ఎవర్రా మీరంతా..?!
- ADMIN

- Nov 19, 2025
- 4 min read
కాపీ లేకుండా ఒక్క సినిమా ఉందా?
మలయాళంలో పావలా ఖర్చు.. మనకు వంద రెట్లు మోత
బెనిఫిట్ షో డబ్బులు ఏ ఛారిటీలకు వెళ్తున్నాయి?
ఎన్‌కౌంటర్ చేయాల్సింది సినిమావారిని కాదా!

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
మలయాళంలో లూసీఫర్ అనే సినిమాకు హీరో మోహన్‌లాల్. అక్కడ పెద్ద హిట్. దాన్నే తెలుగులో మెగాస్టార్‌తో గాడ్‌ఫాదర్‌గా రీమేక్ చేశారు. ఇక్కడ ఢమాల్.
తెలుగులో పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ మలయాళంలో పేరూ ఊరూ లేని హీరోతో తీస్తే ఇండస్ట్రీ హిట్. ఇక్కడ ఇద్దరు స్టార్లు ఉన్నా ఈ సినిమాను నిలబెట్టలేకపోయారు.
ఇందులో పై సినిమాకు టిక్కెట్ల రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం జీవో ఇస్తే, భీమ్లానాయక్ సినిమాకు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం థియేటర్ల మీద రైడ్‌లు చేయించింది. కట్ చేస్తే.. ఈ రెండూ కనీసం బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయాయి. సినిమా పరిభాషలో చెప్పాలంటే టేబుల్ ప్రాఫిట్ కూడా తేలేకపోయాయి. రెండిరటిలోనూ పెద్ద స్టాక్ కాస్టింగ్ ఉంది. మలయాళంలో పావలాకు తీసిన సినిమాకు ఇక్కడ వంద రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సినిమాకు అవసరం లేని హంగులు, ఆర్భాటాలు హీరోల కోసం చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ అని ఒకసారి, గ్లిమ్స్ కోసం ఒకసారి, టైటిల్ లాంచింగ్ కోసం ఒకసారి.. ఇలా భారీ ప్రోగ్రామ్స్ నిర్వహించి, మన స్టార్లకు దేశంలో ఎక్కడా లేనంత రెమ్యూనరేషన్లు ఇచ్చి సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటున్నారు. ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకోడానికి అనుమతులు ఇచ్చినా, ఇవ్వకపోయినా థియేటర్లకు వెళ్లడం జనం మానేశారు. ఐబొమ్మ రవి కాకపోతే మూవీ రూల్స్ అనే ఇంకో సైట్ వస్తుంది. ఇందుకు ఈ మూలం ఎక్కడో కనుక్కోకుండా ఐబొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయమనడం విడ్డూరం. సమకాలీన చరిత్రలో చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన ఒక వ్యక్తికి అనుకూలంగా ప్రజల్లో ఇంత పెద్ద మద్దతు రావడం ఇదే మొదటిసారి. దీన్నే రాబిన్‌హుడ్ సిండ్రోమ్ అంటారు. పెద్దలను కొట్టి పేదలకు పంచడమే రాబిన్‌హుడ్ సిద్ధాంతం. ఈ బేస్ మీద అనేక సినిమాలు వచ్చాయి. మన తెలుగు సినీ అభిమానుల కోసం చెప్పాలంటే చిరంజీవి నటించిన కొండవీటి దొంగ ఇదే కాన్సెప్ట్. అంతకు ముందు ఎన్టీఆర్, కృష్ణంరాజు, కృష్ణ.. ఇలా ఎంతోమంది ఇటువంటి కథల్లో నటించారు. ఒట్టో బెంజిమిన్ చార్లెస్ బాథర్సన్ దర్శకుడు ధనవంతుల డబ్బును పేదవాళ్లకు పంచడం కాన్సెప్ట్‌తో తీసిన సినిమాయే రాబిన్‌హుడ్. ఇప్పుడు ఐబొమ్మ రవికి ఆ రాబిన్‌హుడ్ ఇమేజ్‌ను తీసుకువచ్చింది. సాక్షాత్తూ మన తెలుగు సినీ పరిశ్రమే. ఐమాక్స్‌లో అంతంత రేట్లు పెట్టి సినిమా ఎవడు చూడమన్నాడు? మీ సందు మూలలో ఉన్న మామూలు థియేటర్‌లో చూస్తే తప్పేంటని ప్రశ్నించే మహానుభావులూ ఉన్నారు. ఒక డోల్బీ అట్మోస్, సరౌండిరగ్ సిస్టమ్, ఐమాక్స్ స్క్రీన్ టెక్నాలజీ మీద చూడటానికి వీలుగా బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటు అనేక చోటామోటా సినిమాలు కూడా తీసి మన మీదకు వదులుతున్నప్పుడు మన సందు చివరిలో ఉన్న టూరింగ్ టాకీస్‌లో సినిమా ఎలా చూడగలం? ఒకవేళ చూసినా మన నిర్మాతలు చెబుతున్నట్టు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా చేయగలం? పోనీ చిన్నా చితకా సినిమా హాల్‌లోనైనా రేట్లు తక్కువ ఉన్నాయా? అంటే.. ద్విచక్ర వాహనం పార్క్ చేస్తే రూ.20, పాప్‌కార్న్ రూ.100, ఫింగర్ చిప్స్ రూ.100, కూల్‌డ్రిరక్ రూ.50, సమోసా రూ.30,.. ఇవన్నీ అధిక ధరలు కావా? ఒక కుటుంబం సినిమాకు వెళ్తే ఎంత ఖర్చవుతుందో తెలియదా? అందుకేనేమో ఐబొమ్మ లాంటి ఒక హ్యాకింగ్ వెబ్‌సైట్‌లో 50 లక్షల మంది సినిమాలు చూశారేమో?! ఇందులో తెలంగాణ పోలీసులూ ఉండకపోరు. ఒక సినిమా మీద వెయ్యి రూపాయలకు పైగా ఖర్చుపెట్టి, బయటకు వచ్చాక సారిడన్ మాత్ర అదనంగా కొనుక్కోవడం ఇష్టంలేక ఐబొమ్మ, లేదా బప్పం లాంటి అనేక పైరేటెడ్ సినిమాలను జనం చూడటం మొదలుపెట్టారు. ఇప్పుడు చట్టానికి వ్యతిరేకంగా ఐబొమ్మ రవి పని చేశాడని చెబుతున్న మన దర్శక, హీరో శిఖామణులు ఏమైనా శుద్ధపూసలా?
దోపిడీ గాళ్లంతా ఇండస్ట్రీని ఆక్రమించుకొని టిక్కెట్ రేట్లు దారుణంగా పెంచుతుంటే, యానిమల్ లాంటి జుగుప్సాకరమైన సినిమాలు యథేచ్ఛగా తీస్తుంటే నియంత్రించలేని పోలీసు బాసులు, సెన్సార్ అధికారులు ఐబొమ్మ యజమానిని మాత్రం పేద్ద క్రిమినల్ని పట్టుకున్నట్టు అతి చేయడం హాస్యాస్పదం. ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్టుని పట్టుకున్నట్టు సినిమా పెద్దలందరూ హాజరైపోవడం, రాష్ట్రంలో ఇంకేం ప్రజా సమస్యలు లేవన్నట్టు అన్నీ పక్కకు నెట్టి మనం మనం బరంపురం అన్నట్టు, బూతు సినిమాలతో, సంఘ వ్యతిరేక శక్తులనే హీరోలుగా చూపించే ఇండస్ట్రీ పెద్దలతో అతి చేయడం, వ్యవస్థలన్నీ ఎప్పుడూ పెద్దోడి పక్షమే అనే మాటని నిజం చేయడం కాక మరేమిటి?
డబ్బులు కూడా కష్టపడితేనే వస్తున్నాయి..
ఉన్నోడు థియేటర్లో చూస్తున్నాడు, లేనోడు వాటిల్లో చూస్తున్నారు. టికెట్‌కి 200 తగ్గకుండా వేలకి వేలు పెట్టడానికి కారణం ఏమిటి? హీరోలకి హీరోయిన్స్‌కి దర్శకులకు వందల కోట్లు ఎందుకు..? సినిమా టోటల్ బడ్జెట్ రూ.100 కోట్లు అయితే.. రూ.60 నుంచి 70 కోట్లు దర్శకులకు హీరో హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకే పోతే ఇంకా సినిమా బడ్జెట్ మహా అయితే 30నుంచి 40 శాతం ఉంటుంది. రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే సినిమా చాలా తక్కువ బడ్జెట్‌లోనే తీయొచ్చు కదా! అలా తీసిన సినిమాని తక్కువ రేట్లకే టికెట్లు పెడితే కుటుంబ సభ్యులతో సహా వచ్చి సినిమాలు చూస్తారు. అలా టికెట్ రేట్లు తగ్గితే ఇలాంటి ఐ`బొమ్మ ఆ బొమ్మ ఈ బొమ్మలో ఎందుకు చూస్తారు జనాలు. కష్టం ఎవరిది అయినా కష్టమే కదా. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది థియేటర్లో వెళ్లి ఆ ఎక్స్‌పీరియన్స్‌తో సినిమా చూడాలి అని. కానీ వందల కోట్ల రెమ్యూనరేషన్ పెంచేసి సినిమాను సామాన్యులకు అందకుండా దూరం చేస్తుంది సినిమా వాళ్లే.
