ఎన్నికలు మున్సిపాలిటీకి.. కార్పొరేషన్లకు కాదు!
- NVS PRASAD
- 1 day ago
- 1 min read
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

రాష్ట్రవ్యాప్తంగా విలీన గ్రామాల సమస్యలు, కోర్టు కేసుల వల్ల ఎన్నికలు కాకుండా మిగిలిపోయిన 21 మున్సిపాలిటీలకు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ బుధవారం ప్రకటించిన తర్వాత శ్రీకాకుళం నగరంలో పండగ వాతావరణం నెలకొంది. వాస్తవానికి మంత్రి నారాయణ ప్రకటించింది కేవలం మున్సిపాలిటీ ఎన్నికల కోసం మాత్రమేనని గుర్తించాలి. రాష్ట్రవ్యాప్తంగా 21 మున్సిపాలిటీల్లోను, మూడు నగర కార్పొరేషన్లలోను నగర పంచాయతీలను విలీనం చేయడం వల్ల కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇందులో మున్సిపాలిటీల వరకు 15వ ఆర్ధిక సంఘం నిధులు లేక అభివృద్ధి నిలిచిపోతుందని, ఇందుకు సంబంధించి కోర్టు కేసులు కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు నారాయణ ప్రకటించారు. ప్రభుత్వం తలచుకుంటే ఇది పెద్ద విషయం కాదు. కానీ కార్పొరేషన్ల విషయానికి వస్తే వీటిలో సమీప పంచాయతీలను కలిపి గత వైకాపా ప్రభుత్వం కరోనా సమయంలో ఆర్డినెన్స్ తీసుకువచ్చి, అక్కడికి 60 రోజుల తేడాలోనే చట్టాన్ని చేసింది. తమ పంచాయతీలు కార్పొరేషన్‌లో కలపడం అనైతికమంటూ ఓవైపు కోర్టులో కేసులు నడుస్తుండగానే విలీన పంచాయతీలతో కలిపి కార్పొరేషన్ ఏర్పడినట్టు వైకాపా చట్టం తెచ్చింది. అందులో భాగంగానే రాష్ట్రంలో మూడు నగర కార్పొరేషన్లకు ఎన్నికలు నిలిచిపోయాయి. శ్రీకాకుళంలో అయితే 2010 తర్వాత ఇంతవరకు స్థానిక ఎన్నిక జరగలేదు. ఈలోగా 2014లో టీడీపీ ప్రభుత్వం, 2019లో వైకాపా అధికారంలోకి వచ్చి వార్డుల పునర్విభజన, డివిజన్ల సంఖ్య మార్పు, రోస్టర్‌ను సిద్ధం చేసింది తప్ప కోర్టులో కేసులను మాత్రం విత్‌డ్రా చేయించలేకపోయింది. ఏడు విలీన పంచాయతీలతో కలిపి కార్పొరేషన్‌కు ఎన్నికల నిర్వహించడమే గత ప్రభుత్వ స్టాండ్‌గా ఉండేది. అందుకే కోర్టు కేసు తేలాక ఏడు పంచాయతీలతో కూడిన కార్పొరేషన్‌కు ఎన్నికలు పెట్టాలని భావిస్తూవచ్చింది. తెలుగుదేశం మాత్రం పంచాయతీలను విడగొట్టి పాత పద్ధతిలోనే ఎన్నికలు జరపాలని చూస్తుంది. కాకపోతే ఇందుకు వైకాపా చేసిన చట్టం అడ్డొస్తుంది. మరోవైపు ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన తోటపాలెం, కుశాలపురం పంచాయతీలను శ్రీకాకుళం నగర కార్పొరేషన్ నుంచి విడగొట్టాలంటూ ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్ ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఇందుకు సంబంధించి కేబినెట్ తీర్మానం మాత్రమే పెండిరగ్‌లో ఉంది. ఇది పూర్తయితే ఐదు విలీన పంచాయతీలతో ఎన్నికలకు వెళ్లాల్సివుంటుంది. విజయవాడలో ఎన్‌ఈఆర్ పని పూర్తయితే శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్న ఐదు పంచాయతీల టీడీపీ నేతలు మంత్రి నారాయణను కలవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి చట్టం చేసిన స్థానిక సంస్థలైన నగర కార్పొరేషన్లకు కూడా మూడు నెలల్లో ఎన్నికలు జరుపుతామని నారాయణ ఎక్కడా ప్రకటించలేకపోయారు.
Comments