top of page

ఎవరికీ ఎవరూ ఏమీ కారు..!!

  • Guest Writer
  • Jul 23
  • 3 min read
ree

ఇదొక గుణపాఠం! ఇండస్ట్రీ రాలేదని తప్పు పట్టక్కర లేదు. రెండు కులాల అధిపత్యాలు, ఉన్నోళ్లు లేనోళ్ళు, చిన్న నటుడు పెద్ద నటుడు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తమ అనవసర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు! వారి వారి ‘‘వంటలు’’ చూసాక అవసరమైన నా భావాన్ని నా ఆలోచనను రాయాలనిపించింది! వాళ్ళది అనవసరం, నాది అవసరం అని వూరికే అనలేదు! దానికొక రీజన్‌ వుంది! చదివాక మీకు అర్ధం అవుతుంది!

ఫిష్‌ వెంకట్‌ కుమార్తె మాట్లాడుతూ ‘‘నాన్న నటించిన సినిమాల్లో హీరోలు స్పందిస్తారనుకున్నా, ఎవ్వరూ పట్టించుకోలేదు. నాన్న తో నటించని విశ్వక్‌ సేన్‌, కృష్ణ మాండ్యా చెరో రెండు లక్షలు ఇచ్చారు. మంత్రి శ్రీహరి లక్ష ఇచ్చారు, మైనంపల్లి రెండు లక్షలు ఇచ్చారు! వీటితో కిడ్నీ వస్తదా? గతంలో పవన్‌ కళ్యాణ్‌ రెండు లక్షలు ఇచ్చారు. ఈసారి ఏమివ్వలేదు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

తనే మళ్ళీ.. మీడియా ముందు మేం చూసుకుంటామని చెప్పే వారే అందరూ, ఆ తరువాత పట్టించుకున్న వారు లేరు అని చెప్పింది. నటుడు ఫిష్‌ వెంకట్‌ అనారోగ్యంతో చికిత్స పొందుతూ చనిపోయారు! అడ్డగుట్ట స్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి! ఇండస్ట్రీ మొత్తం వచ్చి నివాళులు అర్పించలేదు అనేది కొన్ని మీడియాల ఆవేదన!

ఇండస్ట్రీ మొత్తం అసలు ఎందుకొస్తుంది? ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? కోట శ్రీనివాసరావుకు వచ్చారుగా అని ఒక మిత్రుడు నాకు ఎదురు ప్రశ్న వేశాడు! తెలుగు సినీ రంగంలో కోట శ్రీనివాసరావు, ఫిష్‌ వెంకట్‌ ఒక్కటేనా? తెలియనంత చెప్పలేనంత తేడా వుంది!

పోనీ, ఇద్దరూ సమానమే అని కాసేపు అనుకుందాం! మెయిన్‌ మీడియా కోట ఇంటి దగ్గర లైవ్‌ పెట్టారు! మరి ఫిష్‌ వెంకట్‌ ఇంటి దరిదాపులకైనా వెళ్ళారా? అక్కడకు వచ్చింది కేవలం వ్యూయర్స్‌ పెంచుకునే యుట్యూబర్లు మాత్రమే హడావిడి చేశారు! అదే తేడా!

ఇండస్ట్రీలో కులం కాదు! ఒక ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు, సాంకేతిక నిపుణుడు చనిపోతేనే ఇండస్ట్రీ తరలి వస్తుంది! మనం ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం! చిన్న చిన్న నటులు ఎందరో చనిపోయారు! టివిల్లో సరేసరి, కనీసం పత్రికల్లో సింగిల్‌ కాలమ్‌ వార్తకు నోచుకోలేదు!

అంతెందుకు కీరవాణి తండ్రి శివశక్తి దత్తా చనిపోతే ఎంతమంది సందర్శించారు! బెంగళూరు లో సీనియర్‌ నటి సరోజా దేవి చనిపోతే ఒక్కరైనా వెళ్ళారా? వెళ్ళలేదు! జమున అంతిమ యాత్ర ఆ ఒక్క రథం ఒంటరిగా వెళ్ళింది! సినిమాను కొద్దో గొప్పో ప్రభావం చూపిస్తే సరిపోదు! కొన్ని ఈక్వేషన్స్‌ ఉండాలి! వేవ్‌ లెంత్‌ సరిపోవాలి!

సైడ్‌ విలన్‌ లేదా చిన్న చిన్న పాత్రలు వేసే నటులు చనిపోయినా ఇండస్ట్రీ తరలి రావాలనుకోవడం, రాలేదని దెప్పి పొడవడం అనవసరం! పెద్ద నటులకే రాలేదు! ఇండస్ట్రీ అంతా ఒకే కుటుంబం అని వేదికలపై అన్నంత మాత్రాన కుటుంబ సభ్యులమే అని అనుకోవడం తప్పు!

ఫిష్‌ వెంకట్‌ అనేక సినిమాల్లో సైడ్‌ విలన్‌, గ్రూప్‌ విలన్‌, అసిస్టెంట్‌ విలన్‌ పాత్రలు వేసి తనదైన తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి ఆకట్టుకున్నాడు! అమాయకంగా నవ్వించి గుర్తింపు పొందాడు! వూరికినే ఏమీ నటించలేదు! చేపల వ్యాపారం కూడా వదిలేసి సినిమాల్లో బిజీ అయిపోయే అంతగా సంపాదించాడు! నిలబెట్టుకోలేకపోయాడు, అది వేరే విషయం!