సినిమా వాళ్లు చేసేది కరెక్ట్ అయితే.. రవి చేసింది కూడా కరెక్టే..
తమ సినిమాలకు ‘భారీ బడ్జెట్, పాన్ ఇండియా, వరల్డ్ వైడ్, మల్టీ స్టారర్’ అనే ట్యాగ్ లైన్‌లు వాళ్లే ఇచ్చుకుని.. రెండు మూడేళ్లకు ఒకడు మాఫియాలా సినిమాలు రిలీజ్ చేసి, దానికి దేవుడు అనే సెంటిమెంట్‌లు కలిపి.. కథలో బలం లేకపోయినా.. ఎలివేషన్స్ ఇస్తూ.. పక్క భాషల హీరోలను, ముసలి హీరోయిన్లను రుద్దుతున్నది ఎవరు? ప్రీరిలీజ్, ప్రీమియర్ షో అనే పోరంబోకు పదాలు చెప్పి, పాటకో ఈవెంట్, వీడియోకో ఫంక్షన్ పెట్టి.. బాక్సాఫీస్ మొనగాడు, ఇండస్ట్రీ హిట్, ఏకైక హీరో, సరికొత్త రికార్డులు అనే పదాలు సృష్టించింది ఎవరు? ప్రీక్వెల్, సీక్వెల్ అంటూ సినిమా పిచ్చోళ్ల వీక్నెస్ వాడుకుని రోజుకొక డబ్బున్న బిచ్చగాడు సిగ్గులేకుండా ప్రేక్షకులను దోచుకున్నప్పుడు.. వాళ్ల సినిమాలను పైరసీ చేసి.. థియేటర్‌కు వెళ్లి చూడలేని సామాన్యులకు రవి మంచివాడే. మనకు నచ్చి చూస్తున్నాం. చూడమని ఎవడు అన్నాడు? మనిషి మానసిక పరిస్థితి మీద కొట్టడానికి సినిమా పరిశ్రమ ఎప్పటికప్పుడు.. ప్రమోషన్స్‌తో రంగంలోకి దిగుతూనే ఉంది.. మీరు చేసింది కరెక్ట్ అయితే.. అతను చేసింది కూడా కరెక్టే..!
కాపీ చేయకుండా ఒక్క సినిమానైనా తీశారా?
కథ, సీన్లు, సంగీతం, లైటింగ్, ఫైటింగుల్లో కాపీ లేదా? దీన్ని చౌర్యం లేదా పైరసీ అంటే తప్పేంటి? డ్రగ్స్, నల్లడబ్బు, స్త్రీల అణచివేత, కులపైత్యాలతో కులకడం లేదా? ఇదంతా అమాయక జనం జేబుల్లోని కష్టపడిన సొమ్ముని కొట్టేయడం కోసం కాదా? సెక్స్, వయొలెన్స్, బానిసత్వం, కులమత ఆధిపత్యం గుమ్మరించలేదా? ఐబొమ్మ రవి లాంటివాళ్లు సంఘసేవ చేస్తున్నారో లేదో గానీ, సినిమా వారిలాగా సంఘద్రోహం మాత్రం చేయట్లేదు. ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేసి పైరసీని అరికట్టాం అనుకోవడం ఎలా వుంది అంటే.. టిక్ టాక్‌ని బ్యాన్ చేసి చైనాని ఓడిరచాం అని అనుకున్నాం.. తర్వాత ఇన్‌స్టాగ్రామ్ వచ్చింది.
నష్టం సినీ ఇండస్ట్రీకా? ఓటీటీ యాప్స్ కా?
