top of page

ఎమ్మెల్యే ఎత్తు.. కాంట్రాక్టర్లు చిత్తు!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 2 days ago
  • 3 min read
  • కార్పొరేషన్‌లో ఇన్నాళ్లూ వారు ఆడిరదే ఆట

  • గొండు శంకర్‌ రంగ ప్రవేశంతో బెంబేలు

  • లొంగదీసుకునేందుకు సహాయ నిరాకరణ

  • ప్లాన్‌`బి అమలుతో ప్రజాప్రతినిధిపై దుష్ప్రచారం

ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

పదిహేనేళ్లకుపైగా పాలకవర్గం లేదు.. కమిషనర్లుగా వస్తున్నవారు పట్టుమని పది నెలలు కూడా ఉండటం లేదు.. ఇంజినీరింగ్‌ వ్యవస్థ మొత్తం పక్క జిల్లా నుంచి అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తుంటం.. గత ఐదేళ్లూ షాడో మేయర్‌ పెత్తనం.. తదితర పరిణామాలు ఏకంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థనే కాంట్రాక్టర్లు కబ్జా చేసే దుస్థితికి దారితీశాయి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లు ఇంజినీరింగ్‌ అధికారులతో కుమ్మక్కై కార్పొరేషన్‌ నిధులను బొక్కేస్తున్నారు. తక్కువ పనికి ఎక్కువ బిల్లులు పెట్టడం, అసంపూర్తిగా వదిలేసిన పనులను సైతం ఎం`బుక్‌లో నమోదు చేయించుకుని అప్పనంగా సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కార్పొరేషన్‌ వ్యవహారాలపై ఎమ్మెల్యే గొండు శంకర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించడం వారికి మింగుడుపడటం లేదు. ఆయన జోక్యం చేసుకుంటే తమ పప్పులుడకవన్న ఉద్దేశంతో ఏకంగా బ్లాక్‌మెయిల్‌కు తెర లేపారు. కార్పొరేషన్‌ పరిధిలో చిన్నా చితకా పనులకు టెండర్లు పిలిస్తే వాటిలో పాల్గొనకుండా సామూహికంగా బాయ్‌కట్‌ చేసి.. ఎమ్మెల్యే తమ చెప్పుచేతల్లోకి వస్తే తప్ప నగరంలో అభివృద్ధి పనులు జరగనివ్వబోమంటూ తెర వెనుక రాజకీయం చేసిన కాంట్రాక్టర్లు ఇప్పుడు ఎమ్మెల్యే ప్లాన్‌`బి అమలు చేసేసరికి పెద్ద ఎత్తున విషప్రచారం మొదలుపెట్టారు. పనుల్లో పర్సంటేజీలు అడిగారని, ఇవ్వకపోవడంతో వేరేవారికి పనులు కట్టబెట్టారంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు.

మంగుడుపడని ఎమ్మెల్యే చొరవ

వాస్తవానికి కాంట్రాక్టర్‌ వ్యవస్థ అంటేనే పర్సంటేజీలు ఇచ్చుకొని ఇంజినీరింగ్‌ అధికారులతో కుమ్మక్కై బిల్లులు తెచ్చుకోవడం. దీనికి ఎవరూ అతీతులు కారు. అటువంటి కాంట్రాక్టర్లు పీసీల గురించి మాట్లాడటమే విడ్డూరంగా ఉంది. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో అనేక పనులను ఎమ్మెల్యే వేరేవారికి కట్టబెట్టారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటం వెనుక పెద్ద కథే ఉంది. గొండు శంకర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అప్పటి కమిషనర్‌ చల్లా ఓబులేశు నేతృత్వంలో అప్పటి వరకు నగరంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులు, టెండర్ల ప్రక్రియ, బిల్లుల చెల్లింపు స్థితిగతులపై కూలంకుషంగా సమీక్షించారు. ఆ సందర్భంగా కాంట్రాక్టర్లందరూ వైకాపా హయాంలో చేసిన పనులకు చెల్లింపులు జరగలేదని ఏకరువు పెట్టడంతో కొద్ది రోజులకే విడతలవారీగా ఈ బిల్లులు విడుదల చేశారు. సహజంగా అయితే బిల్లులు అందిన ఉత్సాహంతో కార్పొరేషన్‌ పరిధిలో పనులకు టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు పోటీ పడాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు సరికదా.. ఏకంగా ఎమ్మెల్యేనే తమ చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రయత్నాలకు కాంట్రాక్టర్లు పాల్పడ్డారు. గొండు శంకర్‌ ప్రతి శుక్రవారం తన కార్యాలయంలో గ్రీవెన్స్‌ను నిర్వహిస్తుంటారు. ఇందులో కార్పొరేషన్‌ పరిధిలో కాల్వల నిర్మాణంపైనే పెద్ద ఎత్తున వినతులొస్తున్నాయి. వీటన్నిటినీ క్రోడీకరించి ఎక్కడ కాలువలు నిర్మించాలి, ఎక్కడ కల్వర్టులు వేయాలనే దానిపై ఎమ్మెల్యే కార్యాలయం మున్సిపల్‌ ఇంజినీర్ల సహాయంతో ఒక డేటా తయారు చేసింది. వాటికి ఎస్టిమేషన్లు కూడా తయారుచేసి నిధులు అందుబాటులో ఉన్న పనులకు అప్రూవల్‌ తెచ్చుకున్నారు. అనంతరం టెండర్ల ప్రక్రియ మొదలైంది. మొత్తం 47 పనులకు టెండర్లు పిలిస్తే కార్పొరేషన్‌ పరిధిలో రెగ్యులర్‌గా పనులు చేసే కాంట్రాక్టర్లలో అధిక శాతం మంది ఈ`ప్రొక్యూర్‌మెంట్‌కు దూరంగా ఉండిపోయారు. దాంతో అధికారులు రెండోసారి టెండర్లు పిలిచారు. అప్పుడు కూడా ఎవరూ బిడ్డింగ్‌లో పాల్గొనకపోవడంతో ముచ్చటగా మూడోసారి ‘రండి బాబూ రండ’ అంటూ పిలుపునిచ్చారు. దీన్ని కూడా కాంట్రాక్టర్లు సామూహికంగా బాయ్‌కాట్‌ చేశారు. చేసేదిలేక నాలుగోసారి అవే అంచనాలతో మళ్లీ టెండర్లు పిలిచారు. ఈసారి కూడా మున్సిపల్‌ కాంట్రాక్టర్లెవరూ ముందుకు రాలేదు. దాంతో పరిస్థితి అర్థమైంది. దాని వెనుక రాజకీయ కారణాలేమిటనేది మరో సందర్భంలో మాట్లాడుకుందాం.

