ఎమ్మెల్యేలపై పెరుగుతున్న వ్యతిరేకత!
- DV RAMANA
- Jul 19
- 2 min read

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత, అసంతృప్తి పెరుగుతున్నాయా? అంటే.. ఇటీవల నిర్వహించిన పలు సర్వేలు అవునని అంటున్నాయి. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమి కట్టి ఉమ్మడి ప్రత్యర్థి అయిన అప్పటి అధికార పార్టీ వైకాపాను మట్టికరిపించాయి. రికార్డు స్థాయిలో 164 సీట్లు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు ఏడాది గడిచిపోయింది. ఈ కాలంలో ఎన్నో విజయాలు సాధించామంటూ ‘సుపరి పాలనలో తొలి అడగు’ పేరుతో ప్రభుత్వపరంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు సర్కారు ఏడాది పాలనపై పలు సర్వే సంస్థలతో పాటు టీడీపీ తరఫున రాబిన్‌సింగ్ బృందం కూడా ప్రజాప్రాయ సేకరణ జరిపింది. గత ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేయగలిగిన కేకే సంస్థతో పాటు రాబిన్ సింగ్ బృందం జరిపిన సర్వేలో ఇప్పటికిప్పుడు ప్రమాదం లేకపోయినా ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్న సంకేతాలు కనిపించాయి. 40 మందికిపైగా కూటమి ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు ఆ సర్వేల్లో తేల్చాయి. కాగా హైదరాబాద్ ఐఐటీ బృందం జరిపిన సర్వేలు మాత్రం కూటమి సర్కారుకు ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. ప్రభుత్వ పనితీరుతో పాటు ఎమ్మెల్యేల పనితీరు, పథకాల ప్రభావం.. ఇలా పలు అంశాలపై ప్రజల అభి ప్రాయాలు సేకరించి విశ్లేషించారు. అలాగే ఉమ్మడి జిల్లాల వారీగా పూర్తి వ్యతిరేకత, అసంతృప్తి అనే కోణంలో అభిప్రాయాలు సేకరించారు. రాష్ట్రంలో 294 నియోజకవర్గాలు ఉండగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 425 మంది చొప్పున 172 నియోజకవర్గాల్లో అభిప్రాయ సేకరణ జరిపారు. శ్రీకాకుళం జిల్లాలో పది సీట్లకుగాను టీడీపీకి 2, బీజేపీ, జనసేనలకు ఒక్కో సీట్లలో వ్యతిరేకత ఉండగా మూడు సీట్లలో టీడీపీపై అసంతృప్తి ఉంది. విజయనగరంలో 8 సీట్లు గెలిచిన టీడీపీ నాలుగింటిలో వ్యతిరేకత, ఒకచోట అసంతృప్తి, జనసేన గెలిచిన ఏకైక సీటులో వ్యతిరేకత ఎదుర్కొంటున్నాయి. విశాఖ లో 8 సీట్లు గెలిచిన టీడీపీపై ఒకచోట వ్యతిరేకత, రెండు చోట్ల అసంతృప్తి, నాలుగు గెలిచిన జనసేన పై రెండిరట్లో వ్యతిరేకత, ఒకచోట అసంతృప్తి ఉంది. తూర్పుగోదావరిలో 13 సీట్లు గెలిచిన టీడీపీ నాలుగు చోట్ల వ్యతిరేకత, రెండిరట అసంతృప్తి, 5 సీట్లలో గెలిచిన జనసేనకు నాలుగుచోట్ల వ్యతిరేకత, ఒకచోట్ల బీజేపీ అసంతృప్తి ఎదుర్కొంటున్నాయి. పశ్చిమగోదావరిలో టీడీపీ గెలిచిన 9 సీట్లలో మూడు చోట్ల వ్యతిరేకత, ఆరు సీట్లు గెలిచిన జనసేన 3 సీట్లలో వ్యతిరేకత, రెండిట్లో అసంతృప్తి ఎదుర్కొం టున్నాయి. కృష్ణా జిల్లాలో 13 సీట్లు గెలిచిన టీడీపీపై ఏడిరట వ్యతిరేకత, రెండు చోట్ల అసంతృప్తి ఉంది. గుంటూరు జిల్లాలో గెలిచిన 16 సీట్లలో ఆరు చోట్ల వ్యతిరేకత, రెండుచోట్ల అసంతృప్తిని టీడీపీ ఎదుర్కొంటున్నది. ప్రకాశంలో టీడీపీ 10 సీట్లు గెలవగా నాలుగింటిలో వ్యతిరేకత, రెండిరట అసంతృప్తి మొదలైంది. నెల్లూరులో టీడీపీ గెలిచిన 10 సీట్లలో నాలుగుచోట్ల వ్యతిరేకత, రెండు చోట్ల అసంతృప్తి ఉంది. కడపలో టీడీపీ గెలిచిన ఐదింటిలో మూడుచోట్ల వ్యతిరేకత, ఒక చోట అసంతృప్తి ఉండగా చెరో సీటు గెలిచిన జనసేన, బీజేపీలపై వ్యతిరేకత ఉంది. కర్నూలులో 11 సీట్లు గెలిచిన టీడీపీ 5 చోట్ల వ్యతిరేకత, రెండుచోట్ల అసంతృప్తి ఎదుర్కొంటుండగా, బీజేపీ గెలిచిన ఒక్క సీటులోనూ వ్యతిరేకత ఉంది. అనంతపురం జిల్లాలో 13 సీట్లు గెలిచిన టీడీపీకి ఆరుచోట్ల వ్యతిరేకత, ఒకచోట అసంతృప్తి, బీజేపీకి ఒకచోట వ్యతిరేకత ఉంది. చిత్తూరులో 11 గెలిచిన టీడీపీ ఐదు సీట్లలో వ్యతిరేకత, రెండు చోట్ల అసంతృప్తి, జనసేన ఒక చోట వ్యతిరేకత ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే టీడీపీలో 54 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్‌లో ఉండగా జనసేనలో 14 మంది, బీజేపీలో నలుగురు డేంజర్ జోన్లో ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. అలాగే ఆరెంజ్ జోన్‌లో టీడీపీకి చెందిన 22 మంది, జనసేనకు చెందిన ముగ్గురు, బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కాగా టీడీపీ నుంచి 59 మంది, జనసేనకు చెందిన నలుగురు, బీజేపీకి చెందిన ముగ్గురు గ్రీన్ జోన్‌లో సేఫ్‌గా ఉన్నారు. మొత్తం మీద ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల్లో 98 మంది పనితీరు బాగలేనట్లు తేలింది. మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, ఫరూక్, పార్థసారధి, గుమ్మిడి సంధ్యారాణి, టీజీ భరత్, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ వ్యతిరేకత ఎదుర్కొంటుం డగా అనిత, దుర్గేష్, సవితలపై అసంతృప్తి ఉన్నట్లు వెల్లడైంది.
Comentários