్వేచ్ఛ లేకుండా చేయడమేనని ఎక్కువమంది విమర్శిస్తున్నారు. అందువల్ల ఈ20తో పాటు సాధారణ పెట్రోల్ కూడా బంకుల్లో అందుబాటులో ఉంచాలని అత్యధికంగా 75.9 శాతం మంది కోరుకుంటున్నారు. తన ఖర్చులను తగ్గించుకోవడానికి పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండ్ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుండటాన్ని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు ఇథనాల్ కలిపిన పెట్రోల్ ధర ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నిస్తూ, ఇది ప్రజలకు అన్యాయం చేయడం కాదా? అని 74.5 శాతం మంది నిలదీస్తున్నారు. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఈ20 పెట్రోలులో 20 శాతం(ఒక వంతు) ఇథనాల్ ఉంటే 80 శాతం(నాలుగు వంతులు) మాత్రమే పెట్రోల్ ఉంటుంది. ఆ మేరకు ఈ20 పెట్రోల్ ధర తగ్గించాల్సి ఉంది. కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్యూర్ పెట్రోల్ ధరకే ఈ20 పెట్రోల్ అమ్ముతుండటం ప్రజలను మోసం చేయడమేనని అంటున్నారు. మరోవైపు ఈ20 పెట్రోల్ ధర తగ్గించినా కూడా దాన్ని వినియోగించేది లేదని 40.4 శాతం మంది తిరస్కరిస్తున్నారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page