ఎమ్మెల్యే అయినా ‘పాత’ పద్ధతులు వీడలేదు
- BAGADI NARAYANARAO

- Dec 15, 2025
- 2 min read
మామిడిపండు లాంటి నగర భూములపై కన్ను
తహసీల్దార్ ఎండార్స్‌మెంట్ కోసం పట్టు
వివాదాల జాబితా నుంచి తొలగించే ప్రయత్నం
నగరంలో ఇప్పుడిదే హాట్ టాపిక్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఆయన ప్రజాప్రతినిధిగా ఎన్నికైన నియోజకవర్గంలో కాకుండా ఆయన నివాసం ఉంటున్న శ్రీకాకుళంలో ఇటీవల కాలంలో రెండు వివాదాస్పద వ్యవహారాల్లో వేలు పెట్టినట్టు నగరంలో జోరుగా చర్చ సాగుతుంది. స్థలం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయించి, దాన్ని ఆయన స్వాధీనంలోకి తీసుకున్నట్టు ప్రచారంలో ఉంది. నగరంలోని కిమ్స్ రోడ్డులో వ్యవసాయశాఖ జిల్లా కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఫాజుల్‌బాగ్‌పేట రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 86/8,10,11,13లోని విలువైన భూమి భూవివాదాల జాబితాలో ఉంది. ఇలా ఉన్నప్పటికీ ఆ ఎమ్మెల్యే దీన్ని అగ్రిమెంట్ చేసుకున్నట్టు తెలిసింది. ఉన్నతాధికారులతో మాట్లాడి భూ వివాదాల జాబితా నుంచి దాన్ని బయటకు తీసి సొంతం చేసుకోవడానికి ఎమ్మెల్యే అనుయాయులు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ ప్రక్రియ ఒక వైపు నడుస్తుండగానే మరోవైపు ఇదే సర్వే నెంబర్‌లో ఐదు సెంట్లు స్థలానికి శ్రీకాకుళం తహసీల్దారు కార్యాలయం నుంచి మరో వ్యక్తి ఎండార్స్‌మెంట్ తీసుకున్నారు. దీని ఆధారంగా ఇదే స్థలాన్ని వేరొక వ్యక్తి కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. అంటే ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే అగ్రిమెంట్ కట్టామని ప్రచారం జరుగుతున్న భూమిలో కొంత భాగం.. అంటే ఐదు సెంట్లు వేరే వ్యక్తిపరమైపోయింది. దీంతో ఈ ఐదు సెంట్ల స్థలంలో నిర్మాణం చేయడానికి సన్నద్ధమవుతుండగా టీడీపీ ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే బంధువులకు చెందిన భూమికి ఎండార్స్‌మెంట్ ఎలా ఇస్తారని రెవెన్యూ అధికారులపై ఒత్తిడి పెంచారు. రెవెన్యూ అధికారులు టీడీపీ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించి ఎండార్స్‌మెంట్ కోసం సిఫార్సు చేసిన రెవెన్యూ యంత్రాంగానికి చీవాట్లు పెట్టి ఎండార్స్‌మెంట్‌ను రద్దు చేశారు. రద్దు చేసిన ఎండార్స్‌మెంట్ ఆధారంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌నూ రద్దు చేయించారు. రిజిస్ట్రేషన్ రద్దు చేసిన తర్వాత సర్వే నెంబర్ 86లో ఉన్న 5 సెంట్ల స్థలానికి ఎండార్స్‌మెంట్ కోసం ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే మనుషులు దరఖాస్తు చేశారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం స్పందించలేదని తెలిసింది. దీంతో ఉన్నతాధికారులను ఆశ్రయించి భూవివాదాల జాబితా నుంచి దీన్ని తొలగించాలని ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ సాగుతుంది. ఈ భూమి వివాదంలోకి వెళ్లడానికి కారణమైన ఇరువర్గాలను ఈ టీడీపీ ఎమ్మెల్యే కూర్చోబెట్టి రాజీ చేయించినట్టు తెలిసింది.
అదే మాదిరిగా 80 అడుగుల రోడ్డుకి ఆనించి పాత సర్వే నెంబర్ 496/1 (టౌన్ సర్వే నెంబర్ 414/1)లో సుమారు రూ.10కోట్లు విలువైన 16 సెంట్ల భూమిని కొట్టేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం న్యాయస్థానంలో దీనికి సంబంధించి వివాదం నడుస్తుంది. నగరానికి చెందిన కె.శ్రీనివాసరావుకు చెందిన ఈ భూమిని మధ్యేమార్గంలో రూ.10లక్షలకే దక్కించుకోవడానికి కొందరు దళారులతో మంతనాలు చేసినట్టు నగరంలో చర్చ సాగుతుంది. 2013లో ఆనందరావు కొనుగోలు చేసిన భూమిని 2023లో శ్రీనివాసరావుకు జీపీ కమ్ సేల్ రిజిస్ట్రేషన్ చేశారు. ఆ మేరకు ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి శ్రీనివాసరావు రూ.30 లక్షలు అప్పు తీసుకొని ఈ స్థలాన్ని మార్టుగేజ్ చేశారు. 2024లో ఆనందరావు తాను ఇచ్చిన జీపీని కోటబొమ్మాళి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రద్దు చేయించారు. దీంతో శ్రీనివాసరావు జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయగా, జీపీ రద్దు చెల్లదని ఉత్తర్వులు ఇస్తూ రద్దుచేసిన సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేశారు. జిల్లా రిజిస్ట్రార్ సూచనలతో శ్రీనివాసరావు 16 సెంట్ల స్థలాన్ని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీనిపై ఆనందరావు ఎదురుతిరగడంతో దిగువ కోర్టును శ్రీనివాసరావు ఆశ్రయించగా, న్యాయస్థానం పర్మినెంట్ ఇంజక్షన్ దావా ఇచ్చింది. కక్షిదారులు జిల్లా కోర్టును ఆశ్రయించగా, వారి అప్పీల్‌ను తిరస్కరించింది. దీంతో హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై ఈ నెల 23న వాయిదా ఉంది. న్యాయస్థానంలో వివాదం నడుస్తుండగానే శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు ఈ టీడీపీ ఎమ్మెల్యేను ఆశ్రయించి హైకోర్టులో కేసు గెలిచామని రూ.10 లక్షలకే స్థలం ఇచ్చేస్తామని చెప్పడంతో ఆయన అంగీకరించినట్టు తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యే వివాదాస్పద స్థలాల వ్యవహారంలో జోక్యం చేసుకోవడంపై నగరంలో సర్వత్రా చర్చ సాగుతుంది.
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రాజకీయాల్లో అడుగుపెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన ఈ టీడీపీ ఎమ్మెల్యే ఇప్పటికీ పాతపద్ధతులనే అనుసరిస్తున్నారు. కాకపోతే ఈసారి ఎమ్మెల్యే కావడంతో శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కూడా తన సెటిల్మెంట్ వ్యవహారాన్ని విస్తరించారని చెప్పుకుంటున్నారు. ప్రజాప్రతినిధిగా గెలవకముందు వివాదాస్పద స్థలాలను కొనుగోలు చేసి వినియోగదారులకు అంటగట్టిన చరిత్రా ఆయనకు ఉంది. ఆయన వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్‌లు కొనుగోలు చేసినవారు ఇప్పటికీ సదరు ప్రజా ప్రతినిధి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆ నియోజకవర్గంలో చర్చ సాగుతుంది.










Comments