top of page

ఎమ్మెల్యేలకూ ‘నో వర్క్‌.. నో పే’!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Sep 18, 2025
  • 2 min read

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. దాంతోపాటు వైకాపా సభ్యుల హాజరుపైనా చర్చ మళ్లీ మొదలైంది. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేవరకు అసెంబ్లీకి హాజరు కాబోమని ఆ పార్టీ ప్రకటించి.. సమావేశాలను బాయ్‌కాట్‌ చేస్తూ వస్తోంది. అయితే సభా నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా వరుసగా 60 వర్కింగ్‌ డేస్‌లో సభకు హాజరుకాని ఎమ్మెల్యేల పదవులు ఆటోమేటిగ్గా రద్దయిపోతాయంటున్నారు. కానీ ప్రస్తుత వర్షాకాల సమావేశాల తొలిరోజు వైకాపాకు ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. జగన్‌ సహా మిగతా ఎనిమిది మంది గైర్జారయ్యారు. ఈ నేపథ్యంలో వరుసుగా సమావేశాలకు గైర్హాజరవుతున్న వైకాపా ఎమ్మెల్యేల విషయంలో ‘నో వర్క్‌.. నో పే’ విధానం అమలుచేస్తామన్నట్లు కొద్దిరోజులుగా అసెంబ్లీ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్లు మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో వైకాపా ఓటమి పాలు కాగా ఆ పార్టీ నుంచి కేవలం 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వారంతా తమ పార్టీ నిర్ణయానికి కట్టుబడి మొదట్లో అసెంబ్లీకి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి పూర్తిగా రావడమే మానేశారు. ఈ ఏడాది అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా కొందరు వైకాపా సభ్యులు అసెంబ్లీకి వచ్చి హాజరు పట్టీలో సంతకాలు పెట్టేసి వెళ్లిపోయారు. అయితే దీన్ని సభకు వచ్చినట్లుగా పరిగణించలేమని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు స్పష్టీకరించారు. దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోవడం ఏమిటని ఆయన సభాముఖంగా నిలదీశారు కూడా. మరోవైపు వైకాపా ఎమ్మెల్యేలను తెలుగుదేశం నేతలు తెగ రెచ్చ గొడుతున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలపై చర్చించాలని సవాళ్లు కూడా విసురు తున్నారు. ప్రజాప్రతినిధులై ఉండి అసెంబ్లీకి రాకుండా ప్రజాసమస్యలను పట్టించుకోకుండా రాజకీయ స్వార్థంతో వ్యవహరిస్తున్న వైకాపా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలించాలని స్పీకర్‌ ప్రభుత్వాన్ని సూచిస్తున్నారు. మరోవైపు నిరవధికంగా సభకు రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి.. వారి నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వచ్చేలా చేస్తామని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు హెచ్చ రిస్తున్నారు. కాగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తరుణంలో వైకాపా ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మరోసారి అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనాలని, కోరినంత సమయం కూడా ఇస్తామని చెప్పినా వారు మాత్రం పట్టించుకోకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. అలాంటివారికి జీతాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. సాధారణంగా ఉద్యోగులు అను మతి లేకుండా విధులకు గైర్హాజరైతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అప్పటికీ వినకపోతే జీతం కట్‌ చేస్తారు.. అయినా ఖాతరు చేయకపోతే ఉద్యోగం నుంచి తొలగించేస్తారు కదా అని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మరి అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతం ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నిస్తూ.. వారికేమైనా రెండు కొమ్ములు ఉన్నాయా? అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడటమే వారి విధి అని.. అందుకోసమే తమ ప్రతినిధులుగా ప్రజలు వారిని ఎన్నుకున్నారని గుర్తుచేశారు. అటువంటి వారికి ‘నో వర్క్‌.. నో పే’ విధానం అమలు చేస్తామన్నట్లు ఆయన అన్యాపదేశంగా చెప్పడంపై చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలకు జీతం అంత ముఖ్యమా? అది లేకుండా బతకలేని ప్రజాప్రతినిధులు ఈ కాలంలో ఉన్నారా?? అన్న ప్రశ్నలు వినిపి స్తున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం అటువంటి ప్రజాప్రతినిధులు కొందరు ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో అన్ని పార్టీల నుంచి ఆర్థికంగా బలంగా ఉన్నవారే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికవుతు న్నారు. వ్యాపారాలు చేస్తూ వందల కోట్లకు పడగలెత్తినవారే ఎక్కువగా రాజకీయాల్లోకి వస్తున్నారు. అటువంటివారికి ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి జీతం డబ్బులు ఒక లెక్కా! ఇది స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి తెలియని విషయం కాదు. కానీ ఎమ్మెల్యేలను ఉద్యోగులతో పోల్చడం.. సభకు రాని ఎమ్మెల్యేల జీతం కట్‌ చేస్తామన పరోక్షంగా హెచ్చరించడం విస్మయం కలిగిస్తోంది. అలా కాకుండా ఏకంగా ఎమ్మెల్యే పదవిని రద్దు చేయడం వంటి చర్యలు చేపడతామని హెచ్చరిస్తేనే ఫలితం ఉంటుంది. అలాగే సంఖ్యా బలం లేని తాము సభకు వెళ్తే సంఖ్యాబలం కలిగిన కూటమి ఎమ్మెల్యేలు అవమానిస్తారన్న భయం వారిలో ఉంది. దాన్ని పోగొట్టేందుకు సభాధ్యక్షుడు కొంత నిఖార్సుగా వ్యవహరించాల్సి ఉంటుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page