ఎన్నికల సంఘం నిబద్ధత ప్రశ్నార్థకం!
- DV RAMANA

- Aug 19, 2025
- 2 min read

ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థ. నేరుగా రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతికే జవాబుదారీగా ఉంటూ పారదర్శకంగా పని చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా దాన్ని నియంత్రించే లేదా శాసించే అధికారాలు లేవు. రాగద్వేషాలకు అతీతంగా, పక్షపాతరహితంగా ఓటర్ల జాబితాల మార్పులు చేర్పులు, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజా ప్రభుత్వాల ఏర్పాటుకు బాటలు వేయడం ఎన్నికల సంఘానికి రాజ్యాంగం అప్పగించిన ప్రధాన బాధ్యతలు. వాటిలో ఒకటైన ఓటర్ల జాబితాల్లో మార్పులపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ఎన్నికల సంఘానిదే. కానీ ప్రతిపక్షం ఓటర్ల జాబితాల్లో అక్రమ తొలగింపులు జరిగాయని కొన్ని ఉదాహరణ లతో ఆరోపిస్తూంటే.. ఎన్నికల సంఘం పట్టించుకోకపోగా వాటిని రుజువు చేయాలని తిరిగి ప్రతి పక్షాన్నే దబాయిస్తుండటం ఆ వ్యవస్థ విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేస్తోంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ చేసిన, చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలపై మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేష్‌కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం స్పందించిన తీరు ఒక సాధారణ ప్రభుత్వ సంస్థను తలపించింది. ప్రభుత్వం తరఫున వారు మాట్లాడుతున్న భావన కలి గించాయి. ఓట్ల చోరీ జరిగిందన్న ఆరోపణలకు మద్దతుగా ఏడు రోజుల్లోగా రాహుల్‌గాంధీ అఫిడ విట్ దాఖలు చేయడమో లేదా క్షమాపణ చెప్పడమో చేయాలని సీఈసీ జ్ఞానేష్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆ ఆరోపణలను నిరాధారమైనవిగా భావించి రాహుల్ గాంధీపై తదుపరి చర్యలు చేపడ తామని హెచ్చరించారు. ఈ ప్రతిస్పందన పారదర్శకతను, చర్చలను ప్రోత్సహించే బదులు ఒక ప్రతి కూల వాతావరణాన్ని సృష్టించింది. విమర్శలకు అతీతమైన సంస్థగా కాకుండా దాడికి గురైన ఒక ప్రభుత్వ శాఖ మాదిరిగా ఎన్నికల సంఘం ప్రవర్తించింది. ఇది ఆ సంస్థపై వచ్చిన ఆరోపణల కంటే ఎక్కువగా దానిపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఈ బహిరంగ ఘర్షణ ఎన్నికల వ్యవస్థ పునాదులనే ప్రశ్నించే స్థాయికి చేరింది. ఈ ఆరోపణల వెనుక ఉన్న అసలు సమస్య ఓటర్ల జాబితాల నిర్వహణలో ఉన్న తీవ్రమైన వ్యవస్థాగత లోపాలు. బీహార్‌లో చేపట్టిన ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) డ్రైవ్ దీనికి ఒక ఉదాహరణ. ఈ డ్రైవ్‌లో సుమారు 65 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. ఎన్నికల సంఘం దీన్ని జాబితా శుద్ధీకరణగా చెబుతున్నప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో తొలగించడం, ఆ వివ రాలు గుట్టుగా ఉంచడం అనుమానాలకు దారితీశాయి. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తొల గించిన ప్రతి పేరుకు కారణంతో సహా పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశించాల్సి వచ్చింది. పాట్నాలో బూత్ స్థాయి అధికారుల (బీఎల్‌వోస్) పనితీరుపై జరిగిన పరిశీలనలు కూడా ఈ అనుమానాలను పెంచాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై కొనసాగుతున్న వివాదం వీటిని మరింత బలపరుస్తోంది. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నా ప్రజల సందేహాలను నివృత్తి చేయడంలో ఎన్నికల సంఘం విఫలమైంది. పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన ఓటరు-ధ్రువీకరించిన పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్) వ్యవస్థ కూడా వివాదాన్ని పరిష్కరించలేదు. ఇప్పుడు వీవీ ప్యాట్ స్లిప్పులను ఎంత మేరకు లెక్కించాలనే దానిపై కొత్త చర్చ మొదలైంది. కేవలం ఒక చిన్న నమూనాను మాత్రమే లెక్కించడానికి ఎన్నికల సంఘం పరిమితం కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఈవీఎంలను సమర్థిస్తున్నవారు కూడా ప్రజల నమ్మ కాన్ని నిలబెట్టడానికి వీవీప్యాట్ లెక్కింపు పరిమాణాన్ని పెంచాలని సూచిస్తున్నారు. ఓడిపోయిన పార్టీ లు ఎన్నికల ప్రక్రియను ప్రశ్నించడం, గెలిచిన పార్టీలు సమర్థించడం ఒక ఆనవాయితీగా మారింది. తన పట్ల విశ్వసనీయత తగ్గిపోవడానికి ఎన్నికల సంఘం కూడా కొంతవరకు కారణం. ఓటర్ల సమా చార పరిశీలనను కష్టతరం చేయడం, తుది పోలింగ్ శాతాల వెల్లడిలో జాప్యం, విమర్శలను తనపై దాడులుగా పరిగణిస్తూ ఆత్మరక్షణ ధోరణి ప్రదర్శించడం వంటివి ఎన్నికల సంఘం నిబద్ధతపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. వీటన్నింటికీ మూల కారణం ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో ఉంది. స్వతంత్ర వ్యవస్థ అయిన ఎన్నికల సంఘాన్ని నడిపించే కమిషనర్ల నియామక ప్రక్రియ పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉండటం ప్రాథమిక స్థాయిలోనే సంస్థ నిష్పాక్షికత, స్వతం త్రతపై అనుమానాలు రేపుతోంది. ఇవి పోవాలంటే సమగ్ర సంస్కరణలు అవసరం.










Comments