మొండికేసి మరీ దుష్ప్రచారం

మరోవైపు ఎమ్మెల్యే గ్రీవెన్స్‌కు పదేపదే అవే కాలువల కోసం వినతులు అందుతున్నాయి. పరిపాలన అనుమతులు ఉన్నా పనులు ఎందుకు ప్రారంభం కావడంలేదని ఆరా తీస్తే నాలుగుసార్లు టెండర్లు పిలిచినా మున్సిపల్‌ కాంట్రాక్టర్లెవరూ పాల్గొనలేదని తెలిసింది. దీంతో ఎమ్మెల్యే ప్లాన్‌`బిని అమల్లోకి తెచ్చారు. ఎమ్మెల్యే కాకముందు కాంట్రాక్టర్‌గా పని చేసిన అనుభవం ఉన్న గొండు శంకర్‌ జిల్లాలో పలుచోట్ల ప్రధాన రోడ్ల పనులు చేస్తున్న కొందరు కాంట్రాక్టర్లను రంగంలోకి దించి చిన్నాచితకా పనులు చేయాలని, భవిష్యత్తులో అవకాశం వస్తే పెద్ద పనుల్లో ప్రాధాన్యత ఇస్తానని అంతవరకు తన మర్యాద నిలబెట్టాలని కోరారు. దీనికి కొందరు విముఖత వ్యక్తం చేసినా మరికొందరు మాత్రం ఎమ్మెల్యే కమిట్‌మెంట్‌ను అర్థం చేసుకున్నారు. పెద్ద పెద్ద రోడ్లు, కాలువలు, బ్రిడ్జిలు నిర్మించే మోడ్రన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ వంటి సంస్థలు ఈ చిన్నాచితకా పనులు చేయడానికి ముందుకొచ్చాయి. దీంతో 27 పనుల్లో కదలిక వచ్చింది. అయితే బయటి వ్యక్తులు వచ్చి మున్సిపాలిటీలో కాలువలు, కల్వర్టులు నిర్మిస్తుండటంతో సహాయ నిరాకరణలో ఉన్న కార్పొరేషన్‌ కాంట్రాక్టర్లకు కన్నుకుట్టింది. తాము ఇక్కడ ఉండగా, బయటి నుంచి వచ్చిన కాంట్రాక్టర్లకు ఎలా పనులిస్తారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తన మనుషులను తెచ్చుకొని టెండర్లు కట్టబెట్టారని దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి వీరెవరూ ఎమ్మెల్యే గొండు శంకర్‌తో టచ్‌లో ఉన్న కాంట్రాక్టర్లు కారు. మోడ్రన్‌ కన్‌స్ట్రక్షన్‌నే ఉదాహరణగా తీసుకుంటే వైకాపా హయాంలో నరసన్నపేట మెయిన్‌రోడ్డు విస్తరణ పనులు చేసింది. వీరికి పార్టీలు, ఎమ్మెల్యేలతో సంబంధం లేదు. ఇంకో విషయమేమిటంటే.. నగరంలో టెండర్లు పిలిచిన పనులన్నీ రూ.5 లక్షల నుంచి రూ.18 లక్షల లోపే ఉన్నాయి. ఈమాత్రం పనులకు కమీషన్లు, సొంత మనుషులు అనే ఆరోపణలు చేసేకంటే అసలు నాలుగుసార్లు టెండర్ల ప్రక్రియలో ఎందుకు పాల్గొనలేదో సదరు కాంట్రాక్టర్లు చెబితే బాగుండేది. అలాగే పనులు ప్రారంభించి, మధ్యలో కొన్ని వదిలేయడం వల్ల ఎమ్మెల్యే వేరేవారిని పెట్టి వీటిని పూర్తిచేయిస్తున్న మాట వాస్తవం. అందులో తెలుగుదేశం పార్టీ కోసమో, తనకోసమో పనిచేసే వ్యక్తులో ఉంటే ఉండొచ్చు.

