top of page

‘ఎర్ర’ చెరువులో ‘పచ్చ’నోట్లు పారుతున్నాయ్‌!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Dec 24, 2025
  • 2 min read
  • ఎర్ర’ చెరువులో ‘పచ్చ’నోట్లు పారుతున్నాయ్‌!

  • 30 ఎకరాల నీటి వనరు మ్యాపుల్లోనే కనిపిస్తోంది

  • రెవెన్యూ కార్యాలయంలో రికార్డులు ఉండవ్‌

  • యంత్రాంగం హెచ్చరించినా పట్టించుకున్న నాధుడు లేడు

  • పలాస`కాశీబుగ్గలో మరో కబ్జాపర్వం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

పలాస`కాశీబుగ్గ రెవెన్యూ కార్యాలయానికి ప్రభుత్వ చెరువులకు సంబంధించి గాని, పోరంబోకు భూములకు సంబంధించి గాని సమాచారం కోసం ఒక దరఖాస్తు చేసిచూడండి. అయితే తమ వద్ద రికార్డులు లేవని సమాధానం వస్తుంది.. లేదూ అంటే చెరువులో కొంత భాగం కబ్జా అయిందని, ఎవరు చేశారో తెలియదని రిప్లై ఇస్తారు. ఈ సమాధాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు రికార్డులే లేనప్పుడు కబ్జా జరిగిందో లేదో కూడా ఎలా చెప్పగలిగారనేది రెవెన్యూ బుర్రలకే అర్థమవ్వాలి. ‘కంకర రక్కసి’ పేరుతో సంచలన సాయంకాల పత్రిక ‘సత్యం’ మంగళవారం ప్రచురించిన కథనంలో ఓ వాక్యాన్ని కోట్‌ చేసింది. ఇక్కడ అక్రమార్కులకు ప్రభుత్వ భూములు ఆక్రమించి అమ్మేయడం ప్రధాన వనరు అని దానర్ధం. ఇప్పుడు మీరు చదువుతున్న వార్త అందుకు సాక్ష్యం.

ఒకప్పుడు పలాస`కాశీబుగ్గకు జీవనాధారంగా నిలిచిన పురుషోత్తపురం రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌ 29లో ఎర్రచెరువు 26.80 ఎకరాలకు పైబడి విస్తరించి ఉండేది. 15 ఏళ్లగా చెరువును కొంతమంది పద్ధతి ప్రకారం కబ్జా చేస్తున్నారు. సర్వే నెంబర్‌ 28, 26లో ఎర్రచెరువు కాలువలు కబ్జాకు గురై రూపం కోల్పోయాయి. ఫెయిర్‌ అడంగల్‌ రికార్డ్స్‌ ప్రకారం చెరువు, దాని గట్టు, కాలువలతో కలిపి సుమారు 30 ఎకరాలు ఉండాల్సిన చోట ఇప్పుడు 20 ఎకరాలు కూడా లేదని స్థానికులు చెబుతున్నారు.

అలాగే పలాసలో ఎంతో ఫేమస్‌ అయిన డబ్బాల చెరువును రికార్డుల్లో జిరాయితీ చెరువుగా చూపించి లే`అవుట్‌ వేసిన మాదిరిగా ఎర్ర చెరువు, కాలువలు కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోయాయి. ఆక్రమణదారులు భూదాహానికి చెరువు కుదించుకుపోతూ, కాలువలు గుర్తుపట్టలేని స్థితికి చేరిపోయిందని స్థానికులు చెబుతున్నారు. చెరువు గట్టును కొందరు చదునుచేసి షెడ్లు నిర్మించారు. రెవెన్యూ అధికారులకు సమాచారం ఉన్నా అడ్డుకోవడం లేదని చర్చ సాగుతుంది. కొందరు కూటమి నాయకులు వెనుకుండి ఈ తంతు సాగిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. సహజ నీటివనరులను రక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అధికారులకు లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎర్ర చెరువు వద్ద నిర్మిస్తున్న షెడ్డులను తొలగించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో ఎర్రచెరువు పేరు మాత్రమే మిగులుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెంబరు 26 ఎర్రకాలువపై 31వ వార్డు పరిధిలో సీతారామనగర్‌ కాలనీ వైపు ఎర్రచెరువు గట్టుపై అక్రమ నిర్మాణంపై రెవెన్యూ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసిన తర్వాత ఆక్రమణలను తొలగించారు. వీఆర్వో ఆక్రమణలను పరిశీలించి పనులు నిలుపుదల చేయాలని సూచించినప్పటికీ రాజకీయ అండదండలతో షెడ్‌ నిర్మాణం పూర్తి చేశారని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం సీతారామనగర్‌ వైపు నుంచి వార్డు సచివాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ఎర్ర చెరువు కబ్జా చేస్తున్నా రెవెన్యూ అధికారులు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పలాస డివిజన్‌ కేంద్రంగా ఏర్పాటైన తర్వాత కూడా ఆక్రమణలను అడ్డుకోలేకపోతున్నారని విమర్శించినవారూ లేకపోలేదు. భూములు విలువ పెరగడంతో మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువులు, డి`పట్టా భూములను ఆక్రమించి విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

పలాసలో సహజవనరుల దోపిడీ, ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువ గట్ల ఆక్రమణ 2014 నుంచే ఊపందుకుంది. ఇప్పటికీ నిరంతరాయంగా సాగుతుంది. వేల ఎకరాల ప్రభుత్వ, డి`పట్టా, దేవదాయ శాఖకు చెందిన భూములు అన్యాక్రాంతం కావడానికి స్థానికంగా రాజకీయ పలుకుబడి కలిగిన నాయకులే కారణం. రెవెన్యూ అధికారులను ప్రలోభాలకు గురిచేసి దౌర్జన్యంగా భూములు ఆక్రమించి రికార్డులను ట్యాంపరింగ్‌ చేసిన ఘనత అక్కడి పెద్దలకే చెందుతుంది. దీనికి అడ్డుకట్ట వేస్తారని ఎదురుచూసిన పలాస ప్రజలకు 2019 అధికారంలోకి వచ్చినవారు అంతకు మించి చేశారు. 2024లో నైనా దీనికి ఫుల్‌స్టాప్‌ పెడతారని ఆశించిన ప్రజలకు మరోమారు నిరాశ తప్పలేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page