ఎపుడో చెప్పెను ‘సత్యం’ పేపరు..!
- Prasad Satyam
- Nov 12, 2025
- 2 min read
అధ్యక్షుడిగా పాండ్రంకి శంకర్ రేపు ప్రమాణ స్వీకారం
నగర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్న హరి


(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగొచ్చు, జరగకపోవచ్చు. కానీ ఇప్పుడు నగర టీడీపీలో హిట్ కావాల్సిన కాంబినేషన్ మాత్రం శంకర్ ద్వయానిదే. ఎందుకంటే.. ఎన్ని కష్టాలెదురైనా, ఎన్ని అవమానాలు పలకరించినా ఎమ్మెల్యే గొండు శంకర్ తాను అనుకున్నది చేస్తానని నిరూపించారు. తన వల్ల కానిది చేయలేనని చెప్పినప్పుడు రిసీవ్ చేసుకోలేనివారే ఇప్పుడు చేస్తాను అంటే.. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా చేసిపెడతారని శంకర్‌ను కొనియాడుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ నగర టీడీపీ అధ్యక్షుడిగా పాండ్రంకి శంకర్‌ను నియమించడం. గురువారం ఉదయం ఈమేరకు టీడీపీ కార్యాలయంలో ప్రమాణస్వీకారం కూడా జరగనుంది. నగర పగ్గాలు కొత్తవారికి ఇస్తారని తేలినప్పుడు పాండ్రంకి శంకర్ మాత్రమే గొండు శంకర్ దృష్టిలో ఉన్నారని మొట్టమొదట చెప్పింది ‘సత్యమే’. ఆ తర్వాత ఈ రేసులోకి చాలామంది వచ్చారు. నేరుగా కొంతరైతే మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుల ఆశీస్సులు కూడా తమకు ఉన్నాయని, తమకే నగర అధ్యక్ష పదవి వస్తుందని భావించారు. కానీ గొండు శంకర్ మొదట్నుంచీ పాండ్రంకి శంకర్ వైపే మొగ్గు చూపారు. నగర అధ్యక్ష పదవి నిర్ణయించేది అధిష్టానమేనని బయటకు చెబుతూనే శంకర్ కుటుంబానికే ఈ పదవి దక్కాలని గట్టిగా ప్రయత్నించారు. వయసు రీత్యా లోకేష్ టీమ్‌కు శంకర్ సరిపోరని భావిస్తే, ఆయన కుమారుడు పాండ్రంకి అశోక్‌ను తెర మీదకు తీసుకురావాలని కూడా ఒకానొక సమయంలో గొండు శంకర్ భావించారు. అదే సమయంలో పాండ్రంకి శంకర్ మీద ఒక కేసు నమోదు కావడంతో, ఆయన్ను తప్పించి రేసులో ఉన్న మిగిలిన పేర్లు పరిశీలిస్తారని అంతా భావించారు. అందులో భాగంగానే పోలీసు కేసు నమోదయ్యేటట్టు సొంత పార్టీవారే చేశారన్న ప్రచారం కూడా ఉంది. ఈ విషయాన్ని పక్కన పెడితే, ఆ సమయంలో కూడా గొండు శంకర్ పాండ్రంకి శంకర్‌కే నగర పగ్గాలు అప్పజెబుతారని ‘సత్యం’ మరో కథనం ప్రచురించింది. మరోవైపు శ్రీకాకుళం మండలం, గారకు అధ్యక్షులు ఖరారైనా నగరాధ్యక్షుడి పేరు ప్రకటించకపోవడంతో శంకర్‌ను తప్పించారన్న ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవం కాదని ఇప్పుడు తేలింది. ఈ నెల 15 లోపు అన్ని కమిటీలు పూర్తి చేయాలన్న డెడ్‌లైన్ మేరకు గురువారం ప్రమాణస్వీకారానికి ఉపక్రమిస్తున్నారు. పాండ్రంకి శంకర్‌కు మించి నగరంలో నాయకత్వం లేదా.. అంటే? కచ్చితంగా ఉంది. కాకపోతే నమ్మినవారికి తాను అండగా ఉంటానని ప్రకటించుకోడానికి ఎమ్మెల్యే శంకర్‌కు ఇంతకు మించిన అవకాశం మరోసారి రాకపోవచ్చు. గుండ కుటుంబంతో విభేదించి గొండు శంకర్ ఒంటరిగా తిరుగుతున్నప్పుడు నగరం నుంచి వచ్చిన ముగ్గురిలో ఒకరు పాండ్రంకి శంకర్. అంబటి లక్ష్మీరాజ్యం, పాండ్రంకి శంకర్ ఇద్దరూ కౌన్సిలర్లుగా పని చేసినవారే. దీనికి తోడు నగరంలో రెండు మేజర్ కులాలకు సంబంధించిన నేతలు. శ్రీకాకుళం నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా లక్ష్మీదేవి ఉంటుండగా, వార్డుల్లో మీరెందుకు పర్యటిస్తున్నారంటూ టీడీపీ నాయకులు అడ్డుకున్నప్పుడు ఎదురునిల్చి వార్డుల్లో తిప్పిన పాండ్రంకి శంకర్ అప్పట్నుంచీ ఇప్పటి వరకు ఎమ్మెల్యేతోనే ఉన్నారు. గొండు శంకర్‌కు మద్దతుగా ఎన్నికలకు ముందు కొందరు వచ్చినప్పటికీ, ఆ తర్వాత పరిణామాలతో మళ్లీ పాత గ్రూపుతోనే జతకట్టారు. మరికొందరు శంకర్‌తో ఉన్నట్టే ఉండి ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచారు. ఇందులో ఏ వర్గంలోనూ లేకుండా శంకర్‌కు టిక్కెట్ వస్తుందో, రాదో తెలియకపోయినా ఆయన్ను నగరంలో తిప్పిన కాపు నాయకుడు పాండ్రంకి శంకర్. తాను ఎమ్మెల్యే అయితే శంకర్‌ను కచ్చితంగా అందలం మీద ఉంచాలని ఎమ్మెల్యే భావించారు. అయితే మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకపోవడంతో ముందుగా నగర పార్టీ అధ్యక్ష పగ్గాలైనా ఇవ్వాలని భావించారు. వాస్తవానికి అరసవల్లిలో గుండ కుటుంబాన్ని కాదని శంకర్‌కు అనుకూలంగా నిలబడిన వ్యక్తులూ ఉన్నారు. శంకర్ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఆ కులం నుంచి పెద్ద స్థాయిలోనే ఒత్తిడి వచ్చింది. కానీ శంకర్ తనను నమ్ముకున్న పాండ్రంకితో వెళ్లడానికే ముందుకొచ్చారు. ఇక కార్యదర్శిగా కళింగకోమటి సామాజికవర్గానికి చెందిన కోరాడ హరిగోపాల్‌కు ఎమ్మెల్యే శంకర్ ఎప్పుడో ఓకే చేశారు. అయితే ఆయన అధ్యక్ష బాధ్యతలైతే స్వీకరిస్తానని, కార్యదర్శి లాంటి పదవుల్లో తనను ఇరికించవద్దంటూ కేంద్రమంత్రికి చెప్పుకొచ్చారు. కానీ ‘సత్యం’ మాత్రం అధ్యక్షుడిగా శంకర్, కార్యదర్శిగా హరిగోపాల్‌లు ఉంటారని ఎప్పుడో చెప్పింది.










Comments