హాయ్‌ హాయ్‌ గారడీలు సాగలేదనే..

గత ఐదేళ్లలో తట్టెడు మన్నేసి, దాని మీద క్రషర్‌ బుగ్గి వేసి సీసీ రోడ్డు పూర్తయిందని చెప్పి బిల్లులు చేసుకోవడం, పార్క్‌లు, కాలువలు బాగు చేశామంటూ ఎక్స్‌ట్రా బిల్లులు పెట్టడం వంటివాటికి అలవాటు పడిపోయి ‘హాయ్‌ హాయ్‌ గారడీ’ చేసినవారికి ఈసారి అలా చేయడం కుదరలేదు. ముఖ్యంగా సీసీ కాలువలు పూర్తిగా వీరికి గిట్టుబాటు కావు. అదే సీసీ రోడ్డు వేయమంటే మాత్రం పొలోమని కాంట్రాక్టర్లు పోటీపడతారు. ఎందుకంటే పెద్ద ఎర్త్‌వర్క్‌ లేకుండానే రోజుకు 150 మీటర్ల రోడ్డును ఇట్టే నిర్మించేయవచ్చు. అయితే ఇది ఎన్ని రోజులు ఉంటుందనేది దైవాధీనం. అదే కాలువ నిర్మించాలంటే ముందు ఎర్త్‌వర్క్‌ చేయాలి, లెవెల్స్‌ చూడాలి.. తర్వాతే అసలు పని చేపట్టాలి.. కాబట్టి రోజుకు 15 మీటర్లకు మించి నిర్మించలేరు. ప్రభుత్వం మాత్రం ఏ సీసీ పనికైనా మీటరుకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుంది. అందుకే కాలువలు నిర్మించడానికి మ్యాన్‌పవర్‌ ఎక్కువగా అవసరం ఉంటుందని ఈ పనులకు ఎవరూ ముందుకు రాలేదు. ఇలా నాలుగుసార్లు టెండర్లు పిలిచినా వెళ్లకపోతే వారే చచ్చినట్టు తమ డిమాండ్లకు అంగీకరించి వెసులుబాటు కల్పిస్తారని, దీంతో గతం మాదిరిగానే ఇంజినీరింగ్‌ అధికారులతో కుమ్మక్కయిపోయి పంచుకోవచ్చని భావించినవారి ఆలోచనలకు ఎమ్మెల్యే శంకర్‌ గండి కొట్టేశారు. ఫలితంగా కొన్ని వర్క్‌లు చేయడానికి ఇప్పుడు కార్పొరేషన్‌ కాంట్రాక్టర్లు కొందరు ముందుకొచ్చారు. వేరేవారు వచ్చి కార్పొరేషన్‌ పరిధిలో పనులు చేపట్టడాన్ని మనోళ్లు పూర్తిగా జీర్ణించుకోలేకపోయారు. చివరకు కొత్త కాంట్రాక్టర్‌కు ఇక్కడ కొందరు ఫోన్‌ చేసి మరీ బెదిరించారు కూడా. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వర్క్‌లు చేయడమేమిటన్న వార్నింగ్‌లు కూడా వెళ్లాయని తెలుస్తోంది.

1 Comment


chamartybhaskararao
5 hours ago

కాంట్రాక్టర్లు బెదిరింపుల వరకు వెళ్లేరంటే వాళ్ళ పరిస్థితి,వాళ్ళ లెవెల్ అర్ధం చేసుకోవచ్చు. ఎమ్.ఎల్. ఏ.గారు తీసుకున్న చర్య బాగుంది. ప్రజలు రోడ్లు కాలువల బాధితులు అయిపోయారు. ఆ సమస్య పరిష్కారానికి శాసన సభ్యులు ముందుకెళ్లాలి. తాటాకు చప్పుళ్లు వస్తూఉంటాయి. .

Like

Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page