ఎమర్జెన్సీ ఘోరకలికి అర్థశతాబ్ది
- DV RAMANA

- Jun 25, 2025
- 2 min read

1975 జూన్ 25.. దేశ చరిత్రలో చీకటి పేజీలు తెరిచిన రోజు. అడ్డూఅదుపూ లేని నాంది పలి కిన రోజు. ప్రజాస్వామ్యమనే స్త్రీమూర్తికి సంకెళ్లు వేసి అమానుషంగా అత్యాచారం చేసిన రోజు. ఆ చీకటిపర్వానికి తెరలేచి నేటికి సరిగ్గా 50 ఏళ్లు. ఏకంగా 635 రోజులపాటు అంటే 21 నెలలు విశృంఖల పాతకానికి తెగబడిన నాటి ఎమర్జెన్సీ అకృత్యాల గురించి ఈ తరాలవారికి తెలియకపోవచ్చు. కానీ అప్పటి తరంవారిని ఎమర్జెన్సీ గురించి కదిలిస్తే చాలు.. వణికిపోతారు. కానీ వాటి గురించి చెబితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని ఘనంగా చెప్పుకొనే భారత్‌లోనే అంతటి దారుణ పాలన జరిగిందా? అని నేటి జనరేషన్ ఆశ్చర్యపోతారనడం అతిశయోక్తి కాదు. అప్పటివరకు దేశాన్ని ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన ఆధిపత్యానికి ముప్పు తెచ్చే పరిణామా లను తట్టుకోలేక దేశానికి ఎమర్జెన్సీని రుచి చూపించారు. నాటి రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ ద్వారా రాజ్యాంగంలోని 352వ అధికరణం కింద దేశవ్యాప్తంగా అత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ) విధిస్తూ 1975 జూన్ 25న ఉత్తర్వులు జారీ చేయించారు. అది మొదలు 1977 మార్చి 21 వరకు దేశం యావత్తు చీకటి పాలనలో మగ్గిపోయింది. ప్రధానంగా నాలుగు కారణాలు ఇందిరను ఎమర్జెన్సీ విధింపునకు ప్రేరేపించాయి. 1973లో ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్‌భాయ్ పటేల్ పై విద్యార్థి ఉద్యమం ఎగిసిపడిరది. దాంతో 1974 ఫిబ్రవరిలో గుజరాత్ ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఇందిరా గాంధీ రాష్ట్రపతి పాలన విధించారు. ఆ తర్వాత 1975లో జరిగిన ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. రెండో అంశం బీహార్‌లో సోషలిస్టు నేత జయప్రకాష్ నారాయణ్(జేపీ) ఉద్యమాలు. తొలుత అక్కడి విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్న ఆయన తర్వాత ఇందిర పాలనకు వ్యతిరేకంగా సంపూర్ణ క్రాంతి (సంపూర్ణ విప్లవం) ఉద్యమానికి పిలుపునిచ్చారు. కార్మిక నాయకుడు జార్జి ఫెర్నాండేజ్ సారథ్యం లో 1974లో అఖిల భారత రైల్వే సమ్మె జరిగింది. దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ స్తంభించిపోవడం అదే తొలిసారి.. చివరిసారి కూడా. ఆ సమయంలోనే ఆనాటి రైల్వే మంత్రి ఎల్‌ఎన్ మిశ్రా బాంబు దాడిలో మరణించగా తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. చివరిది అన్నింటికంటే కీలకమైనది ఎంపీగా ఇందిర ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు ఇవ్వడం. 1971లో ఇందిరాగాంధీ రాయ్‌బరేలి నుంచి ఎంపీగా గెలిచి, ప్రధాని పదవి చేపట్టారు. ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన సోషలిస్టు నేత రాజ్‌నారాయణ్ ఇందిర అక్ర మాలకు పాల్పడి గెలిచారంటూ అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఇందిరను దోషిగా తేల్చి, ఆమె ఎన్నిక చెల్లందంటూ 1975 జూన్ 12న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై జూన్ 24న సుప్రీంకోర్టు పాక్షిక స్టే విధించింది. ఓటింగ్ హక్కు లేకుండా ప్రధానిగా కొనసాగ డానికి మాత్రమే ఇందిరకు అనుమతినిచ్చింది. వాస్తవంగా దేశంలో అస్థిరత, అశాంతి, సరిహద్దుల్లో కల్లోలాలు, అంతర్గత సంక్షోభం వంటి తీవ్ర విపత్కర పరిస్థితులు తలెత్తిన సందర్భాల్లో మాత్రమే ఎమర్జెన్సీ అస్త్రాన్ని ప్రయోగించాలని రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. కానీ దేశంలో అటువంటి పరిస్థితులు లేకపోయినా.. కేవలం తన అధికారానికి ముప్పు వాటిల్లడాన్ని సహించలేకే ఇందిర నాడు దేశానికి ఎమర్జెన్సీ సంకెళ్లు తొడిగి.. ప్రజలను తీవ్ర నిర్బంధాలకు గురిచేసింది. దేశ పౌరులు ప్రాథమిక హక్కులు కోల్పోయారు. ఇందిరా గాంధీ. ఆమె తనయుడు సంజయ్‌గాంధీ, కొద్దిమంది కోటరీ సభ్యుల ఇష్టానుసారం నిబంధనలు మారిపోయాయి. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, మధు దండావతే, జార్జి ఫెర్నాండేజ్ వంటి వందలాది రాజకీయ ఉద్దండులతో పాటు లక్షలాదిమంది జైళ్లపాలయ్యారు. పత్రికా స్వాతంత్య్రం హరించుకుపోయింది. పత్రికల్లో ప్రచురించే ప్రతి అక్షరం ప్రధాన మంత్రి కార్యాలయం రావాల్సిందే. ప్రభుత్వాన్ని విమర్శించిన పత్రికలు నిషేధానికి గురయ్యాయి. సంజయ్‌గాంధీ దేశంలో నిర్బంధ కుటుంబ నియంత్రణ అమలు చేశారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగానికి గుండెకాయలాంటి పీఠికను మార్చేసి సోషలిస్ట్, సెక్యూలర్, ఇంటిగ్రిటీ అనే పదాలు చేర్చారు. ఎమర్జెన్సీ కాలంలో 1,10,806 లక్షల అరెస్టులు జరిగాయి. నిరసనకారులపై కాల్పులు, కస్టడీ మరణాలు, నిర్బంధ కు.ని. వంటి కారణాలతో సుమారు వెయ్యి బలవన్మరణాలు నమోదయ్యాయి. ఆర్థిక వ్యవస్థ పతనమైంది. ద్రవ్యోల్బణం 29 శాతానికి ఎగబాకింది. జీడీపీ వృద్ధిరేటు 0.9 శాతానికి పడిపోయింది.










Comments