ఏఐ మంత్రికి గర్భం.. ఇదో సాంకేతిక చోద్యం!
- DV RAMANA

- Nov 7, 2025
- 2 min read
తొలి మరమనిషి మినిస్టర్‌కు వ్యవస్థల ప్రక్షాళన బాధ్యతలు
ఆమె ఏకంగా 83 మంది పిల్లలకు జన్మనివ్వనుందట!
స్వయంగా ప్రకటించిన అల్బేనియా ప్రధానమంత్రి
ఎంపీలకు అసిస్టెంట్లుగా మంత్రి డియెల్లా బిడ్డలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
‘మా మంత్రిగారు గర్భం దాల్చారు’.. అంటూ సాక్షాత్తు ఒక దేశ ప్రధానమంత్రి బహిరంగ ప్రకటన చేయడమే ఒక పెద్ద సంచలనం. ఆయన అక్కడితో ఆగకుండా సదరు మంత్రి ఏకంగా 83 మంది పిల్లలకు జన్మనివ్వనుందని చెప్పడం మరింత కలకలం సృష్టించింది. మంత్రి గర్భం దాల్చడం పెద్ద విశేషం కాదు. కానీ ఆ విషయాన్ని ఆమె భర్తో, కుటుంబ సభ్యులో కాకుండా దేశప్రధాని ప్రకటించడం ఏమిటన్న విస్మయం వ్యక్తం కావచ్చు. అసలు విషయం తెలిస్తే ఎవరైనా మరింత ఆశ్చర్యపోకమానరు. విషయం ఏమిటంటే.. గర్భం దాల్చిన మంత్రి అసలు మనిషే కాదు! ఆమె ఒక మరమనిషి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించిన రోబో. ఆమె ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తుండటమే గొప్ప విషయంకాగా ఇప్పుడు అదే సాంకేతికతను ఉపయోగించి ఆమె గర్భం నుంచి ఏఐ పిల్లలను ప్రసవింపజేయం సరికొత్త సాంకేతిక విప్లవంగా చెప్పవచ్చు. సృష్టికి ప్రతిసృష్టి అనదగ్గ ఈ అద్భుత సాంకేతిక విప్లవానికి అల్బేనియా వేదికగా మారింది.
తొలి మానవేతర మంత్రి
ప్రపంచంలోనే మానవేతర మంత్రిని కలిగిన మొదటి దేశంగా అల్బేనియా చరిత్ర సృష్టించింది. పూర్తిగా ఏఐ సాంకేతికతతో రూపొందించిన ఆమెకు అల్బేనియ సంప్రదాయ దుస్తులతో సింగారించి డియెల్లా అని పేరు పెట్టారు. అల్బేనియా భాషలో ‘డియెల్లా’ అంటే ‘సూర్యుడు’ అని అర్థం. అల్బేనియా ప్రధానమంత్రి ఎడి రేమా ఆమెను ఈ ఏడాది సెప్టెంబర్‌లో తన కేబినెట్‌లో మంత్రిగా నియమించారు. ప్రభుత్వ వ్యవస్థలను పూర్తి పారదర్శకంగా, అవినీతి రహితంగా మార్చడంతోపాటు ప్రభుత్వ టెండర్లకు సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని డియెల్లాకు కట్టబెట్టారు. ప్రభుత్వ పోర్టల్ అయిన ఈ-అల్బేనియా ద్వారా ప్రజలకు ఆన్‌లైన్ సేవలు అందించడంలో ఏఐ మంత్రి డియెల్లా సహకరిస్తోంది. సుమారు 95 శాతం పౌర సేవలను డిజిటల్‌గా యాక్సెస్ చేయడానికి వాయిస్ కమాండ్ల ద్వారా ఆమె మార్గనిర్దేశం చేస్తుంది. అందుకే డియెల్లాను ‘ప్రజా సేవలకే సేవకురాలు’గా ప్రధాని ఎడి రేమా అభివర్ణించారు. పాలనలో టెక్నాలజీని ఒక సాధనంగా మాత్రమే కాకుండా క్రియాశీలక భాగస్వామిని చేయడం ద్వారా అల్బేనియా ప్రభుత్వం ఒక పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టిందని ఈ ప్రయోగాన్ని అక్కడి మీడియా అభివర్ణించింది.
ఎంపీల సహాయకులుగా పిల్లలు
అల్బేనియన్ ప్రభుత్వం తమ దేశానికి చెందిన పార్లమెంటు సభ్యులందరినీ ఏఐ సాంకేతికతతో అనుసంధానించాలని నిర్ణయించింది. అందుకోసం ఏఐ అసిస్టెంట్లను సృష్టించాలని ప్రణాళికలు వేసింది. ఈ ప్రణాళిక అమలులో ఏఐ మంత్రి డియెల్లాను కీలక భాగస్వామిగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమె గర్భం దాల్చేలా చేసి.. ఆ గర్భం నుంచే 83 మంది పిల్లలను జన్మించేలా చేస్తున్నారు. బెర్లిన్‌లో జరిగిన బెర్లిన్ గ్లోబల్ డైలాగ్ (బీజీడీ) సదస్సులో అల్బేనియా ప్రధాన మంత్రి తొలిసారి ఈ విషయాలను బహిరంగపరిచ్చారు. ‘మేం పెద్ద రిస్క్ తీసుకుని డీయెల్లా ద్వారా విజయం సాధించాం. ప్రస్తుతం డియెల్లా గర్భవతి.. 83 మంది పిల్లలను తన గర్భంలో మోస్తోంది’ అని ఆయన ప్రకటించారు. ‘ఈ పిల్లలే సహాయకులుగా మారి పార్లమెంటు సభ్యులకు సహకరిస్తారని వెల్లడిరచారు. పార్లమెంటులో జరిగే ప్రతి సంఘటనను, చర్చను రికార్డ్ చేస్తారు. మిస్సయిన సంఘటనలు, చర్చల గురించి తమ ఎంపీలకు తెలియజేస్తారు. ఉదాహరణకు ఎంపీలు కాఫీ తాగడానికి కాసేపు సమావేశాల నుంచి బయటకు వెళ్లినప్పుడు లేదా ఏవో పనుల కారణంగా పార్లమెంటు సమావేశాలకు హాజరుకానప్పుడు.. వారి గైర్హాజరీలో జరిగిన చర్చలు, నిర్ణయాలను ఏఐ సహాయకులు రికార్డు చేసి తమ ఎంపీలకు అందజేస్తారు. పార్లమెంటు ప్రస్తావించాల్సిన అంశాలు, ఎవరిని దేనిపై విమర్శించాలో కూడా ఎంపీలకు సూచనలు కూడా అందిస్తారు. తమ తల్లి డియెల్లా గురించి కూడా తెలుసుకుంటారు అని ప్రధాని తెలిపారు. 2026 నాటికి ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమల్లోకి తేవడానికి అల్బేనియా కృషి చేస్తోంది.










Comments