ఐబొమ్మలో వచ్చే సినిమాలు థియేటర్లో రిలీజ్ అయిన వెంటనే వచ్చేవి కావు. థియేటర్లో రిలీజ్ అయ్యి కలెక్షన్లు సంపాదించుకుని, కొన్ని రోజుల తర్వాత శాటిలైట్ రైట్స్ ఏదో ఒక ఓటీటీ యాప్‌కి అమ్ముకుని ఆ డబ్బులు కూడా నిర్మాత తీసుకున్నాక అఫీషియల్‌గా ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు మాత్రమే ఐబొమ్మలో దర్శనం ఇస్తాయి. దీనివలన నష్టం అంటూ ఉంటే అది కేవలం ఆ ఓటీటీ యాప్ వారికే తప్పా సినిమా ఇండస్ట్రీకి కాదు. ఒకవేళ ఓటీటీలో కూడా కలెక్షన్ షేర్ నిర్మాతకి ఉంటే అప్పుడు అది సినీ నిర్మాతకి నష్టమే. కానీ ఈ ఓటీటీ రైట్స్ ఒక అమౌంట్‌కి ఒకేసారి అమ్మేస్తారు కనుక ఇక ఆ సినిమా ఓటీటీ యాప్‌లో ఉన్నా.. ఐబొమ్మలో ఉన్నా సినీ నిర్మాతకి నష్టం లేదు. ఒకవేళ ఓటీటీ వారి కోణంలో ఐబొమ్మ చేసింది తప్పే కావొచ్చు.. కానీ చాలా ఓటీటీ యాప్‌లు సబ్‌స్క్రిప్షన్‌కి ముందుగా ఒక రేటు పెడుతున్నారు.. అది మనం పే చేసి లోపలికి వెళ్లాక కూడా ఆ యాప్‌లో మనకి నచ్చిన సినిమా చూడటానికి లేదు.. మంచి సినిమాలన్నీ రెంట్‌కి పెడుతున్నారు.. లేదా అప్‌గ్రేడ్ చేసుకోమని మళ్లీ డబ్బులు అడుగుతున్నారు.. ఈ మధ్య యాడ్స్ వేస్తున్నారు.. అవి వద్దు అనుకుంటే మళ్లీ డబ్బులు కట్టమంటున్నారు.. ఇది కూడా దోపిడీయే కదా? మోసమే కదా..
చట్ట విరుద్ధంగా ఎవరు ఏ పని చేసినా అరెస్టు చేయాల్సిందే.. వారిని సమాజానికి దూరం పెట్టాల్సిందే. ఇంతకీ... బెనిఫిట్ షోలు చట్టవిరుద్ధమైనవి కావా? మొదటి ఆట కలెక్షన్ ఛారిటీలకు ఇవ్వటానికి వెసులుబాటుగా బెనిఫిట్ షో అని ఒకటి తెచ్చి వాటి మీద ఎటువంటి పన్నులు లేకుండా 1970ల్లో చట్టం చేశారు. ఇప్పుడు ఆ బెనిఫిట్ షోల డబ్బులు ఎంత వస్తున్నాయి, ఏయే ఛారిటీలకు ఇచ్చారో ఏ ప్రభుత్వమైనా ప్రజలకు చెప్పగలదా? అలా చెప్పలేనప్పుడు అవి చట్ట విరుద్ధం కదా?
ఐబొమ్మ రవికి వాళ్లమ్మ బుద్ధులు వచ్చాయని తండ్రి చెబుతున్నాడు గానీ, వాస్తవానికి గాడ్‌ఫాదర్ నుంచి ఓజీ వరకు సినిమాల్లో చూపించిన చట్టవ్యతిరేక దుర్మార్గాలను చూసే నేర్చుకొన్నాడేమో?! బిజినెస్‌మాన్, పుష్ప, కెజిఫ్‌లు మనకు నేర్పేది ఇంతకన్నా దారుణాలు, రాక్షసాలు కదా?
ఎన్‌కౌంటర్ చేయాల్సిందే..
తెలుగు సినీ పరిశ్రమ తలెత్తుకునేలాంటి సినిమాలు తీసిన (నవ్వకండి) నిర్మాత చిల్లర కల్యాణ్ ఐబొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలని సెలవిచ్చారు. కచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే సజ్జనార్‌కు ఆ చరిత్ర ఉంది. కానీ అంతకంటే ముందు సమాజాన్ని, యువతను చెడగొట్టే విధంగా బూతు సినిమాలు తీస్తున్నవాళ్లను ఎన్‌కౌంటర్ చేయండి. టికెట్ల రేట్లు అడ్డగోలుగా పెంచి జనాలను దోచుకుంటున్న వాళ్లను ఎన్‌కౌంటర్ చేయండి. ముఖ్యంగా మా శ్రీకాకుళం ప్రాంతం, మా వెనుకబడిన కులాలు, మా భాషలను తక్కువ చేసి చూపెట్టడం, జోకులు వేయడం చేసే సైన్మాలు తీసే వాళ్లని ఏసిపారేయండి.










మీరు రాసిన ఆర్టికల్ చాలా బాగుంది సార్
ఎన్ అశోక్
సీనియర్ జర్నలిస్ట్