మొన్నటికి మొన్న ‘‘అన్నం తిని నాలుగు రోజులు అయ్యింది’’ అని కంట తడి పెట్టిన పాకీజా కూడా అంతే! ఎవ్వరూ వూరికే నటించలేదు! పాపం ఆమెకు పడిన సినిమాలు కూడా తక్కువే! ఆమె ఏం సీనియర్‌ నటి కాదు! ఉండేది తమిళనాడులో! గతంలో తెలుగు సినీ పరిశ్రమలో కొందరు సాయం చేశారని, మళ్ళీ వచ్చి మీడియా ముందు కన్నీళ్లు పెడితే, పవన్‌ కళ్యాణ్‌ స్పందించి రెండు లక్షలు ఇచ్చి పంపించారు! అదొక అలవాటుగా మారిపోయింది ఆమెకు!

ఫిష్‌ వెంకట్‌ చనిపోయాడు కాబట్టి అనకూడదు, కానీ మిగిలినవారికి కొంత గుణపాఠం అవుతుందనే ఉద్దేశ్యంతో కొంత సాహసం చేయాల్సి వస్తోంది! ఒకరకంగా చెప్పాలంటే ‘‘వద్దు’’ అని ఇంటా బయటా చెప్పినా వినకుండా మందుకు బానిస అయిపోయాడు! సంపాదించింది సంపాదించినట్లుగా ఇష్టారాజ్యాంగా ఖర్చు పెట్టేసాడు! రోజుకు 35 గుట్కాలు నమిలేవాడ్ని అనే తనే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకున్నాడు!

ఆరోగ్యం దెబ్బతింటున్నా లెక్క చేయలేదు! ‘‘మనల్ని ఎవడ్రా ఆపేది’’ అన్నట్లు తాగి గ్యాంగ్రీన్‌, అఖరకు కిడ్నీలు పాడై పోయే స్థితికి చేరుకున్నాడు! వేరే ఆసుపత్రిలో చేరిస్తే రోజుకు 70 వేలు అవుతూ వచ్చింది! కొందరు దాతలు సహకరించారు! ప్రభుత్వం కూడా స్పందించింది. అఖరకు మంత్రి శ్రీహరి కూడా సందర్శించి పరామర్శించి, సొంత డబ్బులు కొంత ఇచ్చి, ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు!

ఆ ఆసుపత్రిలో కాస్త ఇబ్బందిగా ఉందని వారి బంధువుల అసువత్రికి మార్చి కిడ్నీ డోనర్‌ కోసం వెతుకుతున్న సమయంలో దురదృష్టవశాత్తు ఆయన కనుమూశారు! ఆయన సహచర నటులు మిత్రులు పెద్ద ఎత్తున వచ్చారు. నివాళులు అర్పించారు! కానీ, ఇండస్ట్రీ నుంచి పెద్దలు ఎవ్వరూ రాలేదని, ఎందుకు పట్టించుకోలేదని నటులు ఎవ్వరూ చెప్పలేదు! కేవలం మీడియా మాత్రమే ఆ అనవసరపు గొంతుక వినిపించింది!

ఫిష్‌ వెంకట్‌ అన్ని సినిమాల్లో నటించాడు కానీ, ‘‘మా’’ సభ్యత్వమే తీసుకోలేదు! ‘‘మా’’ సభ్యుడు కాకపోయినా ఆ సంస్థ స్పందించింది! అసలు మా సంస్థలో సభ్యత్వం తీసుకుని ఉంటే ఇన్సూరెన్స్‌ సౌకర్యం కూడా అందుబాటులో ఉండేది!

చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనేక జాగ్రత్తలు తీసుకుంటున్న రోజులు! సొంత ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకుంటున్న రోజులు! కానీ, ఫిష్‌ వెంకట్‌ అవేమి పట్టించుకోక పోవడం విచారకరం!

ఫిష్‌ వెంకట్‌ మృతి సినీ రంగంలో ఉన్న చిన్న చిన్న నటులకు పెద్ద గుణపాఠం కావాలి! గబ్బర్‌ సింగ్‌ కామెడీ విలన్లు నిన్న వెంకట్‌ అంతిమ యాత్రలో ఇదే ఆందోళన వ్యక్తం చేశారు. ఫిష్‌ వెంకట్‌ ఆసుపత్రిలో వున్నప్పుడు కొందరు నటులు మానవతా దృక్పథంతో సాయం చేశారు! అలా సాయం చేస్తారులే అని భరోసాగా ఉండకండి!

ఫిష్‌ వెంకట్‌ కుమార్తె చెప్పినట్లు ఎవ్వరూ ఎవ్వరికీ ఏమీ చేయరు! మాట సాయం చేయగలరేమో కానీ, ఆర్ధిక సాయాలు అందరూ చేయరు! చేసినా వాటి ఈక్వేషన్స్‌ వాటికి ఉంటాయి! అసలు వాళ్ళు వీళ్ళు సాయం అని ఆలోచించకుండా అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి!

సంపాదించింది ఖర్చు పెట్టేయకుండా అందులో కొంత దాచుకోవాలి! మెడికల్‌ ఇన్సూరెన్స్‌ ప్రతి కుటుంబానికి ఉండేలా చూసుకోవాలి! అన్న ఫిష్‌ వెంకట్‌ పోయి, అందరికి కళ్ళు తెరిపించాడనుకోవాలి! అందరూ జాగ్రత్తగా ఉండాలి! నాకు మీకు అందరికి ఇది వర్తిస్తుంది!

డా.మహ్మద్‌ రఫీ

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page